Breastfeeding Diet। తల్లిపాలు పెరగాలంటే.. బాలింతలు ఇలాంటి ఆహారాలు తినాలి!
Breastfeeding Diet: సరైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా చనుబాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు సహజంగా పాల ఉత్పత్తిని పెంచుతాయి. అలాంటి వాటిని తల్లులు తమ డైట్ లో చేర్చుకోవాలి.
Breastfeeding Week: బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, స్త్రీ తల్లి అవుతుంది, ఆమె శరీరం బిడ్డకు పాలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు దాదాపు 6 నెలల వరకు తల్లి పాలను మించి శ్రేష్ఠమైన ఆహారం మరొకటి ఉండదు. కాబట్టి శిశువుకు సరైన పోషణ అందాలంటే తల్లి రొమ్ము నుండి తగినంత పాలు రావడం చాలా ముఖ్యం. కానీ అందరు తల్లుల్లో చనుబాల ఉత్పత్తి ఒకేలా ఉండటం లేదు. కొందరు తల్లుల్లో చనుబాలు తక్కువ ఉత్పత్తి అవుతుంటే, మరికొందరిలో ఓవర్ ఫ్లో కూడా అవుతున్నాయి. అన్ని రకాల సంరక్షణ చర్యలు తీసుకుంటునప్పటికీ కొందరు తల్లుల్లో చనుబాలు తగ్గుతున్నాయి.
స్త్రీలలో చనుబాలు తక్కువగా ఉండటానికి కారణం వారిలో జీవక్రియ తక్కువగా జరుగుతుండటమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తరచుగా అనారోగ్యాల బారినపడే స్త్రీలలో జీవక్రియ రేటు తగ్గుతుంది. ఇటువంటి వారిలో గర్భాధారణ సమయంలో పాల ఉత్పత్తి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఏది ఏమైనా తల్లులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, సరైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా చనుబాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు సహజంగా పాల ఉత్పత్తిని పెంచుతాయి. అలాంటి వాటిని తల్లులు తమ డైట్ (Breastfeeding Diet) లో చేర్చుకోవాలి.
చనుబాలు ఎక్కువగా రావాలంటే తల్లులు ఇలాంటి పోషకాహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
మాంసాహారం:
మాంసాహారంలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి పాలిచ్చే తల్లులకు, శిశువులకు ఇద్దరికీ అవసరం. చికెన్, మటన్, కాలేయం వంటివి తినాలి. సీఫుడ్ తినడం తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, అయితే అన్నీ తినకూడదు. సాల్మన్ చేపలు, సీవీడ్, షెల్ఫిష్, సార్డినెస్ వంటివి తినవచ్చు. గుడ్లు, డెయిరీ ఉత్పత్తులు కూడా తీసుకోవాలి.
మీరు శాకాహారులైతే బాదంపాలు తాగవచ్చు. ఇవి పూర్తిగా శాకాహారం, వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, ఇది తల్లి పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
పండ్లు, కూరగాయలు:
బెర్రీలు, టమోటాలు, క్యాప్సికమ్, క్యాబేజీ, కాలే, వెల్లుల్లి, బ్రోకలీ వంటి ముదురు ఆకుపచ్చని కూరగాయలు తినాలి.
చిక్కుళ్లు, పెసర్లు వంటి పప్పు ధాన్యాలలో మంచి ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. కొత్తగా మాతృత్వాన్ని పొందిన వారు వీటిని ఎక్కువగా తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
ఫైబర్ అధికంగా ఉండే పిండి పదార్థాలు:
బంగాళదుంపలు, బటర్‌నట్ స్క్వాష్, చిలగడదుంపలు, బీన్స్, కాయధాన్యాలు, ఓట్స్, క్వినోవా, బుక్వీట్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
ఇతర ఆహార పదార్థాలు
మెంతులు ఫైటోఈస్ట్రోజెన్ కు మంచి మూలం. ఒక చెంచా మెంతులను ఒక కప్పు నీటితో మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలపండి. ఈ మెంతుల టీని రోజుకు కనీసం 3 సార్లు త్రాగాలి. ఇది చనుబాల ఉత్పత్తిని పెంచుతుంది. మెంతికూర కూడా తినవచ్చు.
పాలిచ్చే తల్లులు ఫెన్నెల్ సీడ్స్ తినడం కూడా రొమ్ముపాలను పెంచడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదనంగా ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకం నివారిస్తుంది.
ఖర్జూరం తినడం వల్ల చనుబాలు పెరుగుతాయి. ఖర్జూరాలలోని పోషకాలు ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. 8-10 ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే గ్లాసు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి.
ఆహారంతో పాటు మీ దాహం తీరేటంతగా సరిపడా నీరు తాగాలి. ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి, అయితే కెఫీన్ పానీయాలు, ఆల్కాహాల్ పానీయాలకు దూరంగా ఉండాలి.
సంబంధిత కథనం