Nanotech Tattoo।ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఇ-టాటూ ఇంక్ రెడీ చేస్తున్న సైంటిస్టులు-researchers develop nanotech tattoo as health monitoring device ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nanotech Tattoo।ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఇ-టాటూ ఇంక్ రెడీ చేస్తున్న సైంటిస్టులు

Nanotech Tattoo।ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఇ-టాటూ ఇంక్ రెడీ చేస్తున్న సైంటిస్టులు

Manda Vikas HT Telugu
Aug 03, 2022 09:04 PM IST

మీకు టాటూలు వేసుకోవటం ఇష్టమా? ఇష్టం ఉన్నా, లేకపోయినా ఇక ముందు అందరికీ రంగుపడుద్ది, అందరూ టాటూలు వేసుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే శాస్త్రజ్ఞులు మన ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఎలక్ట్రానిక్ టాటూ ఇంక్ సృష్టిస్తున్నారు. ఇది మనిషికి బార్ కోడ్ లాగా పనిచేస్తుంది. వివరాలు చూడండి.

<p>Nanotech Tattoo</p>
Nanotech Tattoo

పురాతన కాలం నుంచే భారతీయుల్లో కూడా పచ్చబొట్టు వేసుకునే సంస్కృతి ఉండేది. ఇది వ్యక్తిని గుర్తించటానికి ఉపయోగపడేది. హోదాకు చిహ్నంగా, జాతుల ఆచారంగా, ప్రేమను తెలిపేందుకు ఇలా విభిన్న కారణాలు కోసం అప్పట్లోనే పచ్చబొట్లు పొడిపించుకునేవారు. నేటి కాలంలో ఆ పచ్చబొట్లే టాటూలుగా రూపాంతరం చెందాయి. ఒళ్లంతా డిజైన్ డిజైన్లుగా కలర్ ఫుల్ టాటూలు వేసుకునే సంస్కృతి వచ్చేసింది. ఇప్పుడు ఇదొక ఫాషన్ సింబల్. అయితే ప్రస్తుత టాటూలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మంచిది కాదు, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. టాటూలు అంటే అసహ్యించుకునే వారూ ఉన్నారు.

సరే, ఈ విషయం పక్కనపెడితే దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు కొత్తగా ఇ-టాటూ రూపంలో నానోటెక్ టాటూలను (nanotech tattoo) లను అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఈ టాటూ స్మార్ట్‌వాచ్‌లా అవసరాలను తీర్చేస్తుంది. ఎలాంటి గాడ్జెట్ ధరించకపోయినా సరే, కేవలం ఈ టాటూ వేసుకుంటే అదే మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంది.

హెల్త్ మానిటరింగ్ చేసే ఎలక్ట్రానిక్ టాటూ ఇంక్‌

కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAIST) పరిశోధకులు బయోఎలక్ట్రోడ్‌గా పనిచేసే ద్రవ మెటల్ అలాగే కార్బన్ నానోట్యూబ్‌లతో తయారు చేసిన ఎలక్ట్రానిక్ టాటూ ఇంక్‌ను అభివృద్ధి చేశారు.

ఈ ఎలక్ట్రానిక్ టాటూ ఇంక్‌తో మీకు కావాల్సిన రీతిలో, మీ అభిరుచికి తగినట్లుగా ఎలాంటి టాటూ డిజైన్ అయినా వేసుకోవచ్చు. టాటూ వేసిన ప్రదేశాన్ని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) పరికరం లేదా ఇతర బయోసెన్సర్‌తో స్కానింగ్ చేస్తే, అది ఆ వ్యక్తికి సంబంధించిన హృదయ స్పందన రేటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, లాక్టేట్ శాతం వంటి ముఖ్యమైన సంకేతాలను మానిటర్‌లో చూపించగలదు.

అంతేకాదు టాటూ వేసుకున్న వారికి వారి శరీరంలో ఏదైనా అస్వస్థత లేదా అనారోగ్యం వచ్చే సూచనలేమైనా ఉంటే ఆ సమాచారాన్ని ముందుగానే తెలియజేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ టాటూ వేసేందుకు ఉపయోగించే ఇంక్ లోపలి వరకు చొచ్చుకెళ్లదు. ఇది సాధారణంగా సెమీకండక్టర్లలో లేదా థర్మామీటర్లలో తయారీలో ఉపయోగించే గాలియం, మృదువైన వెండితో కూడిన లోహ కణాల నుంచి తయారు చేసినది. ప్లాటినం- కార్బన్ నానోట్యూబ్‌లు మన్నికను అందిస్తూ విద్యుత్‌ను ప్రసరింపజేయడంలో సహాయపడతాయి.

అయితే ఈ నానోటెక్ టాటూ వేసుకుంటే ఏమైనా సైడ్- ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది ఇంకా తెలియదు. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. ఫలితాలు సానుకూలంగా వస్తే మున్ముందు అందరూ బార్ కోడ్ లాగా తమ ఒంటిపై టాటూ వేసుకోవాల్సి వస్తుందేమో చెప్పలేం.

Whats_app_banner

సంబంధిత కథనం