Aloo Gobi Recipe | ఆలూ గోబి.. అద్వితీయమైన రుచి, కేవలం 10 నిమిషాల్లోనే రెడీ!
Aloo Gobi Recipe: ఏ వంటకమైనా మీరు చేసుకునే కూరతో, అందులో వేసుకునే మసాలా దినుసులు, తయారు చేసుకునే విధానంతోనే రుచిగా, శుచిగా ఉంటుంది. ఈ విధంగా ఆలూ గోబీ కూర చేసి చూడండి, రెసిపీ ఇక్కడ ఉంది.
భారతీయ వంటకాలు వైవిధ్యంగా ఉంటాయి, అనేక వంటకాల్లో చాలా రకాల సుగంధ ద్రవ్యాల వినియోగం ఉంటుంది. మనం ప్రతిరోజూ లంచ్ లేదా డిన్నర్ కోసం వివిధ కూరగాయలను ఉపయోగించి రుచికరమైన కూరలు చేసుకుంటాం. ఇందులో ఆలూ గోబి అనేది చాలా ప్రజాదరణ పొందిన ఒక క్లాసిక్ వంటకం. బంగాళ దుంపలు, కాలీఫ్లవర్‌తో తయారు చేసే ఈ రుచికరమైన కూరను కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇందులో వినియోగించే సుగంధ ద్రవ్యాల కలయిక ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. దీనిని మీరు చపాతీ తినవచ్చు, లేదా అన్నంలో కలుపుకొని తినవచ్చు, ఎలా తిన్నా అది మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది.
ఆలూ గోబిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది వారికి ఒక రోజులో కావలసిన మోతాదులో కూరగాయలు, ప్రొటీన్‌లను, ఇతర పోషకాలను అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇక్కడ సింపుల్ ఆలూ గోబి రెసిపీని అందిస్తున్నాం, ఇక్కడ ఇచ్చిన సూచనల ద్వారా మీరు దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి మీరు సిద్ధమేనా? అయితే రెసిపీ చూసేయండి.
Potato Cauliflower Curry- Aloo Gobi Recipe కోసం కావలసినవి
- 500 గ్రాముల కాలీఫ్లవర్
- 250 గ్రాముల బంగాళదుంపలు
- 1/4 కప్పు నెయ్యి
- 1 స్పూన్ జీలకర్ర
- 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము
- 1/4 కప్పు పెరుగు
- 2-3 పచ్చిమిర్చి
- 1/2 స్పూన్ కారం
- 1/4 టీస్పూన్ పసుపు
- 1/2 స్పూన్ గరం మసాలా
- 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
- ఉప్పు రుచికి తగినంత
- తాజా కొత్తిమీర గార్నిషింగ్ కోసం
ఆలూ గోబి కూర ఎలా తయారు చేయాలి
1.బంగాళదుంపలను ఉడకబెట్టి పక్కన పెట్టండి. గోబి పువ్వును కూడా ముక్కలుగా కట్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడకబెట్టి, నీరు వడకట్టి పక్కనపెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక లోతైన పాన్‌లో నెయ్యి లేదా నూనె వేడి చేసి, జీలకర్రను వేసి వేయించండి.
3. జీలకర్ర చిమ్మినప్పుడు, అల్లం తురుము వేసి వేయించండి, ఆపైన పెరుగు వేసి బాగా కలుపుతూ ఉండండి.
4. ఇప్పుడు కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, పొడవుగా కోసిన పచ్చిమిర్చి వేయండి, 2-3 నిమిషాలు బాగా వేయించాలి.
5.తరువాత కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి అన్నీ బాగా కలిసిపోయే వరకు కొన్ని సార్లు కలపండి.
6. వేడిని తగ్గించి, పాన్ మూతపెట్టి, కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి, మధ్యమధ్యలో అడుగు మాడకుండా కలుపుతుండండి.
7. చివరగా కొత్తిమీర ఆకులతో గార్నిషింగ్ చేయండి.
అంతే, ఘుమఘుమలాడే ఆలూ గోబి కూర రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
సంబంధిత కథనం