Quinoa Dosa: షుగర్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే.. రుచికరమైన క్వినోవా ఓట్స్ దోశ..-how to do diabetic friendly breakfast quinoa oats dosa ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Quinoa Dosa: షుగర్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే.. రుచికరమైన క్వినోవా ఓట్స్ దోశ..

Quinoa Dosa: షుగర్ ఉన్నవాళ్లు కూడా తినగలిగే.. రుచికరమైన క్వినోవా ఓట్స్ దోశ..

Koutik Pranaya Sree HT Telugu
Nov 09, 2023 06:30 AM IST

Quinoa Dosa: అల్పాహారంలోకి క్వినోవా, ఓట్స్ కలిపి చేసే దోశ ప్రయత్నించారా. మధుమేహులకు ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. వీటిని ఎలా చేసుకోవాలో వివరంగా చూసేయండి.

క్వినోవా దోశ
క్వినోవా దోశ (unsplash)

మధుమేహం ఉన్నవాళ్లు క్వినోవా, ఓట్స్ అల్పాహారంలోకి తినడం ఆరోగ్యకరం. ఈ రెండూ కలిపి దోశలు చేసి తినేయొచ్చు. రుచిలో కూడా బాగుంటాయి. వీటితో పాటూ కొన్ని పప్పుల్ని కలపడం వల్ల దోశ రుచి ఇంకాస్త పెంచుకోవచ్చు. పిండి పులియాల్సిన అవసరం కూడా లేదు. పక్కాకొలతలతో ఈ దోశలు ఎలా వేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు క్వినోవా

సగం కప్పు ఓట్స్

సగం కప్పు మినప్పప్పు

పావు కప్పు శనగపప్పు

తగినంత ఉప్పు

3 చెంచాల నూనె లేదా నెయ్యి

తయారీ విధానం:

  1. ముందుగా క్వినోవాను శుభ్రంగా కడుక్కోవాలి. అది మునిగేఅంత నీళ్లు పోసుకుని కనీసం నాలుగు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
  2. మరో గిన్నెలో ఓట్స్, శనగపప్పు, మినప్పప్పు కూడా కడుక్కుని నీళ్లలో నాలుగు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
  3. మిక్సీ జార్‌లో క్వినోవా, ఓట్స్, పప్పులు వేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒక అరగంటయ్యాక వెంటనే దోశలు వేసుకోవచ్చు.
  4. ఒక పెనం వేడి చేసుకుని ఒక గరిటెడు పిండిని వేసుకుని సన్నని దోశలాగా వేసుకోవాలి. అంచుల వెంబడి నూనె లేదా నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి.
  5. రెండు వైపులా దోశ కాల్చుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. ఏదైనా చట్నీతో ఈ దోశలు బాగుంటాయి.

Whats_app_banner