అనాదిగా భారత దేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది ఆయుర్వేద వైద్యం. మనిషి శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను సరి సమానంగా చేస్తే రోగాలు రావని చెబుతుంది. వీటిని బ్యాలెన్స్ చేయడం ఈ వైద్యంలో ఒక భాగం. మనం జీడి పప్పు, బాదాం, ఎండు ద్రాక్ష, ఖర్జూరం లాంటి ఎన్నో డ్రై ఫ్రూట్స్ ని ఆరోగ్య ప్రయోజనాల కోసం తింటుంటాం. ఎప్పుడు, ఎలా తింటే వీటి వల్ల వచ్చే ప్రయోజనాలు చక్కగా శరీరానికి అందుతాయో ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుని ఆచరించేందుకు ప్రయత్నిద్దాం.
డ్రై ఫ్రూట్స్‌లో కిస్‌మిస్‌లు, అంజీర్‌ల లాంటివి చలవ చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. మన శరీరంలో పిత్త దోషం ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే జీడిపప్పు, పిస్తా.. లాంటివి కొద్దిగా వేడి చేసే లక్షణాలతో ఉంటాయి. అంటే మన శరీరంలో వాత, కఫ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి శరీరంలో ఉన్న మూడు దోషాలనూ బ్యాలెన్స్ చేస్తాయి. ఈ గుణాలను, మన శారీరక స్వభావాలను దృష్టిలో ఉంచుకుని వీటిని తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కొందరు డ్రై ఫ్రూట్స్‌ని రోస్ట్ చేసుకుని తింటారు. కొందరు నెయ్యిలో ఉప్పూ కారం, మసాలాలు చల్లి తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఆయుర్వేద నిపుణులు మాత్రం వీటిని ఏమీ చేయకుండా సహజంగా ఉన్న వాటిని ఉన్నట్లుగా తినమంటున్నారు. నెయ్యిలో వేయించడం, ఉప్పును పై నుంచి చల్లుకోవడం లాంటి వాటి వల్ల మనలోకి ఎక్కువగా కొవ్వులు, సోడియం చేరతాయంటున్నారు. అందువల్ల దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. వీటిలో పోషకాలు, పీచు పదార్థం అధికంగా ఉంటాయి కాబట్టి బాగా నమిలి తినమని సలహా ఇస్తున్నారు.