Feeding Bra: పిల్లలకు పాలిచ్చే తల్లులు రోజులో ఎక్కువసేపు బ్రా ధరించడం సురక్షితమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?-is it safe for breastfeeding mothers to wear a bra for long hours what do health experts say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Feeding Bra: పిల్లలకు పాలిచ్చే తల్లులు రోజులో ఎక్కువసేపు బ్రా ధరించడం సురక్షితమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

Feeding Bra: పిల్లలకు పాలిచ్చే తల్లులు రోజులో ఎక్కువసేపు బ్రా ధరించడం సురక్షితమేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

Haritha Chappa HT Telugu
Aug 14, 2024 10:30 AM IST

Feeding Bra: బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో బ్రా ధరించడం సురక్షితమో కాదో అన్న సందేహం ఎక్కువ మంది మహిళల్లో ఉంటుంది. కొందరు బ్రాలు ధరించడం మానేస్తారు. మరికొందరు ధరిస్తారు. అయితే బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో బ్రా ధరించడం మంచిదో కాదో వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

బ్రెస్ట్ ఫీడింగ్
బ్రెస్ట్ ఫీడింగ్ (Pixabay)

Feeding Bra: బిడ్డ పుట్టాక తల్లికి అంతా కొత్తగా ఉంటుంది. ఆమె అసలైన జీవితం బిడ్డ పుట్టుకతోనే మొదలవుతుంది. తల్లీ బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచేది తల్లిపాలే. తల్లి పాలు తాగిన బిడ్డ తల్లికి మరింత సన్నిహితంగా ఉంటాడు. తల్లిపాలు ఇస్తున్నప్పుడు స్త్రీ శరీరంలో కూడా అనేక మార్పులు వస్తాయి. మహిళల రొమ్ముల పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా వారు బ్రాలను ధరించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పటికీ చాలా ఇళ్లల్లో బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మహిళలు బ్రా ధరించకూడదని పెద్దలు సలహా ఇస్తారు. డెలివరీ అయిన వారం పది రోజులు పాటు కొత్త తల్లి బ్రా ధరించదు. కానీ ఆ తర్వాత ధరించాల్సిన అవసరం పడుతుంది. లేకుంటే ఆమెకు ఇంట్లో బంధువుల మధ్య తిరగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎదుటివారి ముందు ఆమె ఆత్మవిశ్వాసంతో నిల్చోలేదు.

బ్రా ధరించవచ్చా?

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం తల్లి పాలు ఇచ్చే సమయంలో ఆ తల్లి బ్రా వేసుకోవడం సురక్షితమే. బ్రా వల్ల తల్లికిగానీ, బిడ్డకుగానీ ఎలాంటి హాని ఉండదు. అయితే నాణ్యత కలిగిన బ్రాలను మాత్రమే వాడాలి. ముఖ్యంగా ఇప్పుడు నర్సింగ్ బ్రాలు (Feeding Bra) వచ్చాయి. ఈ బ్రా వేసుకుంటే తల్లిపాలు ఇవ్వడం చాలా సులభతరంగా ఉంటుంది. అలాగే బిడ్డకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నర్సింగ్ బ్రాలను వేసుకోవడం వల్ల రొమ్ముల్లోని పాల నాళాలకు ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు. ఇవి చాలా మృదువుగా, సున్నితంగా ఉంటాయి. ఇవి రొమ్ములను గట్టిగా అదిమి పట్టవు. దీనివల్ల బిడ్డ సులువుగా పాలు తాగగలుగుతాడు.

ఫీడింగ్ మదర్స్ కచ్చితంగా బ్రా ధరించాలని గానీ, ధరించకూడదనిగానీ వైద్య నిపుణులు చెప్పడం లేదు. అది ప్రతి స్త్రీ తాను స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ఆమెకు ఇబ్బందిగా అనిపిస్తే బ్రా ధరించాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఆమె ఇష్టపూర్వకంగా లో దుస్తులను ధరించవచ్చు. అయితే డెలివరీ అయిన తర్వాత పది నుండి 15 రోజులు వరకు స్త్రీ శరీరం తల్లిపాలకు సర్దుబాటు కావడంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. దీనివల్ల రొమ్ముల నుంచి పాలు కారడం వంటివి కూడా కనిపిస్తాయి. బట్టలు తడిసిపోవడం జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలంటే నర్సింగ్ బ్రాలు వాడితే మంచిది.

బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల రోజుకు 500 క్యాలరీలు ఖర్చు చేస్తుంది. ఇది తల్లి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే పాలిచ్చే తల్లులు త్వరగా బరువు తగ్గుతారు. అలాగే తల్లిపాలు తాగి బిడ్డలు కూడా త్వరగా బరువు పెరుగుతారు. మొదటి ఆరు నెలల వరకు కచ్చితంగా పిల్లలకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఇది ఇద్దరి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మీకు బ్రెస్ట్ ఫీడింగ్ పై ఎలాంటి అనుమానాలు ఉన్నా ఖచ్చితంగా వైద్య నిపుణులు కలిసి తగిన సలహాలు పొందడం అవసరం. మీకు మీరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి.