Benefits of Running : సంతోషంగా ఉండాలన్నా.. ఫిట్​గా మారాలన్నా.. రన్నింగ్​ చేయండి-benefits of running you will see healthy changes in your body in better way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Benefits Of Running You Will See Healthy Changes In Your Body In Better Way

Benefits of Running : సంతోషంగా ఉండాలన్నా.. ఫిట్​గా మారాలన్నా.. రన్నింగ్​ చేయండి

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 06, 2022 07:38 AM IST

Benefits of Running : ఎక్కువమంది రన్నింగ్ చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. ఓపిక అయిపోతుందనో.. లేక శక్తి లేదనో ఆగిపోతూ ఉంటారు. కానీ రన్నింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఫిట్​నెస్ నిపుణులు. జిమ్​లకు వెళ్లి కసరత్తులు చేసినా.. లేదా ఇంట్లోనే వ్యాయామాలు చేసినా.. రన్నింగ్​ కూడా చేయాలంటున్నారు. ఏమి చేయకుండా కేవలం రన్ చేసినా ఫిట్​గా ఉండొచ్చు అంటున్నారు.

రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు

Benefits of Running : రన్నింగ్ కేవలం బరువు తగ్గడానికో.. మనకు చెమట త్వరగా వచ్చేలా చేయడానికో.. ఊపిరి పీల్చుకోవడం గురించో కాదు. రన్నింగ్ చాలా శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దీని కోసం కిలోమీటర్లు.. మారథాన్​లో పాల్గొంటున్నట్లు పరుగెత్తనవసరం లేదు. చిన్న చిన్నగా ప్రారంభించినా చాలు. అవి మీ శరీరానికి మేలు చేస్తాయి. రన్నింగ్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ మీరు క్రమం తప్పకుండా చేస్తే మాత్రం.. మీరు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందుకోవచ్చు. ఇప్పటివరకు చేయలేదు అని బాధపడే బదులు.. ఇప్పుడైనా ప్రారంభించండి. అసలు రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చుద్దాం.

సంతోషంగా ఉంటారు

పలు అధ్యయనాల ప్రకారం.. డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తులు.. తమ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ముప్పై నిమిషాల పరుగెత్తితే సరిపోతుందని తేల్చాయి. అంతేకాకుండా ఈ ప్రభావాన్ని పొందడానికి వేగంగా పరిగెత్తాల్సిన అవసరమేమిలేదని నిరూపించాయి. నడిచే టెంపోలో పరుగెత్తే వారిలో కూడా ఈ ఫలితాలు కనిపిస్తాయని తెలిపారు. మీరు ఎక్కువసేపు పరిగెత్తినప్పుడు.. మీ శరీరంలో ఎండార్ఫిన్‌లు ఉత్పత్తి కావడం ప్రారంభమవుతాయి. ఇది మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.

చాలా కేలరీలు బర్న్ చేస్తారు

రన్నింగ్‌కు చాలా కేలరీలు అవసరం. మీరు గాలికి వ్యతిరేకంగా పరుగెత్తినా.. ఎత్తుపైకి పరుగెత్తినా మీరు చాలా ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తారు. అంతేకాకుండా మీ మోకాళ్లు బలంగా మారుతాయి. మోకాలి ఆరోగ్యానికి రన్నింగ్ చాలా మంచిది. రన్నర్లు కాని వారి కంటే రన్నర్లు మోకాలి నొప్పితో బాధపడే అవకాశం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విషయం ఏమిటంటే.. రన్నింగ్ ప్రజలు సాధారణ శరీర ద్రవ్యరాశి సూచికను నిర్వహించడానికి, లెగ్ కండరాలు, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పరుగెత్తుతున్నప్పుడు మీ పాదాలు నేలను కొట్టిన ప్రతిసారీ.. మీ కండరాలు, స్నాయువులు ఒత్తిడికి గురై బలంగా మారుతాయి.

కండరాలు, ఎముకల బలానికై..

ఏ రకమైన ప్రభావం లేకుండా నడవడం, ఈత కొట్టడం వంటి ఇతర కార్యకలాపాలు మీ కండరాలు, ఎముకలను బలోపేతం చేయవు. కానీ పరుగెడితే.. కండరాలు, ఎముకలు మీకు అనుకూలిస్తాయి. బలంగా మారతాయి.

ఆరోగ్యకరమైన హృదయం కోసం

ఏరోబిక్ వ్యాయామాలు హృదయనాళ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. దీనికోసం మీరు ఎక్కువ సమయం పరుగెత్తాల్సిన అవసరం లేదు. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి పది నిమిషాలు నెమ్మదిగా జాగింగ్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు ప్రతిరోజూ పరుగెత్తాలి.

మెదడు మరింత సమర్ధవంతంగా పని చేస్తుంది

మీరు నిన్న లంచ్‌లో ఏమి తిన్నారో ఇప్పటికే మర్చిపోయి ఉంటే లేదా మీరు మీ బైక్​ కీలను ఎక్కడ పెట్టారో వెంటనే గుర్తించలేకపోతే.. మీరు రన్నింగ్ స్టార్ట్ చేయండి. మీ హృదయ స్పందన రేటును పెంచే, చెమట పట్టేలా చేసే ఏరోబిక్ వ్యాయామాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.

మెరుగైన నిద్రవస్తుంది..

శాస్త్రవేత్తలు క్రమం తప్పకుండా వారానికి కనీసం ఐదు సార్లు ముప్పై నిమిషాల పాటు మితమైన టెంపోతో పరిగెత్తే వారు బాగా నిద్రపోవడం ప్రారంభించారని కనుగొన్నారు. ఇది ప్రయోజనకరంగా ఉంటూ.. వారి మానసిక మెరుగుదలపై కూడా మంచి ప్రభావాన్ని చూపించిందని తెలిపారు.

రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది

ముప్పై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు క్రమం తప్పకుండా పరుగెత్తడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇది వివిధ రకాల క్యాన్సర్‌ల వల్ల చనిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్