Diabetes Foods: డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి జాగ్రత్త-if people with diabetes eat these the blood sugar levels will rise suddenly ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Foods: డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి జాగ్రత్త

Diabetes Foods: డయాబెటిస్ ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి జాగ్రత్త

Haritha Chappa HT Telugu
May 29, 2024 10:30 AM IST

Diabetes Foods: మధుమేహంతో బాధపడుతున్న వారు తినే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కొన్ని ఆహారాలు నేరుగా రక్తంలోని చక్కర స్థాయిలపై ప్రభావాన్ని చూపిస్తుంది.

డయాబెటిస్
డయాబెటిస్ (Pixabay)

Diabetes Foods: రక్తంలో చక్కర స్థాయిలో అమాంతం పెరిగితే డయాబెటిస్ అదుపులో ఉండడం చాలా కష్టం. కాబట్టి వారు ఎంపిక చేసుకునే ఆహారం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకుంటే వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి డయాబెటిస్ పెరిగే అవకాశం ఉంది.

కొన్ని రకాల ఆహారాలు తిన్న తర్వాత కేవలం15 నుంచి 30 నిమిషాలకే రక్తంలో చక్కెరను వేగంగా పెంచేస్తాయి. వీటిని డయాబెటిస్ పేషెంట్లు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ వీటిని తిన్నా కూడా చాలా తక్కువ మొత్తంలో తినాల్సిన అవసరం ఉంది. ఆ ఆహారాలు ఏవో ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి.

చక్కెర పానీయాలు

పంచదార కలిపిన ఆహారాలు పానీయాలలో అధికంగా సూక్రోజ్, ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ రెండూ రక్తంలోని చక్కెరను అమాంతం పెంచేస్తాయి. వీటిని తిన్న 15 నిమిషాలకే రక్తంలో చక్కెర స్థాయిలో అకస్మాత్తుగా పెరిగిపోతాయి. కాబట్టి చక్కెర కలిపిన కూల్ డ్రింకులు, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింకులు వంటి వాటికీ దూరంగా ఉండటం చాలా ముఖ్యం. నిమ్మరసంలో కూడా చక్కెరను కలుపుకొని తాగకూడదు.

తేనె

చాలామంది తేనే తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు అనుకుంటారు. బయట మార్కెట్లో దొరుకుతున్నది శుద్ధి చేసిన తేనె. దీన్నే చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా అనుకుంటారు. శుద్ధి చేసిన ఆహారం ఏదీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. తేనెలో కూడా ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఇవి తేనెలో అధికంగా కలిగి ఉంటుంది. తేనె ఒక స్పూను తీసుకున్న కూడా రక్తంలో చక్కర స్థాయిలు ఎంతో కొంత పెరుగుతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు అర స్పూన్ తేనెను మాత్రమే తీసుకోవాలి.

చెరుకు గడలు

సహజమైన తీపిని కలిగి ఉన్న ఆహారాల్లో చెరుకు గడలు ఒకటి. చెరుకు రసం తీసుకున్నా, చెరుకు నేరుగా తిన్నా కూడా సూక్రోజ్ పుష్కలంగా శరీరంలో చేరిపోతుంది. అలాగే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కూడా వీటిలో నిండుగా ఉంటాయి. అధిక చక్కెర కంటెంట్ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై దాని ప్రభావం విపరీతంగా పడుతుంది.

చాక్లెట్లు

స్వీట్లు, చాక్లెట్లు వంటి తీపి పదార్థాలలో అధిక మొత్తంలో చక్కెర, కొవ్వులు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటిలో తక్కువ పీచు ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. తిన్నంతసేపు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి... కానీ ఆ తర్వాత మాత్రం ఆరోగ్యానికి ఎంతో కీడు చేస్తాయి.

ప్రాసెస్డ్ ఆహారం

మార్కెట్లో ప్రాసెసింగ్ ఆహారం అధికంగానే లభిస్తోంది. చక్కెర, మైదా పిండి, పాస్తా, వైట్ బ్రెడ్ వంటివన్నీ ప్రాసెస్డ్ ఆహారంలోకే వస్తాయి. ఇలాంటి శుద్ధి చేసిన ఆహారాల్లో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటికి బదులు తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, లీన్ ప్రోటీన్ వంటివి తినాల్సి ఉంటుంది.

కొన్ని రకాల కూరగాయలు

కూరగాయలన్నీ ఆరోగ్యానికి మంచివే... అయితే బంగాళదుంపలు, మొక్కజొన్న, బఠానీలు వంటి వాటిలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు వీటిని తక్కువగా తినాలి.

ఫాస్ట్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, ఎనర్జీ బార్లు, చికెన్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ జాబితాలోకే వస్తాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరుగుతాయి.

పైన చెప్పిన ఆహారాలను డయాబెటిస్ పేషెంట్లు మాత్రమే కాదు మిగతావారు కూడా తక్కువగా తినడం చాలా మంచిది. ముఖ్యంగా 40 ఏళ్ల దాటిన వారు పైన చెప్పిన ఆహారాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇప్పుడు చిన్న వయసులోనే డయాబెటిస్ దాడి చేస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Whats_app_banner