Kakarakaya Recipes: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం రెసిపీ, ఇలా చేస్తే ఆ రుచే వేరు
Kakarakaya Recipes: మధుమేహలు ఏం తినాలన్నా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. వారు తినే ఆహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ కాకరకాయ ఉల్లికారం రెసిపీ ఇస్తున్నాము. ప్రయత్నించండి.
Kakarakaya Recipes: కాకరకాయ పేరు వింటేనే ఎంతోమంది ముఖం మాడ్చుకుంటారు. ఎవరు ముఖం ముడుచుకున్నా... మధుమేహంతో బాధపడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా కాకరకాయను తినాలి. ప్రతిరోజూ వారు కాకరకాయను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాకరకాయలో ఉన్న చేదు వల్ల అది తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ కాకరకాయ ఉల్లికారాన్ని ఒక్కసారి ప్రయత్నిస్తే ఎవరైనా సరే మళ్లీ మళ్లీ తింటారు. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ ఉల్లికారాన్ని కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. ఈ రెసిపీని ప్రత్యేకంగా మధుమేహుల కోసమే ఇస్తున్నాము. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే రెసిపీ ఇది. ఒక్కసారి ప్రయత్నించండి.
కాకరకాయ ఉల్లికారం చేయటానికి కావలసిన పదార్థాలు
కాకరకాయలు - అరకిలో
ఉల్లిపాయలు - నాలుగు
పసుపు - ఒక స్పూను
కరివేపాకు - గుప్పెడు
పచ్చి శనగపప్పు - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - పది
మినప్పప్పు - ఒక స్పూన్
చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో
ధనియాలు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కాకరకాయ ఉల్లికారం తయారీ
1. కాకరకాయలను గుండ్రంగా కట్ చేసుకోవాలి. లోపలి గింజలను తీసి పడేయాలి. గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను, కాకరకాయలో తీసిన ఆ తెల్లని గుజ్జును వేసి వేయించాలి.
3. వాటిలోనే వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను ధనియాలు, పసుపు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వేయించాలి.
4. వేయించిన వాటన్నింటినీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసి మినప్పప్,పు శెనగపప్పు కూడా వేయించి ప్లేట్లో వేసుకోవాలి.
5. ఈ మొత్తం అన్ని పదార్థాలను కలిపి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఒక స్పూన్ మూడు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలను వేయించాలి.
7. కాకరకాయల్లో చేదు రాకుండా ఉండాలంటే ముందుగానే కాకరకాయ ముక్కలను కాస్త పసుపు, ఉప్పు కలిపిన నీటిలో కాసేపు ఉంచాలి. తర్వాత ఆ నీటి నుంచి వాటిని పిండి పక్కన పెట్టాలి. ఇలా చేస్తే చేదు తగ్గిపోతుంది.
8. ఇప్పుడు కళాయిలో కాకరకాయ ముక్కలు వేగాక మిక్సీలో చేసుకున్న పేస్టును కూడా వేసి కలుపుకోవాలి. అవసరం అయితే కాస్త నూనె వేసుకోవచ్చు.
9. చిన్న మంట మీద కూరను నీళ్లు వేయకుండా ఉడికించాలి. పైన కొత్తిమీర తరుగు వేసి స్టవ్ కట్టేయాలి.
10. అంతే కాకరకాయ ఉల్లికారం రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంతో తింటేనే రుచి బాగుంటుంది.
11. స్పైసీ ఎక్కువగా కావాలనుకునేవారు ఎండు మిరపకాయలను లేదా కారాన్ని ఎక్కువ వేసుకోవచ్చు.