Tomato chutney: స్పైసీగా టమోటో కరివేపాకు పచ్చడి ఇలా చేయండి, అన్నంతో, దోశెలతో అదిరిపోతుంది-spicy tomato curry leaves chutney recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Chutney: స్పైసీగా టమోటో కరివేపాకు పచ్చడి ఇలా చేయండి, అన్నంతో, దోశెలతో అదిరిపోతుంది

Tomato chutney: స్పైసీగా టమోటో కరివేపాకు పచ్చడి ఇలా చేయండి, అన్నంతో, దోశెలతో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Dec 28, 2023 12:11 PM IST

Tomato chutney: టమోటో, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి చేసే పచ్చడి రుచిగా ఉంటుంది. దీన్ని ఇడ్లీ, ఉప్మా, అన్నం ఇలా ఎందులో కలుపుకున్నా రుచిగానే ఉంటుంది.

టమోటా కరివేపాకుల పచ్చడి
టమోటా కరివేపాకుల పచ్చడి ( Padhuskitchen/Youtube)

Tomato chutney: టమోటా పచ్చడి అంటే చెవి కోసుకునే వారు ఎంతోమంది. దీనికి కరివేపాకు కూడా జోడిస్తే పోషకాలు పరంగా ఇది గొప్పగా ఉంటుంది. దీని వాసనే కాదు రుచి కూడా అదిరిపోతుంది. టమోటో కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోండి. తక్కువ స్పైసీగా తినేవారు పచ్చిమిర్చి తగ్గించుకుంటే సరిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే అన్నంలోనూ, దోశెలోనూ, ఇడ్లీ లోనూ, ఉప్మా లోనూ కూడా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే రుచిగా ఉంటుంది. టమోటో కరివేపాకు పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.

కరివేపాకు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

టమోటాలు - పావు కిలో

కరివేపాకు - ఒక కప్పు

నువ్వులు - ఒకటిన్నర స్పూను

పచ్చికొబ్బరి తురుము - అరకప్పు

నూనె - మూడు టేబుల్ స్పూన్లు

పచ్చిమిర్చి - ఎనిమిది

కొత్తిమీర - పావు కప్పు

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

ఎండుమిర్చి - రెండు

పచ్చి సెనగపప్పు - ఒక స్పూన్

మినప్పప్పు - అర స్పూను

టమోటో కరివేపాకు పచ్చడి రెసిపీ

1. టమోటోలను కరివేపాకును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. టమోటోలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. అందులో నువ్వులను వేసి చిటపటలాడనివ్వాలి.

3. అందులోనే కొబ్బరి తురుమును కూడా వేసి కలుపుకోవాలి. నిలువుగా కోసిన పచ్చిమిర్చిని వేసి వేగనివ్వాలి.

4. ఆ మిశ్రమంలో శుభ్రంగా కడుక్కున్న కరివేపాకులను, కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి.

5. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

6. ఇప్పుడు అదే మూకుడులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి టమాటో ముక్కలను పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి.

7. టమోటా ముక్కల్లో ఉప్పు కూడా వేస్తే త్వరగా మగ్గుతుంది.

8. టమోటా ముక్కలను చల్లారాక మిక్సీ జార్ లోనే వేసి కరివేపాకు మిశ్రమంతో కలిపి రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకోవాలి.

9. మరీ పేస్టులా ఉంటే ఇది టేస్టీగా ఉండదు. కాబట్టి కాస్త బరకగానే రుబ్బుకోవాలి.

10. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి తాలింపు వేసేందుకు స్టవ్ మీద కళాయి పెట్టాలి.

11. అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి వేగాక పచ్చడిలో వేసుకోవాలి. అంతే టమోటో కరివేపాకు పచ్చడి రెడీ అయినట్టే.

ఆరోగ్యానికి మేలు చేసే టమాటాలు, కరివేపాకులు, పచ్చికొబ్బరి కొత్తిమీర ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు కూడా పోషకాల గనులగానే చెబుతారు. టమోటాల్లో ఉండే లైకోపీన్ మన శరీరాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే కెరోటనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోజువారీ ఆహారంలో టమాటాలను చేర్చుకోవడం వల్ల చర్మం, జుట్టు కాంతివంతంగా మారుతాయి. కరివేపాకులు చాలా తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తాయి. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళనతో బాధపడుతున్న వారు కూడా కరివేపాకులను తమ డైట్ లో భాగం చేసుకోవాలి. కొత్తిమీరను రోజూ తింటే బిపీ, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఆస్తమా, శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారు కొత్తిమీరను ప్రతిరోజు తినాలి. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడానికి కొత్తిమీర సహాయపడుతుంది.

Whats_app_banner