Bellam Gavvalu: బెల్లం గవ్వలు ఈ టిప్స్‌తో చేశారంటే.. మొదటిసారే కుదురుతాయి-how to make bellam gavvalu recipe for evening snack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bellam Gavvalu: బెల్లం గవ్వలు ఈ టిప్స్‌తో చేశారంటే.. మొదటిసారే కుదురుతాయి

Bellam Gavvalu: బెల్లం గవ్వలు ఈ టిప్స్‌తో చేశారంటే.. మొదటిసారే కుదురుతాయి

Koutik Pranaya Sree HT Telugu
Sep 09, 2024 03:30 PM IST

Bellam Gavvalu: ఈ కొలతలతో చేస్తే తీపి గవ్వలు పక్కాగా వస్తాయి. మంచి రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పంచదారకు బదులు బెల్లం వాడి బెల్లం గవ్వలు తయారు చేయొచ్చు. వాటి తయారీ చూసేయండి.

బెల్లం గవ్వలు
బెల్లం గవ్వలు (pinterest)

తెలుగు రాష్ట్రాల్లో గవ్వలు చాలా మందికి తెలిసిన వంటకమే. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వీటిని చేసుకోరు. గవ్వల ఆకారంలో చేస్తారు కాబట్టి వాటికాపేరు. దీనికి ప్రత్యేకంగా గవ్వల చెక్క దొరుకుతుంది. దాంతోనే గవ్వలు చేస్తారు. అది లేకపోతే ఫోర్క్ వెనకవైపు వాడి, లేదా కొత్త దువ్వెన వాడి గవ్వలు చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేశారంటే మొదటిసారైనా గవ్వలు రుచిగా చేసుకోవచ్చు. సాధారణంగా పంచదార పాకం కట్టి వీటిని తయారు చేస్తారు. బెల్లం పాకంతో రుచి మరింత బాగుంటుంది. ఈ కొలతలు ఫాలో అయితే చాలు.

బెల్లం గవ్వల తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల మైదా

అరటీస్పూన్ ఉప్పు (చిటికెడు ఉప్పు తీపి రుచి పెంచుతుంది)

2 చెంచాల కరిగించిన నెయ్యి

డీప్ ఫ్రై కి సరిపడా నూనె

పాకం కోసం:

300 గ్రాముల బెల్లం

1 కప్పు నీళ్లు

4 యాలకులు

బెల్లం గవ్వల తయారీ విధానం:

  1. ముందుగా మైదాను ఒకసారి జల్లించుకోవాలి. అలా చేస్తే పిండిలో ఉండలు ఉండవు.
  2. ఈ పిండిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు వేసుకోవాలి. ఏ స్వీట్ చేసినా చిటికెడు ఉప్పు వేయడం వల్ల దాని రుచి రెట్టింపు అవుతుంది.
  3. ఇప్పుడు అందులో నెయ్యి కూడా వేసుకుని పొడిగా కలపండి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిలాగా.. చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగానే కలపండి.
  4. ఇలా కలుపుకున్న పిండిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  5. పది నిమిషాలయ్యాక మరో నిమిషం పాటూ పిండిని కలపాలి.
  6. ఇప్పుడు పిండిలో చిన్న ముద్ద తీసుకుని ఒక ఇంచు ఉండ చేసుకోవాలి. గవ్వలు చేసే చెక్క ఉంటే దాని మీద పెట్టి గవ్వల ఆకారం చేసుకోవాలి. చెక్క లేకపోతే ఫోర్క్, కొత్త దువ్వెన కూడా వాడుకోవచ్చు. వాటికి నూనె రాసి పిండిని పెట్టి ఒత్తితే గవ్వలు రెడీ అవుతాయి.
  7. ఈ లోపు నూనె పెట్టుకుని వేడి చేసుకోవాలి. గవ్వలను కొన్ని కొన్ని వేసుకుని రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ముదురు బంగారు వర్ణం లోకి రాగానే ఒక టిష్యూ మీదికి తీసుకోవాలి.
  8. బెల్లం పాకం కోసం ఒక కడాయిలో బెల్లం తురుము, కప్పు నీల్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరగగానే యాలకులలు దంచి వేసుకోవాలి. గిన్నెడు నీళ్లలో కాస్త పాకం వేస్తే అది ఉండలాగా రావాలి. అలా వస్తే పాకం అయినట్లే.
  9. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గవ్వల్ని బెల్లం పాకంలో వేసుకుని కలుపుకోవాలి. పాకం అన్నింటికీ కోటింగ్ అయ్యేలా చూడాలి.
  10. చల్లారాక గాజు చొరవని డబ్బాలో వేస్తే సరిపోతుంది. ఎన్ని రోజులైనా పాడవ్వవు.

Whats_app_banner

టాపిక్