Cashew: కిలో జీడిపప్పు 30 రూపాయలు, కావాలంటే ఆ ఊరు వెళ్లి కొనుక్కోండి-30 rupees per kilo of cashew nuts if you want it go to nala village ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cashew: కిలో జీడిపప్పు 30 రూపాయలు, కావాలంటే ఆ ఊరు వెళ్లి కొనుక్కోండి

Cashew: కిలో జీడిపప్పు 30 రూపాయలు, కావాలంటే ఆ ఊరు వెళ్లి కొనుక్కోండి

Haritha Chappa HT Telugu
Mar 02, 2024 12:50 PM IST

Cashew: జీడిపప్పు అత్యంత తక్కువ ధరకు దొరుకుతున్న గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం మనదేశంలోనే ఉంది. ఆ గ్రామం పేరు నాలా. జార్ఖండ్లో ఉంది ఈ ఊరు.

జీడిపప్పులు
జీడిపప్పులు (pixabay)

Cashew: కిలో జీడిపప్పు కొనాలంటే కనీసం 600 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే, కానీ మన దేశంలోని ఓ గ్రామంలో మాత్రం కేవలం 30 రూపాయలకే ఇస్తారు. మీకు కావాలనుకుంటే ఆ గ్రామానికి వెళ్లి ఓ పది కిలోలు కొని తెచ్చి పెట్టుకోవచ్చు. అలాగని తక్కువ క్వాలిటీ అనుకోకండి, అక్కడ దొరికేది మంచి క్వాలిటీ జీడిపప్పు. ఎంతోమంది ఆ గ్రామానికి వెళ్లి వందల కిలోలు కొనుక్కొని వస్తారు. వాటిని ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? జార్ఖండ్ రాష్ట్రంలోని జంతార అనే జిల్లాలో ఉంది ఆ గ్రామం. పేరు నాలా. దీన్ని జార్ఖండ్ జీడిపప్పు నగరం అని కూడా పిలుస్తారు. ఆ గ్రామానికి వెళ్తుంటే దారిలోనే రోడ్డు పక్కన జీడిపప్పులు రాశులుగా పోసి ఉంచుతారు. 20 నుంచి 30 రూపాయలకే కిలో అమ్ముతూ ఉంటారు.

కూరగాయలే ఇప్పుడు కిలో 100 రూపాయలకి చేరుకున్నాయి. అంతకన్నా తక్కువ ధరకే నాలా గ్రామంలో జీడిపప్పు అమ్మడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చుట్టుపక్కల నగరాల వారు ఈ గ్రామానికి వచ్చి జీడిపప్పును కొని తీసుకువెళ్తారు. 100 రెట్లు అధిక ధరకు అమ్ముకొని జీవిస్తున్న దళారులు ఎంతోమంది ఉన్నారు.

అంత తక్కువ ధరకు ఎలా

జీడిపప్పును నాలా గ్రామంలో అంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని సందేహం ఎక్కువ మందికి వచ్చే ఉంటుంది. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఈ గ్రామంలోని వాతావరణం, నేలలు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇదే విషయాన్ని 2010లో అటవీశాఖ గుర్తించింది. అంతకుముందు గ్రామస్తులు అక్కడ జీడిపప్పు తోటలను వేసేవారు కాదు. ఎప్పుడైతే అటవీశాఖ చెప్పిందో అప్పటినుంచి గ్రామస్తులు జీడి తోటలను పెంచడం మొదలుపెట్టారు. గ్రామం అంతా కూడా జీడినే సాగు చేయడం ప్రారంభించారు. దీంతో జీడిపప్పు విపరీతంగా పండేయడం మొదలుపెట్టింది. ఆ జీడిపప్పును అమ్మేందుకు దూర ప్రాంతాలకు ఈ రైతులు వెళ్లలేరు. అందుకే చాలా తక్కువ ధరకి తమ దగ్గరకు వచ్చేవారికి అమ్మేయడం మొదలుపెట్టారు. అలా కిలో 30 నుంచి 50 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇంతగా అక్కడ జీడిపప్పులు పండుతున్నా కూడా ఎలాంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు లేవు. దీనివల్లే జీడిపప్పు చాలా తక్కువ ధరకు అక్కడ అమ్మి తమను పోషించుకుంటున్నారు.

నాలా గ్రామంలో 580 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమి మొత్తం జీడి తోటలతో నిండిపోయి ఉంటుంది. ఇక జనాభా విషయానికి వస్తే కేవలం 2200 మంది మాత్రమే నివసిస్తున్నారు. వారిలో నిరక్షరాస్యులే ఎక్కువ. ఇక గ్రామం అంతా జీడి తోటల పైనే ఆధారపడి జీవిస్తోంది. అక్కడ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే అక్కడ రైతుల జీవితమే మారిపోతుంది. జీడిపప్పులు ఎక్కువ ధరకు అమ్మే అవకాశాన్ని ప్రభుత్వమే కల్పించాలి.

జీడిపప్పును ప్రపంచంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. ఇక ఆంధ్రప్రదేశ్లో జీడిపప్పు సాగు ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో జీడిపంట అధికంగా ఉంటుంది. జీడిపప్పు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ చేరుతుంది. వైద్యులు కూడా గుప్పెడు జీడిపప్పులు తినమని చెబుతారు. నాలా గ్రామంలో తప్ప మిగతా అన్ని చోట్ల జీడిపప్పు ధర మండిపోతుంది.

WhatsApp channel

టాపిక్