Gutthi Kakarakaya Curry: గుత్తి వంకాయలాగే గుత్తి కాకరకాయ కర్రీ వండి చూడండి, మధుమేహుల కోసం స్పెషల్ రెసిపీ
Gutthi Kakarakaya Curry: డయాబెటిక్ రోగులకు కాకరకాయతో చేసిన వంటకాలు మేలు చేస్తాయి. గుత్తి వంకాయలాగే గుత్తి కాకరకాయను కూడా వండవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది.
Gutthi Kakarakaya Curry: కాకరకాయతో చేసిన వంటకాలను ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ కాకరకాయ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు కాకరకాయ చేసే మేలు ఇంతా అంతా కాదు. కాకరకాయ చేదుగా ఉంటుందన్న ఒకే ఒక కారణంగా ఎంతో మంది దీనిని తినకుండా పక్కన పడేస్తున్నారు. దాన్ని చేదు లేకుండా వండుకోవచ్చు. గుత్తి వంకాయ ఎలా వండుతారో గుత్తి కాకరకాయలు కూడా అలా వండి చూడండి. రుచి అదిరిపోతుంది. డయాబెటిక్ రోగులకు ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. డయాబెటిస్ లేని వారు కూడా దీన్ని ఇష్టంగా తినవచ్చు.
గుత్తి కాకరకాయ కర్రీ రెసిపి
కాకరకాయలు - ఆరు
ఉల్లిపాయ - ఒకటే
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కారం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
చింతపండు - చిన్న ఉసిరికాయంత సైజులో
నూనె - నాలుగు స్పూన్లు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - మూడు
యాలకులు - మూడు
ఎండుమిర్చి - నాలుగు
జీలకర్ర - రెండు స్పూన్లు
ధనియాలు - రెండు స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము - రెండు స్పూన్లు
నువ్వులు - రెండు స్పూన్లు
పల్లీలు నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - అర స్పూను
గుత్తి కాకరకాయ కర్రీ రెసిపీ
1. కాకరకాయలను బాగా శుభ్రంగా కడిగి నిలువుగా గాటు పెట్టుకోవాలి. ఆ గాటులోంచి దాని పొట్టలో ఉన్న విత్తనాలన్నీ తీసి పడేయాలి.
2. ఒక గిన్నెలో నీళ్లు వేసి ఉప్పు, పసుపు కలపాలి. ఆ నీళ్లలో కాకరకాయలను వేసి పది నిమిషాలు వదిలేయాలి.
3. ఆ పది నిమిషాల తర్వాత కాకరకాయలను చేత్తో గట్టిగా పిండి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇలా చేస్తే కాకరకాయల్లోని చేదు తగ్గిపోతుంది.
5. ఇప్పుడు మసాలా పేస్ట్ చేసేందుకు మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
7. ఆ నూనెలో కాకరకాయలను వేసి వేయించుకోవాలి. దాదాపు 50 శాతం ఉడికిపోయేదాకా వేయించుకోవాలి.
8. మరోపక్క మిక్సీలో పొడి చేసుకున్న మసాలాను ఒక గిన్నెలో వేసి ఉప్పు, కారం కలపాలి.
9. యాభైశాతం కాకరకాయలను వేయించుకున్నాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఆ నూనెలోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.
11. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసి వేయించుకోవాలి.
12. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి మళ్లీ మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
13. ఆ పేస్టును మసాలా మిశ్రమంలో కలుపుకోవాలి. అవసరమైతే కాస్త నీళ్లు పోసుకోవచ్చు.
14. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన కళాయిలో మరి కాస్త నూనె వేయాలి.
15. కాకరకాయల పొట్టలో ఈ ఉల్లిపాయ మసాలా మిశ్రమాన్ని కూరాలి.
16. నూనెలో ఈ కాకరకాయలను వేసుకోవాలి. మిగతా మసాలాను కూడా కళాయిలో వేసేయాలి.
17. మూత పెట్టి చిన్న మంట మీద పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
18. తర్వాత ఇగురు కోసం చింతపండు నానబెట్టిన నీళ్లను వేసి కలుపుకోవాలి.
19. ఒక పావు గంటసేపు మరిగిస్తే ఇగురు రెడీ అయిపోతుంది. కాకరకాయ కూడా ఉడికిపోతుంది.
20. పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీగా గుత్తి కాకరకాయలాగే గుత్తి కాకరకాయ రెడీ అయిపోతుంది.
కాకరకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన పొట్టలో ఉన్న వ్యర్ధాలు, విషాలను తొలగిస్తాయి. కాకరకాయ తినే వారిలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది. పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. కాకరకాయ తరచూ తినేవారికి మలేరియా, టైఫాయిడ్ వంటి సమస్యలు రావు. పచ్చకామెర్లను అడ్డుకునే శక్తి కాకరకాయ ఉంది. దీన్ని చేదుగా వండుకొని తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. దీన్ని తినడం వల్ల మరిన్ని పోషకాలు శరీరంలో చేరుతాయి.
ఇక డయాబెటిక్ రోగుల విషయానికొస్తే వారికి ఉత్తమ కూరగాయగా కాకరకాయనే చెప్పుకోవాలి. వారానికి కనీసం మూడు నాలుగు సార్లు వారు కాకరకాయలు ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఒకసారి వారు ఈ గుత్తి కాకరకాయ కర్రీని ప్రయత్నించమని ప్రయత్నించండి.
టాపిక్