Migraine Hangover । తలనొప్పిని తేలిగ్గా తీసుకోకండి.. మైగ్రేన్ కావొచ్చు!
మైగ్రేన్ చాలా బాధాకరమైన సమస్య, తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇటీవల కాలంగా 18 నుంచి 30 వయసు వారు దీని బారినపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోం చేసేవారిలో ఈ కేసులు అధికమవుతున్నాయి. దీనిని ఎలా నివారించవచ్చో ఇక్కడ తెలుసుకోండి..
ఇప్పుడు ఎంతో మందిని వేధిస్తున్న ఒక సమస్య మైగ్రేన్. దాదాపు అన్ని వయసుల వారు మైగ్రేన్ బారిన పడుతున్నారు. మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి, ఇది సాధారణంగా తలకు ఒక వైపున మొదలై తీవ్రంగా, జల్లుమనిపించే అనుభూతిని కలిగిస్తుంది. ఇది తరచుగా వికారం, వాంతులు, కాంతి చూసినపుడు, ధ్వనికి తీవ్ర సున్నితత్వంతో కూడిన లక్షణాలను ఉంటుంది. ఈ మైగ్రేన్ పోటు కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకూ వేధించవచ్చు. మీ రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించేంతగా, తల బద్ధలు కొట్టుకోవాలనిపించేలా దీని తీవ్రంగా ఉంటుంది.
ఇందులోనే మైగ్రేన్ హ్యాంగోవర్ అని కూడా ఉంటుంది. సాధారణంగా హ్యాంగోవర్ అనేది అతిగా అల్కాహాల్ సేవించినపుడు కలిగేది. అయితే మైగ్రేన్ హ్యాంగోవర్‌కు అల్కాహాల్‌తో సంబంధం లేదు, కానీ ఆ రకమైన లక్షణాలు ఉంటాయి. ఇది మైగ్రేన్ సమస్యలో చివరి దశ, దీనినే పోస్ట్ డ్రోమ్ అని కూడా అంటారు.
కొంతమందిలో 'ఆరా' అని పిలిచే ఒక హెచ్చరిక సంకేతం తలనొప్పికి ముందు లేదా తలనొప్పితో పాటుగా సంభవిస్తుంది. కాంతిని చూడలేకపోవటం, కళ్లల్లో మెరుపుల లాంటి అనుభూతి లేదా ముఖంలో ఒక వైపు జలదరింపు, అలాగే చేయి, కాలులో జలదరింపు కలుగుతాయి. మాట్లాడటంలో కూడా ఇబ్బంది తలెత్తుతుంది. ఒక పరిశోధన ప్రకారం మైగ్రేన్ అనేది వైకల్యానికి దారితీసే ఏడవ అత్యధిక కారణం. జీవనశైలి, పర్యావరణ కాలుష్యం వలన మైగ్రేన్ అనేది మరింత తీవ్రం అవుతుంది.
అయితే మైగ్రేన్ లక్షణాలను ప్రారంభంలోనే అర్థం చేసుకోవడం, గుర్తించడం ద్వారా వెంటనే నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఈ రకంగా చేస్తే ఈ బాధాకరమైన సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి?
న్యూరోసర్జన్లు చెప్పే ప్రకారం మైగ్రేన్ అనేది తలనొప్పిలో ఒక రకం. ఇది ఉన్నప్పుడు వ్యక్తికి ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి, వాంతులు కలుగుతాయి. పెద్ద శబ్దాలు, ప్రకాశవంతమైన కాంతితో ఇబ్బంది పడుతుంటారు. ఈ మైగ్రేన్‌లోనూ అనేక రకాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా వివిధ లక్షణాలు, సమస్యలు బయటపడతాయి. అయితే అతి సాధారణ లక్షణం ఏమిటంటే మైగ్రేన్‌తో బాధపడుతున్న వ్యక్తి తీవ్రమైన తలనొప్పితో పాటు శరీరంలోని ఒక భాగంలో బలహీనతను అనుభవిస్తాడు. కొన్ని గంటల తర్వాత శరీరం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. ఈ రకమైన సమస్య 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. అప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ముఖ్యంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య యువకులు దీనిని నివారించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మైగ్రేన్ రావడానికి అతి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. యువత ఎక్కువగా అర్ధరాత్రి వరకు మేల్కొంటారు, ఎక్కువ సమయం పాటు స్క్రీన్లకు అతుక్కుపోతారు. సమయానికి ఆహారం కూడా తీసుకోరు. దీని వల్ల కూడా మైగ్రేన్ సమస్య రావచ్చు. ఇటీవల కాలంగా ఇంటి నుండి పని చేసే వారిలో మైగ్రేన్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి.
మైగ్రేన్‌ను ఎలా నివారించాలి
- మొట్టమొదటగా జీవనశైలిని మార్చుకోవాలి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
- సరైన నిద్రవేళను పాటించాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
- ఒత్తిడి, ఆందోళనలకు దూరంగా ఉండాలి.
- రక్తంలో గ్లూకోజ్‌ని నియంత్రణలో ఉంచుకోవాలి. సుదీర్ఘ ఉపవాసాలు మానుకోవాలి.
- యోగా, ధ్యానంతో పాటు ఇతర వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి.
- సరిపడా నీరు తీసుకోవాలి
- మంచి నిద్ర ఉండాలి, మెరుగైన విశ్రాంతి ఉండాలి
ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మైగ్రేన్ సమస్యను దూరం చేసుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్