Ekadashi Fasting: ఏకాదశి రోజున ఉపవాసానికి సాబుదానా పాయసం, సాబుదానా అట్లు ఇలా చేసి తినొచ్చు..
Ekadashi Food: ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటున్నారా? అయితే ఆరోజు తప్పకుండా చేసుకుని వీటిని తినాల్సిందే. సాబుదానా చేసే ఈ వంటల తయారీ చూసేయండి.
ఏకాదశి ఉపవాసం మీరు కూడా ఉంటే ఆరోజు మీకు శక్తినిచ్చే ఆహారాలు తీసుకోవాల్సిందే. సాధారణంగా బియ్యం, పప్పులు, కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఈ రోజు తినరు. బదులుగా బంగాళదుంపలు, చిలగడ దుంపలు, సాబుదానా లేదా సగ్గుబియ్యం లాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు. సాబుదానాతో చేసిన కిచిడీ లేదా వడలు ఎక్కువగా తింటారు. దీనివల్ల తక్షణ శక్తి వచ్చి నీరసం రాకుండా ఉంటుంది. అయితే ఇవే కాకుండా సాబుదానా పాయసం, బంగాళదుంప వాడి చేసే సాబుదానా సర్వపిండి లేదా తాలీపీట్ ఎలా చేయాలో చూసేయండి.
1. సాబుదానా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు సాబుదానా
రెండున్నర కప్పుల నీళ్లు
2 కప్పుల చిక్కటి పాలు
మీ రుచికి సరిపడా పంచదార 4 నుంచి 5 చెంచాలు
సగం చెంచా యాలకుల పొడి
2 చెంచాల జీడిపప్పు ముక్కలు
సగం చెంచా ఎండు ద్రాక్ష
చిటికెడు కుంకుమ పువ్వు
సాబుదానా పాయసం తయారీ విధానం:
- ముందుగా సాబుదానా బాగా కడిగి నీల్లు వంచేయాలి. నీల్లలో అరగంట నుంచి గంటపాటూ నానబెట్టుకోవాలి.
- కడాయి పెట్టుకుని నీళ్లతో సహా సాబుదానా వేసేసుకోవాలి. మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
- ఈలోపు మరో పాత్ర పెట్టుకుని పాలను కూడా వేడి చేసుకోవాలి. కాస్త వేడయ్యాక ఈ పాలను ఉడుకుతున్న సాబుదానాలో పోసేయాలి.
- మరో అయిదు నిమిషాలు పాలు, సాబుదానా ఉడకనివ్వాలి. పాలు కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి.
- అన్నీ బాగా కలియబెట్టి కనీసం పావుగంట అయినా ఉడికించుకోవాలి. కాసేపటికి సాబుదానా పారదర్శకంగా మెత్తగా అయిపోతుంది.
- వెంటనే స్టవ్ కట్టేసి నేతిలో వేయించుకున్న జీడిపప్పు ముక్కలు, ఎండుద్రాక్ష వేసుకోవాలి. అవసరమైతే పంచదార కూడా ఇప్పుడే కలుపుకోవచ్చు. వేడిగా లేదా చల్లగా ఎలా అయినా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు.
2. సాబుదానా అట్టు
దీని తయారీకి బంగాళదుంప, సాబుదానా ఎక్కువగా వాడతాం. ఇవి ఉపవాసం రోజు తినడం వల్ల మంచి శక్తి వస్తుంది. కాస్త సర్వపిండిని పోలినట్లుండే దీని తయారీ ఎలాగో చూసేయండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు:
కప్పు సాబుదానా
3 బంగాళదుంపలు ఉడికించుకున్నవి
పావు కప్పు పల్లీలు, వేయించుకున్నవి
పావు కప్పు కొత్తిమీర (ఉపవాసం రోజు చేస్తే వాడకండి)
1 చెంచా జీలకర్ర
1 చెంచా నిమ్మరసం
తగినంత సైంధవలవణం
సాబుదానా అట్టు తయారీ విధానం:
- ముందుగా సాబుదానా శుభ్రంగా కడిగి కనీసం నాలుగైదు గంటలపాటు నానబెట్టుకోవాలి.
- నానిన సాబుద్దానాలో నుంచి నీళ్లు పూర్తిగా తీసేసి ఒక పెద్ద బౌల్ లోకి వేసుకోవాలి.
- అందులో బాగా మెదుపుకున్న బంగాళదుంప ముద్ద లేదా పచ్చి బంగాళదుంప వాడితే దాన్ని సన్నగా తురిమి వేసుకోవచ్చు. కొత్తిమీర, జీలకర్ర, నిమ్మరసం, సైందవ లవణం వేసుకోవాలి.
- అన్నీ బాగా కలిపి ముద్దలాగా చేసుకోవాలి. ముద్దను అట్టులాగా చేయాలంటే కాస్త గట్టిగా ఉండాలి కాబట్టి వేయించిన పల్లీలను మిక్సీ పట్టి ఆ పొడిని ఇందులో వేసి కలుపుకోండి. ఉపవాసం లేకపోతే పల్లీల పొడితో పాటే కాస్త బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు.
- ఈ ముద్దను నాలుగైదు ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి.
- పెనం పెట్టుకుని నూనె రాసుకోండి. దానికి అట్టులాగా సాబుదానా మిశ్రమాన్ని సన్నగా ఒత్తుకోండి.
- అంచుల వెంబడి నూనె పోసుకుని మూత పెట్టి కాల్చుకోండి. కాస్త బంగారు వర్ణంలోకి వస్తే సరిపోతుంది. రెండు వైపులా కాల్చుకుంటే సాబుదానా అట్లు రెడీ అయినట్లే.