Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు
Kakarakaya Ullikaram: కాకరకాయ కచ్చితంగా డయాబెటిస్ పేషెంట్లు తినాల్సిందే. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే శక్తి కాకరకాయకు ఉంటుంది. కాకరకాయ ఉల్లికారం కూర వండుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది.
Kakarakaya Ullikaram: కాకరకాయతో వండిన రెసిపీలను ఇష్టపడే వారి సంఖ్య తక్కువే. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది. నిజానికి కాకరకాయ చేసే మేలు ఇంత అంతా కాదు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారు.. ప్రతిరోజు కాకరకాయ తిన్నా మంచిదే. టేస్టీగా కాకరకాయ ఉల్లికారం కూర వండుకుని చూడండి. వేడి వేడి అన్నంలో ఈ కూరను కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు. కాకరకాయ లోని చేదును కూడా మైమరచిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర. దీన్ని వండడం చాలా సులువు.
కాకరకాయ ఉల్లికారం కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
కాకరకాయలు - ఐదు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - చిటికెడు
కరివేపాకు - గుప్పెడు
కారం - ఒక స్పూను
నూనె - సరిపడినంత
ఉల్లిపాయలు - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
కాకరకాయ ఉల్లి కారం కూర రెసిపీ
1. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడగాలి. మధ్యలోకి కోసి లోపల ఉన్న గింజలను తీసేయాలి.
2. అన్నింటినీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేయాలి.
3. ఆ నూనెలో కాకరకాయలను వేయించుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేసి వేయిస్తే కాకరకాయల్లో నీరు త్వరగా దిగుతుంది.
4. ఆ తర్వాత ఉల్లిపాయలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ ముద్దను కూడా అందులో వేయాలి.
5. ఆ ఉల్లి ముద్దతో పాటు పసుపు, ఉప్పు, కారం, కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి.
6. ధనియాల పొడి, కాస్త గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఈ మొత్తం కూరను చిన్న మంట మీద పావుగంట పాటు ఉడికిస్తే టేస్టీగా కాకరకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోతుంది.
8. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. డయాబెటిస్ రోగులు వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు ఈ కూరను తినడం మంచిది.
కాకరకాయలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం దానిలోని చేదుని చూసి ఎంతోమంది పక్కన పడేస్తారు. చేదును చూడకుండా అది ఇచ్చే పోషకాలను చూస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు కాకరకాయతో చేసిన రెసిపీలను తినేందుకు ప్రయత్నించాలి. ఈ రెసిపీలో మనం ఉల్లిపాయలు, కాకరకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలనే వాడాము. కాబట్టి ఒకసారి ఈ కాకరకాయ ఉల్లికారం కూరను ప్రయత్నించి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.