Ghee and Tea: టీలో ఒక స్పూను నెయ్యి వేసుకుని తాగితే శరీరంలో వచ్చే మంచి మార్పులు ఇవే-if you add a spoon of ghee to the tea and drink it these changes are sure to occur in the body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee And Tea: టీలో ఒక స్పూను నెయ్యి వేసుకుని తాగితే శరీరంలో వచ్చే మంచి మార్పులు ఇవే

Ghee and Tea: టీలో ఒక స్పూను నెయ్యి వేసుకుని తాగితే శరీరంలో వచ్చే మంచి మార్పులు ఇవే

Haritha Chappa HT Telugu
Jul 10, 2024 01:30 PM IST

Ghee and Tea: మనదేశంలో టీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోట్ల మంది ఉదయం లేవగానే చేసే పని టీ తాగడమే. మీరు టీ తాగేటప్పుడు ఖచ్చితంగా ఒక చెంచా నెయ్యి జోడించి తాగి చూడండి. మీలో మంచి మార్పులు మొదలవుతాయి.

టీ
టీ (Shutterstock)

మనదేశంలో టీ ప్రియులు ఎక్కువ. ఉదయం లేచాక మొదట తాగే పానీయం టీ. కోట్లమంది టీ తాగాకే ఏ పనైనా మొదలుపెడతారు. రోజుకోసారి టీ తాగడం మంచిదే, కానీ ఖాళీ పొట్టతో మాత్రం టీ తాగకూడదని చెబుతుంటారు. అయినా కూడా ఉదయానే టీ తాగాలనుకుంటే అందులో ఒక స్పూను నెయ్యి వేసుకుని తాగడం అలవాటు చేసుకుంటే మంచిది. స్ట్రాంగ్ టీలో ఒక స్పూను నెయ్యి వేసుకుని తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

టీలో నెయ్యి వేసుకుంటే…

టీలో నెయ్యి వేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎంతో మంది ఈ విషయాలు తెలియవు. టీలో నెయ్యి వేసుకోవడం కాస్త వింతగానే అనిపించవచ్చు, కానీ కొన్ని రోజుల పాటూ తాగితే మీ శరీరంలో వచ్చే మంచి మార్పులను మీరే గమనిస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే టీ, కాఫీలలో నెయ్యి వేసుకుని తాగడం చేస్తూ ఉంటారు. ఇది ఎనర్జీ బూస్టర్‌గా పేరు తెచ్చుకుంది.

నెయ్యి ఉపయోగాలు

టీ, కాఫీలలో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, దేశీ నెయ్యిలో మెదడును బలోపేతం చేసే, జ్ఞాపకశక్తికి పదును పెట్టే పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఉదయం టీలో దేశీ నెయ్యి కలిపి తాగడం వల్ల టీ, నెయ్యి లక్షణాలు కలిసిపోయి మెదడుకు పదును పెడతాయి.

నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కలిసి మెదడును ఉత్తేజపరుస్తాయి. ఆందోళన స్థాయిలను తగ్గించడానికి పనిచేస్తాయి. ఉదయం టీలో దేశీ నెయ్యి కలిపి తాగడం వల్ల చికాకు తొలగిపోయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసర టెన్షన్‌ను తగ్గిస్తుంది.

టీలో నెయ్యి కలపడం వల్ల అది ఎనర్జీ బూస్టర్ గా మారిపోతుంది. ఈ టీలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు, పోషకాలతో నిండిన ఈ టీని తాగడం వల్ల బద్ధకం, బలహీనత, అలసట తొలగిపోతాయి. శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

టీలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మారుతున్న వాతావరణం శరీరంపై ప్రభావం చూపదు. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల సీజనల్ వ్యాధులతో పోరాడేందుకు శరీరం సిద్ధమవుతుంది. దీనితో పాటు, ఈ పానీయంలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యిని తినవచ్చు. బరువు పెరుగుతారన్న భయం పెట్టుకోవద్దు. గుండె ఆరోగ్యానికి కూడా నెయ్యి చాలా అవసరం. రెండు మూడు స్పూన్ల నెయ్యి తినేందుకు ఇష్టం లేకపోతే... రోజుకు ఒక స్పూను నెయ్యి తినడం మాత్రం ఎంతో ఆరోగ్యకరం. పరగడుపున టీలో నెయ్యి కలుపుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యం దక్కుతుంది. ఖాళీ పొట్టతో నెయ్యి కలిపిన టీని తాగడం వల్ల శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Whats_app_banner