cauliflower rice: బియ్యం లేకుండా క్యాలీఫ్లవర్‌తో రైస్.. ఆరోగ్యానికి వేరీ నైస్-how to make cauliflower rice at home instead of rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cauliflower Rice: బియ్యం లేకుండా క్యాలీఫ్లవర్‌తో రైస్.. ఆరోగ్యానికి వేరీ నైస్

cauliflower rice: బియ్యం లేకుండా క్యాలీఫ్లవర్‌తో రైస్.. ఆరోగ్యానికి వేరీ నైస్

Koutik Pranaya Sree HT Telugu
May 08, 2023 11:48 AM IST

బియ్యం లేకుండా క్యాలీఫ్లవర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

క్యాలీఫ్లవర్ రైస్
క్యాలీఫ్లవర్ రైస్ (pexels)

బియ్యం లేకుండా చేయడమేంటీ అనుకోకండి. బియ్యానికి బదులుగా చాలా మంది క్యాలీఫ్లవర్ తో చేసిన రైస్ తింటున్నారిప్పుడు. దాంట్లో ఉండే పోషకాలు ఒక కారణమైతే..బియ్యం కన్నా తక్కువ కేలరీలు ఉండటం మరో కారణం. అందుకే ఇది బియ్యానికి ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అంటే బియ్యంతో అన్నానికి బదులు క్యాలీఫ్లవర్ తో అన్నమన్నమాట. తక్కువ కేలరీలు ఉండటమే కాకుండా విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, పొటాషియం, ఫోలేట్, ఐరన్, క్యాల్షియం, జింక్ లాంటి చాలా పోషక విలువలున్నాయి.

1. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో ఇది పోరాడుతుంది. శరీర ఆరోగ్యం కాపాడుతుంది.

2. పీచు అధికంగా ఉండటం వల్ల ఆహారం జీర్ణమవడంలో, పేగు ఆరోగ్యంలో ఇది ఉపయోగపడుతుంది.

3. దీంట్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడంలో సాయపడుతుంది.

4.క్యాలీఫ్లవర్ లో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో సోడియం స్థాయుల్ని నియంత్రిస్తుంది.

ఇంతకీ ఈ క్యాలీఫ్లవర్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం.

దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు:

1. ఫుడ్ ప్రాసెసర్ లేదా మిక్సీ ద్వారా:

ఇది చేసుకోవడం కష్టమేం కాదండీ. ముందు క్యాలీఫ్లవర్ శుభ్రంగా కడుక్కోవాలి. ఇపుడు కింద కాస్త ఆకుపచ్చ రంగులో ఉండేదంతా కట్ చేసుకోవాలి. మీద తెల్లటి పువ్వులను మాత్రమే క్యాలీఫ్లవర్ రైస్ కోసం వాడాలి. వీటిని ఒక ఫుడ్ ప్రాసెసర్ లో వేసుకొని బియ్యం లాగా సన్నగా, పొడిపొడిగా అయ్యేలా చేసుకోవచ్చు. ప్రాసెసర్ లేకపోతే మిక్సీలో వేసి కాస్త మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకుంటే. రసం రాకుండా పొడిగా బియ్యం తయారవుతుంది.

2. గ్రేటర్:

క్యారట్, పనీర్ తురుముకునే గ్రేటర్ తో క్యాలీఫ్లవర్ ను తురుముకోవచ్చు. చక్కగా వస్తుంది. కాకపోతే ఒక కప్పు రైస్ అనుకుంటే ఇలా చేసుకోవడం సులువే. ఎక్కువ మందికి చేయాల్సి వస్తే కాస్త కష్టమవుతుందంతే.

ఎలా వండుకోవాలి?

కొంతమంది దీన్ని నేరుగా తింటారు. అలా తినలేం అనుకుంటే ఒక వెడల్పుగా ఉన్న కడాయిలో ఒక చెంచా నూనె వేసుకోవాలి. దాంట్లో ఈ క్యాలీఫ్లవర్ రైస్ వేసుకుని ఒక రెండు నిమిషాలు సన్నం మంట మీద కలుపుతూ ఉండండి. కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకుని తినేయడమే. ఎక్కువ సేపు ఉడికిస్తే బియ్యం లాగా అనిపించదు. మెత్తగా అయిపోతుందని గుర్తుంచుకోండి. దీన్ని సలాడ్లలోకి, ఫ్రైడ్ రైస్ లో మామూలు బియ్యానికి బదులుగా వాడుకోవచ్చు.

Whats_app_banner