Headache Hacks । మందులు, మాత్రలు అవసరం లేదు.. ఈ ట్రిక్స్‌తో సహజంగా తలనొప్పి మాయం!-headache hacks try these simple tricks to get rid of a headache natural ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Headache Hacks । మందులు, మాత్రలు అవసరం లేదు.. ఈ ట్రిక్స్‌తో సహజంగా తలనొప్పి మాయం!

Headache Hacks । మందులు, మాత్రలు అవసరం లేదు.. ఈ ట్రిక్స్‌తో సహజంగా తలనొప్పి మాయం!

HT Telugu Desk HT Telugu
Oct 06, 2022 06:32 PM IST

Headache Hacks- Natural Ways: తలనొప్పి వేస్తే తలను గోడకు బాదుకోవడం చేయకండి. నొప్పి నివారణ బామ్‌లు, పెయిన్ కిల్లర్ మాత్రలు, టీకాఫీలు ఇవేమి వద్దు. సహజంగానే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆ మార్గాలేమిటో చూడండి.

<p>Headache Hacks- Natural Tricks</p>
Headache Hacks- Natural Tricks (Unsplash)

తలనొప్పి అనేది అనుకోకుండా వచ్చేస్తుంది. దీనికి కారణమేదైనా ఉండవచ్చు. కొన్నిసార్లు విపరీతమైన ఆలోచనలు, పనిభారం, ఒకేసారి వివిధ పనులను చేయాల్సి రావటం వలన కూడా తల హీటెక్కిపోతుంది. ఇలా తలనొప్పితో పనిచేయాల్సి రావటం తలకు మించిన భారంలా పరిణమించవచ్చు. మరి ఈ తలనొప్పి తగ్గటానికి మనలో చాలా మంది వెంటనే తలనొప్పి మాత్రవేసుకోవడం, జండూ బామ్ వంటివి రాసుకోవటం లేదా టీకాఫీలు, పొగపీల్చటాలు చేసేస్తారు. అయితే ఇలాంటివేమి అవసరం లేకుండానే సులభంగా కొన్ని చిట్కాల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

తలనొప్పి కలగగానే వెంటనే పెయిన్‌కిల్లర్స్ వినియోగించకూడదు. ఇలాంటి షార్ట్‌కట్‌ను నమ్ముకుంటే అది హృదయ సంబంధ సమస్యలకు దారితీస్తుంది, మీ కాలేయాన్ని దెబ్బతీస్తుంది అంతేకాకుండా అనేక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది అని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మందులతో అప్పటికప్పుడు ఉపశమనం లభించినా, అవి అనేక విధాల హాని కలిగిస్తాయని చెబుతున్నారు. అప్పుడప్పుడు తలనొప్పులు సర్వసాధారణం.

Natural Headache Hacks: సహజ మార్గాలతో తలనొప్పి మాయం

సాధారణంగా డీహైడ్రేషన్, కండరాల ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళనల ఫలితంగా తలనొప్పి వస్తుంది. అప్పుడప్పుడు మిరుమిట్లుగొలిపే కాంతి కూడా తలనొప్పికి కారణం కావొచ్చని హెల్త్ ఆప్టిమైజింగ్ బయోహ్యాకర్, సైకాలజీ స్పెషలిస్ట్ టిమ్ గ్రే పేర్కొన్నారు. తలనొప్పికి ఎలాంటి నొప్పి నివారణ మందులు అవసరం లేకుండా కొన్ని 5 సింపుల్ ట్రిక్స్ సూచించారు. అవేంటంటే..

1. మినరల్ వాటర్ తాగండి

తలనొప్పికి ఉన్నప్పుడు మీరు చేయగలిగే ఉత్తమమైన పని మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడం. వెంటనే తగినన్ని నీళ్లు తాగండి, మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోండి. H2Oతో పాటు మీకు సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాలు అవసరం. కావున అవి ఉన్న మినరల్ వాటర్ లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్ తీసుకోవటం ఉత్తమం. నీటిలో చిటికెడు సముద్రపు ఉప్పు కలుపుకొని తాగండి, కొబ్బరి నీరు తాగితే కూడా తలనొప్పి తగ్గుతుంది.

2. మీరు కూర్చునే భంగిమ మార్చండి

మీ డెస్క్‌పైకి వంగి, మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ క్రిందికి చూస్తూ పనిచేయటం వలన టెన్షన్, వెన్నునొప్పి, మెడనొప్పి, తలనొప్పులు సంభవిస్తాయి. కావున మీరు కూర్చునే భంగిమ మార్చండి. అప్పటికప్పుడు కొన్ని యోగా స్ట్రెచ్‌లు చేయడం, ఫోమ్ రోలింగ్ చేయడం, మీకు మీరుగా ప్రెజర్ పాయింట్ వద్ద మసాజ్ చేయడం ద్వారా మీ తలనొప్పితో పాటు ఇతర నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

3. ఒక కిటికీ తెరవండి

గదిలో ఆక్సిజన్ శాతం తక్కువై కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగటం వలన ఊపిరి సరిగా జరగదు. దీని వలన అలసట, తలనొప్పి, ఏకాగ్రత కోల్పోవడం మొదలైన సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఒక కిటికీని తెరిచి మీ గదిని వెంటిలేషన్ చేయడం ద్వారా స్వచ్ఛమైన గాలివస్తుంది. ఆక్సిజన్ స్థాయిలు పెరిగి తలనొప్పి, అలసట మాయం అవుతాయి.

4. జంక్ లైట్‌ని తొలగించండి

చాలా ప్రకాశంతో కూడిన ఫ్లోరోసెంట్ లైట్లు లేదా LED లు ఉండటం పెద్ద సమస్య. ఇవి కంటిపై భారాన్ని కలిగిస్తాయి, ఈ లైటింగ్‌లో ఫ్లికర్ ఉంటుంది. ఫ్లికర్ కూడా వాస్తవానికి మైగ్రేన్ ను కలిగించే ఒక కారకం. కాబట్టి మీరు పనిచేసే చోట వీలైతే ఫ్లోరోసెంట్ లేదా LED లైట్లను తీసివేయండి లేదా ఆఫ్ చేయండి. వాటి స్థానంలో హాలోజన్ బల్బులతో భర్తీ చేయండి.

5. బయట తిరగండి

తలనొప్పి ఉన్నప్పుడు మీరు చేసే పనుల నుండి కాస్త బ్రేక్ తీసుకోండి. బయటికి వచ్చి పరిసరాలను చూస్తూ బయటి గాలిని పీల్చండి. మీ శరీరాన్ని కొద్దిగా కదిలించడం, సూర్యరశ్మిని అందించడం చేయడం వలన మీ ఒత్తిడి స్థాయిలు తగ్గి, మానసిక స్థితి మెరుగుపడుతుంది. తలనొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ చిట్కాలు సాధారణ తలనొప్పిని పరిష్కరిస్తాయి. అయితే మీరు దీర్ఘకాలిక తలనొప్పి లేదా మైగ్రేన్‌లతో పోరాడుతున్నట్లయితే, వైద్య సహాయం అవసరం.

Whats_app_banner

సంబంధిత కథనం