Karachi Halwa: కార్న్ ఫ్లోర్‌తో కరాచీ హల్వా ఇలా చేసేయండి, రెసిపీ చాలా సులువు-karachi halwa recipe in telugu know how to make this sweets ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Karachi Halwa: కార్న్ ఫ్లోర్‌తో కరాచీ హల్వా ఇలా చేసేయండి, రెసిపీ చాలా సులువు

Karachi Halwa: కార్న్ ఫ్లోర్‌తో కరాచీ హల్వా ఇలా చేసేయండి, రెసిపీ చాలా సులువు

Haritha Chappa HT Telugu
Apr 06, 2024 05:30 PM IST

Karachi Halwa: కరాచీ హల్వా అంటే మీకు ఇష్టమా? ఒక్కసారి కార్న్ ఫ్లోర్‌తో చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కరాచీ హల్వా రెసిపీ ఎలాగో ఇక్కడ ఇచ్చాము .

హల్వా రెసిపీ
హల్వా రెసిపీ

Karachi Halwa: కరాచీ హల్వా పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇది మెత్త మెత్తగా జెల్లీలాగా ఉంటుంది. దీని ఇంట్లోనే తినవచ్చు. చాలామంది దీని కొనుక్కునే తింటారు. ఇంట్లో చేయలేమని అనుకుంటారు, నిజానికి దీన్ని సులువుగా ఇంట్లో చేసుకోవచ్చు. కరాచీ హల్వా రెసిపీ ఎలాగో ఇక్కడ చెప్పాము .

కరాచీ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

చక్కెర - 200 గ్రాములు

కార్న్ ఫ్లోర్ - 50 గ్రాములు

నెయ్యి - 100 గ్రాములు

నీరు - తగినంత

నిమ్మరసం - ఒక స్పూను

పసుపు రంగు - చిటికెడు

జీడిపప్పు - అరకప్పు

యాలకుల పొడి - ఒక స్పూను

కరాచీ హల్వా రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార, నీరు, నిమ్మరసం వేసి మరగనివ్వాలి.

2. చక్కెర మొత్తం కరిగిపోయాక అది సలసలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.

3. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి అందులో నీళ్లు వేసి దోశెల పిండిలా పలచగా కలుపుకోండి.

4. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి చిన్న మంటను పెట్టండి.

5. అందులో అర టీ స్పూన్ నెయ్యి వేసి కార్న్ ఫ్లోర్ పిండిని వేసి కలుపుకోవాలి.

6. కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని మెల్లగా వేసి కలుపుతూ ఉండాలి.

7. అది కాస్త చిక్కగా అవ్వగానే స్టవ్ కట్టేయండి.

8. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముందుగా మరిగించి పెట్టుకున్న పంచదార సిరప్‌ను కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి.

9. మళ్లీ స్టవ్ వెలిగించి చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని కొద్దిగా చిక్కగా అయ్యేవరకు కలుపుతూ ఉండండి.

10. ఆ తర్వాత నెయ్యిని వేయండి. నెయ్యిని బాగా కలిపాక పసుపు రంగు ఫుడ్ కలర్ వేసి కలపండి.

11. మిశ్రమం పసుపుగా మారుతుంది. ఆ తర్వాత యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి.

12. చివరగా తరిగిన జీడిపప్పులను చల్లుకొని బాగా కలపండి.

13. నెయ్యి పైకి తేలి మిశ్రమం గట్టిగా అయ్యేంతవరకు ఉంచి స్టవ్ కట్టేయండి.

14. ఇప్పుడు ఒక ప్లేట్ కి అడుగుభాగాన నెయ్యిని రాసి ఈ మిశ్రమం మొత్తాన్ని అందులో వేయండి.

15. ఇక్కడ ఎత్తుపల్లాలు లేకుండా ఉపరితలాన్ని సమానంగా చేయండి.

16. ఒక గంట పాటు వదిలేస్తే అది జెల్లిలాగా గట్టిపడుతుంది. అప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేస్తే సరిపోతుంది. దీని రుచి అదిరిపోతుంది. ఎవరైనా ఒక్కసారి తిన్నారంటే మిమ్మల్ని మళ్ళీ అడుగుతారు .

దీనిలో ప్రధాన పదార్థం పంచదారే. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు తినక పోవడమే మంచిది. మిగతా పదార్థాలన్నీ కొద్దికొద్దిగా వాడాము. పంచదార, నెయ్యి మాత్రం అధికంగా వాడాం, కాబట్టి బరువు తగ్గాలనుకుంటున్నవారు ఈ స్వీట్ కి దూరంగా ఉంటే మంచిది.

టాపిక్