Pregnancy Care । గర్భిణీ స్త్రీలు జుట్టుకు రంగులు వేసుకోవడం, టాటూలు పొడిపించుకోవడం సురక్షితమేనా?-is coloring hair and getting a tattoo while pregnant safe check out what studies say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Care । గర్భిణీ స్త్రీలు జుట్టుకు రంగులు వేసుకోవడం, టాటూలు పొడిపించుకోవడం సురక్షితమేనా?

Pregnancy Care । గర్భిణీ స్త్రీలు జుట్టుకు రంగులు వేసుకోవడం, టాటూలు పొడిపించుకోవడం సురక్షితమేనా?

HT Telugu Desk HT Telugu

Pregnancy Care: గర్భాధారణ అనేది స్త్రీ తన జీవితంలో జరుపుకునే వేడుక. మాతృత్వపు స్పర్శను పొందుతున్నందుకు గుర్తుగా టాటూ వేయించుకోవడం లేదా అందంగా కనిపించేందుకు జుట్టుకు రంగు వేసుకోవడం సురక్షితమేనా ఇక్కడ తెలుసుకోండి.

Pregnancy Tips- Hair Coloring, Tattooing (iStock)

Pregnancy Care: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది, కానీ ఈ వయసు పెరిగే కొద్ది ఆ అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు పెరిగే కొద్ది ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలతో పాటు వేధించే మరొక సాధారణ సమస్య తెల్ల వెంట్రుకలు రావడం. అయితే ఈ తెల్ల వెంట్రుకలు రావడం అనేది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా కూడా వస్తుంది. ఈ తెల్లవెంట్రుకలు కనిపించినపుడు చాలామంది సులభంగా హెయిర్ డైలను ఉపయోగించి మళ్లీ నల్లగా మార్చుకుంటారు.

ఇది కాకుండా చాలా మందికి మోడ్రన్‌గా ఉండటం ఇష్టం ఉంటుంది, ఇందుకోసం తలకు నలుపు కాకుండా బర్గండీ, కాపర్, ఆకుపచ్చ, నీలం వంటి వివిధ రంగులు వేసుకుంటారు, అలాగే ప్రతి సందర్భానికి గుర్తుగా టాటూలు కూడా వేయించుకోవడం చేస్తుంటారు. అయితే గర్భంతో ఉన్నప్పుడు స్త్రీలు తలకు రంగు వేసుకోవడం మంచిదేనా? టాటూలు వేసుకుంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి వంటి సందేహాలను గూగుల్‌లో లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు జుట్టు సమస్యల గురించి చాలా మంది శోధిస్తున్నారట. మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Coloring Hair During Pregnancy - గర్భంతో ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకోవచ్చా?

యూఎస్‌కు చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ టెరాటాలజీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (OTIS) ప్రకారం, గర్భవతిగా ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, హెయిర్ డై పూర్తిగా స్కాల్ప్ ద్వారా గ్రహించబడదు, రక్తప్రవాహంలోకి చేరదు. కాబట్టి ఇది పునరుత్పత్తిపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండదని పేర్కొంది.

అయితే చాలా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, మార్కెట్లో లభించే హెయిర్ డైలు ప్రమాదకరమైన రసాయనాలను కలిగి ఉన్నందున, వాటిని ఉపయోగించే ముందు సైడ్ ఎఫెక్టుల గురించి తెలుసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కొన్ని హెయిర్ డైలు వేసుకోవడం వలన పుట్టబోయే బిడ్డల్లో స్వల్పంగా నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. రసాయన ఉత్పత్తులకు బదులుగా సహజ రంగులను ఉపయోగించడం పూర్తిగా సురక్షితం అని పేర్కొన్నాయి.

Tattoo While Pregnant- గర్భణీలు పచ్చబొట్లు వేసుకుంటే?

గర్భిణీ స్త్రీలు పచ్చబొట్లు పొడిపించుకోవడం లేదా టాటూలు వేసుకోవడంపై చాలా తక్కువ పరిశోధలు జరిగాయి. అయినప్పటికీ గర్భంతో ఉన్న స్త్రీలు టాటూలు వేయించుకోకపోవడమే ఉత్తమం అని నివేదికలు పేర్కొన్నాయి. ఎందుకంటే, గర్భధారణ సమయంలో స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు, అలాగే వారి శరీరం వివిధ మార్పులకు లోనవుతుంది, చర్మం సాగుతుంది. ఇలాంటపుడు పచ్చబొట్టు వేసుకుంటే దాని ఆకృతి చెదిరిపోతుంది, వేసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో పచ్చబొట్టు వేయించుకోవడంలో ఉన్న ప్రధాన ఆందోళన ఏమిటంటే వారు హెపటైటిస్ బి, హెచ్ఐవి వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. ఇతర ఇన్ఫెక్షన్లు కూడా సోకవచ్చు.

అందువల్ల, గర్భిణీలు హెయిర్ డై వేసుకోవాలన్నా, టాటూ వేసుకోవాలన్నా, ముందుగా వైద్యుల సలహా తీసుకోండి.

సంబంధిత కథనం