Pregnancy diet: ప్రెగ్నెన్సీలో తప్పకుండా తినాల్సిన ఆహారాలు, బిడ్డకు తల్లికీ ఆరోగ్యం
Pregnancy diet: ప్రెగ్నెన్సీ నిర్ధారణ కాగానే తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన శిశువు కోసం తప్పక తినాల్సివని కొన్నున్నాయి. అవేంటో చూడండి.
ప్రెగ్నెన్సీ అనేది స్త్రీ జీవితంలో చాలా అందమైన, మధురమైన ఘట్టం. ఈ సమయంలోనే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే శిశువు ఆరోగ్యంతో పాటూ, తల్లి ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆహారంలో తప్పకుండా కొన్ని చేర్చుకోవాలి. గర్భధారణ నిర్దారణ కాగానే మీరు తినడం ప్రారంభించాల్సిన ఆహారాలివే.
ఈ పండ్లు:
ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. పోషకాలు అందటం కోసం పండ్లు తినడం ప్రారంభించండి. ఈ సమయంలో బొప్పాయి, పైనాపిల్, సపోటా వంటి వేడి చేసే పండ్లను తినకపోవడం ఉత్తమం. ఇక తప్పకుండా తినాల్సింది నారింజ పండు. ఇందులో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఉంటుంది. నారింజలో ఉండే ఫోలిక్ యాసిడ్ న్యూరల్ ట్యూబ్ లోపాల నుంచి కాపాడుతుంది.
కొబ్బరి నీరు:
గర్బధారణలో కొబ్బరి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, కాల్షియంతో పాటు ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి. కాబట్టి కొబ్బరి నీరు మీ రోజువారీ పోషక అవసరాల్ని తీర్చగలదు. గర్భధారణ సమయంలో కొబ్బరి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చిలగడదుంపలు:
ప్రెగ్నెన్సీ సమయంలో చిలగడదుంపలు తినొచ్చు. ఇందులో విటమిన్ ఎ, బి6, సి ఉంటాయి. పిండం ఎదుగుదలకు విటమిన్ ఎ చాలా అవసరం. ఎముకలు, కణజాలాల అభివృద్ధికి కూడా ఇది మంచిదని చెబుతారు. ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. అయితే దీన్ని పగటిపూట తింటే మంచిది. రాత్రి పూట తింటే జీర్ణం అవడంలో కష్టం అవ్వచ్చు.
మొలకెత్తిన గింజలు:
మొలకల్లో ఐరన్, ఫైబర్ ఉంటాయి. ఇది శిశువు అభివృద్ధికి సహాయపడుతుంది. ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో తినడం మంచిదనడానికి అనేక కారణాలున్నాయి. అయితే కొందరికి మొలకెత్తిన గింజలు పచ్చిగా తింటే అజీర్తి సమస్య రావచ్చు. కాబట్టి వీటిని ఉడికించి తినడం ఉత్తమం. పచ్చి మొలకలు బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. ఇది కూడా ప్రెగ్నెన్సీలో కాస్త హాని కలిగించొచ్చు. మీకు సందేహం ఉంటే వైద్యుల్ని ఒకసారి సంప్రదించి స్పష్టత తెచ్చుకుంటే మేలు. మీ శరీర గుణం బట్టి మీకు మంచి సలహా ఇస్తారు.
టాపిక్