Maida- Digestive Health । మైదాపిండి జీర్ణం కావడం కష్టమా? న్యూట్రిషనిస్టుల మాట ఇదీ!
What Is Maida- Digestive Health: మైదాపిండి త్వరగా జీర్ణం కాదా? మైదాపిండితో చేసినవి తింటే ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? పోషకాహార నిపుణులు చెబుతున్నది ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన ఆహరపు అలవాట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయినప్పటికీ కొన్ని ఆహరపు అలవాట్ల నుంచి మనం పూర్తిగా బయటకు రాలేము. మైదాపిండి మన జీవితంలో అంతర్భాగం, అయితే మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీని వినియోగాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తాం కానీ, పూర్తిగా తొలగించలేం. ఎందుకంటే ఇది మీ మార్నింగ్ శాండ్‌విచ్ నుంచి మధ్యాహ్నం పరోటాలు, ఫ్రై వంటకాలు, సాయంత్రం వేళ సమోసాలు, మోమోలు, ఫాస్ట్ ఫుడ్స్, పేస్ట్రీలు, కేకులు ఇలా ఒకటేమిటి మనకు నచ్చిన అనేక రకాల రుచికరమైన ఆహార పదార్థాల తయారీలో మైదాపిండినే వాడుతారు. అందుకే దీనిని ఆల్-పర్పస్ పిండి అని కూడా అంటారు.
మనకు నచ్చని విషయం ఏమిటంటే మైదాలో పోషకాలు అనేవి ఉండవు. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మరి ఎందుకు మైదా ఇలా అనారోగ్యకరమైన ఆహార పదార్థంగా నిలిచింది, ఈ పిండిని ఎలా తయారు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.
What Is All-Purpose Flour - మైదాపిండిని ఎలా తయారు చేస్తారు?
మైదాను శుద్ధి చేసిన గోధుమ పిండి అని కూడా పిలుస్తారు. సూజీ రవ్వ, గోధుమ పిండి అలాగే మైదా ఈ మూడింటిని గోధుమల నుంచే తయారు చేస్తారు. ఇందులో మైదా అనేది గోధుమ పిండిని అత్యంత ప్రాసెస్ చేసిన రూపం. బాగా శుద్ధి చేసే ప్రక్రియలో గోధుమలోని ఊక, దానిలోని విత్తన భాగం (Wheat Germ) కూడా నశించిపోతుంది. దీంతో ఈ పిండి ఎలాంటి పోషకాలు, ఫైబర్ లేని ఒక నిర్జీవమైన, నిసత్తువ కలిగిన పిండిరూపం మైదా తయారవుతుంది. ఇలా తయారైన మైదాతో మనం సులభంగా ఎలాంటి రుచికరమైన ఆహార పదార్థాలనైనా తయారు చేసుకోవచ్చు, పైగా దీని ధర కూడా మిగతా పిండి రకాలతో పోలిస్తే చాలా తక్కువ, అందుకే దీని వినియోగం ఎక్కువ. కానీ ఈ పిండి తినడం వలన మన ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
మైదాపిండితో కలిగే దుష్ప్రభావాలు
మైదాపిండితో చేసిన ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం, బరువు పెరగడం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పాటు, ఫైబర్ లేకపోవడం వలన ఇది మీ జీర్ణవ్యవస్థ మార్గానికి అంటుకుని జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. మైదాతో చేసినవి తినడం వలన మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది.
అయితే మైదా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది కాబట్టి ఇది జీర్ణం అవడం చాలా కష్టం లేదా జీర్ణక్రియ చాలా నెమ్మదిగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని పోషకాహార నిపుణులు భువన్ రస్తోగి పేర్కొన్నారు. మైదా నిజానికి వేగంగా జీర్ణం అవుతుందని, ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తీవ్ర స్థాయిలో పెరుగుతాయని భువన్ అన్నారు. మైదాతో పోలిస్తే మిగతా ఆటా పిండి నెమ్మదిగా జీర్ణం అవుతుందని తెలిపారు.
సంబంధిత కథనం