Makarasan: మొసలిలా పడుకుంటే చాలు.. నడుము నొప్పి మాయం చేసే ఆసనమిది-know about makarasan to releive back pain effectively ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Makarasan: మొసలిలా పడుకుంటే చాలు.. నడుము నొప్పి మాయం చేసే ఆసనమిది

Makarasan: మొసలిలా పడుకుంటే చాలు.. నడుము నొప్పి మాయం చేసే ఆసనమిది

Koutik Pranaya Sree HT Telugu
Jul 27, 2024 01:30 PM IST

Makarasan: మకరాసనం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం దొరకుతుంది. ఈ ఆసనం గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.

మకరాసనం
మకరాసనం

మకరం అంటే మొసలి. మొసలి లాగా పడుకుని చేసే ఆసనం ఇది. అందుకే మకరాసనం అయ్యింది దీని పేరు. చాలా సింపుల్‌గా చేయగలిగే ఈ ఆసనం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. ఈ ఆసనం లాభాలు, ఎలా చేయాలో, ఎవరు చేయకూడదో లాంటి వివరాలన్నీ తెల్సుకోండి.

నడుము నొప్పి వల్ల రోజూవారీ పనులు కూడా సరిగ్గా చేయలేకపోతారు. చాలా రకాల వ్యాయమాలు ఈ నొప్పి ఉపశమనం కోసం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి మకరాసనం. ఆంగ్లంలో క్రొకడైల్ పోజ్ అంటారు దీన్ని. ఈ ఆసనం వల్ల నడుములో బలం పెరుగుతుంది. నొప్పి నుంచి ఉపశమనం దొరకుతుంది.

మకరాసనం లాభాలు:

1. నడుము కింది భాగంలో ఈ ఆసనం చేయడం వల్ల బలంగా మారతాయి. వెన్నెముకకు దీనివల్ల మద్దతు దొరుకుతుంది. కండరాల బలహీనత వల్ల వచ్చిన నొప్పి క్రమంగా తగ్గిపోతుంది.

2. మకరాసనం క్రమంగా చేయడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. తొడలు, నడుము కింది భాగం బాగా సాగుతాయి. ఒత్తిడి కూడా ఈ ఆసనం వల్ల తగ్గుతుంది.

3. రక్త ప్రసరణను మకరాసనం పెంచుతుంది. నడుము కింది భాగంలో రక్త ప్రసరణ ఈ ఆసనం ద్వారా పెరుగుతుంది. పోషకాలు, ఆక్సిజెన్ కండరాలకు సరఫరా జరిగి క్రమంగా నొప్పి నుంచి కోలుకుంటారు.

4. కూర్చునే స్థితిని మకరాసనం మెరుగుపరుస్తుంది. వెన్నెముక మీద సున్నితమైన ఒత్తిడి కలిగించి కూర్చునే భంగిమ మెరుగుపరుస్తుంది.

మకరాసనం ఎలా చేయాలి?

1. ముందుగా కాస్త ప్రశాంతంగా ఉన్న చోటును ఈ ఆసనం కోసం ఎంచుకోవాలి. సౌకర్యంగా పడుకునేలా ఉండాలి.

2. యోగా మ్యాట్ మీద ముందుగా బోర్లా పడుకోవాలి. కాళ్లు చాపాలి. చేతులను మడిచి మీ నుదురు భాగం వాటి మీద ఉంచాలి. మెడ, భుజాలు రిలాక్స్ అయ్యేలా చూడాలి.

3. ఇప్పుడు కాళ్లు, తొడలు వీలైనంత దూరంగా ఉంచాలి. కాలి వేళ్లను ఫ్రీ గా వదిలేయాలి.

4. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. మీ శ్వాస వల్ల శరీరం సాంత్వన పొందాలి. శ్వాస వదిలేటప్పుడు మీ నడుము మీద ఒత్తిడి పడుతుంది గమనించండి.

5. ఇప్పుడు మోచేతులు భూమిని తాకేలా ఉంచి చేతులను తల దగ్గరికి తీసుకెళ్లాలి. శ్వాస తీసుకుని మెల్లగా తలను, చాతీని, భుజాలను పైకి ఎత్తాలి. బరువంగా మోచేతుల్లో ఉంటుందిప్పుడు.

6. ఈ స్థితిలో రెండు నిమిషాలుండాలి. లేదంటే మీకు సౌకర్యంగా ఉన్నంత సేపుండాలి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి.

7. ఇప్పుడు మెల్లగా చాతీని, భుజాలను నేలకు తాకనివ్వాలి. మీ నుదుటిని చేతులు మడిచి దానిమీద పెట్టుకోవాలి.

వీళ్లు మకరాసనం చేయకూడదు:

1. ఈ మధ్యే నడుము భాగంలో సర్జరీ లాంటివి లేదా గాయం అయితే ఈ ఆసనం చేయకూడదు.

2. ఈ ఆసనం చేసేటప్పుడు సౌకర్యం లేకపోతే, భరించలేనంత నొప్పి లాంటివి అనిపిస్తే చేయకండి.

3. ముందు తక్కువ నిడివితో ఆసనం చేయండి. క్రమంగా సమయం పెంచుతూ వెళ్లండి.

Whats_app_banner