Jaggery vs honey: పంచదారకు బదులు తేనె, బెల్లం వాడుతున్నారా? ఈ రెండింట్లో ఏది మంచిది?-jaggery and honey know which is better for weight loss and health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jaggery Vs Honey: పంచదారకు బదులు తేనె, బెల్లం వాడుతున్నారా? ఈ రెండింట్లో ఏది మంచిది?

Jaggery vs honey: పంచదారకు బదులు తేనె, బెల్లం వాడుతున్నారా? ఈ రెండింట్లో ఏది మంచిది?

Koutik Pranaya Sree HT Telugu
Sep 16, 2024 10:30 AM IST

Jaggery vs honey: పంచదారకు బదులుగా తేనె, బెల్లం వాడుతున్నారా? ఆరోగ్యకరమని చేసుకున్న ఈ మార్పు ఎంత వరకు మంచిదో తెల్సుకోండి. తేనె, బెల్లం ఏ మోతాదులో వాడాలో తెల్సుకోండి.

బెల్లం Vs తేనె
బెల్లం Vs తేనె (freepik)

బరువు తగ్గాలనుకునే వాళ్లు, ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకునేవాళ్లు ముందు చేసే పని చక్కెర మానేయడం. కానీ చక్కెరకు ప్రత్యామ్నాయంగా బెల్లం లేదా తేనెను ఎంచుకుంటారు. ఈ రెండింటినీ పోల్చి చూసి ఏది వాడటం మంచిదో, దేంతో నష్టాలుంటాయో చూద్దాం రండి.

బెల్లం Vs తేనె:

1. కేలరీలు:

బెల్లం కన్నా తేనెలో కేలరీలు తక్కువ. ఒక టేబుల్ స్పూన్ తేనెలో 64 కేలరీలుంటే , బెల్లంలో 65 నుంచి 70 కేలరీలుంటాయి. తేడా తక్కువే కానీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ప్రభావం ఉంటుంది.

2. పోషకాలు:

తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి మినరళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దాంతో సహజంగానే బరువు తగ్గడానికి సాయం అవుతుంది. బెల్లంలో కూడా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. దీంట్లో ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో ఉన్నట్లు ఉండవు.

3. తీపిదనం:

తేనె బెల్లం కన్నా తియ్యగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. దీంతో కేలరీలు తక్కువగా చేరతాయి.

4. గ్లైసెమిక్ ఇండెక్స్:

తేనె గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) బెల్లం కన్నా తక్కువ. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండాలంటే జీఐ తక్కువుండాలి.

5. జీర్ణక్రియ:

తేనెలో యాంటీమైక్రోబయల్ లక్షణాలుంటాయి. ఇది సులువుగా అరుగుతుంది. దీంట్లో ఎంజైమ్లు వల్ల జీవక్రియ కూడా వేగంగా జరిగి కొవ్వు కూడా తొందరగా కరుగుతుంది. బెల్లం కూడా ఆహారం అరిగించడంలో, డిటాక్స్ చేయడంలో సాయం చేస్తుంది. కాకపోతే దీంట్లో చక్కెర శాతం ఎక్కువుండటం వల్ల కొవ్వు సులభంగా కరగదు.

పైన విషయాలన్నీ చదివాక తేనె వల్ల లాభాలు ఎక్కువని అర్థమైంది కదా. అయితే తేనె, బెల్లం ఎంత మోతాదులో వాడితే మంచిదో కూడా తెల్సుకుందాం.

ఎంత తేనె, బెల్లం తీసుకోవచ్చు?

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే రోజుకు ఒకటి లేదా రెండు టీస్పూన్లు అంటే 5 నుంచి 10 గ్రాముల తేనె తీసుకోవచ్చు. బెల్లం కూడా 10 నుంచి 12 గ్రాముల మధ్యలో మాత్రమే తీసుకోవాలి. అంతకు మించితే బరువు తగ్గకపోగా శరీరంలో అదనంగా చక్కెరలు చేరతాయి.

ఎలా వాడాలి?

  1. తేనె, బెల్లం రెండింట్లోనూ కేలరీలు ఎక్కువే. కాబట్టి రోజుకు ఒకట్రెండ్ టీస్పూన్ల కన్నా ఎక్కువ తీసుకోకూడదు.
  2. ఈ రెండు చక్కెర రూపాలే. సహజ చక్కెరలు కూడా బరువు పెంచుతాయి. కాబట్టి మితంగానే తీసుకోవాలి.
  3. తీపిగా ఉండే ఆహారాల్లో తేనె బెల్లం కలిపితే అదనపు ప్రయోజనాలుండవు. అదనంగా చక్కెరలు తీసుకున్నట్లే. స్మూతీలు, డెజర్టులు, సిరియల్స్ లాంటి అల్పాహారాల్లో చక్కెరలుంటే అదనంగా వీటిని చేర్చకండి.

తేనె, బెల్లం రెండూ వేటికవే పోషకాల్లో ఆరోగ్యకరమైనవి. కానీ వీటిలో కేలరీలు ఎక్కువ. ఆరోగ్యమని చెప్పి వీటిని ఎక్కువ తిన్నా ఏ ప్రయోజనం ఉండదు. బరువు తగ్గలేరు. కాబట్టి వీటిని కూడా మితంగానే వాడాలి. చక్కెర కన్నా ఆరోగ్యకరం కాబట్టి లెక్క లేకుండా వాడేస్తే వీటివల్లా అనారోగ్యమే అని గుర్తుంచుకోండి.