Foods For Alzheimer's: అల్జీమర్స్‌ని రాకుండా చేసే ఆహారాలివే..
Foods For Alzheimer's: వయసు పైబడే కొద్దీ వచ్చే అవకాశమున్న అల్జీమర్స్ వ్యాధి కోసం కొన్ని రకాల ఆహారాలు తప్పకుండా తినాలి. ఇవి ఈ వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవేంటో తెల్సుకోండి.
అల్జీమర్స్ అనేది మతి మరుపుకు సంబంధించిన వ్యాధి. మొదట్లో ఇది కొంచెం కొంచెంగా ఉండి కాలం గడిచే కొద్దీ తీవ్రతరం అవుతూ ఉంటుంది. వయసు మీద పడే కొద్దీ ఈ సమస్య మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. దీన్నే చిత్త వైకల్యం అని కూడా పిలుస్తుంటారు. దీనివల్ల చివరికి చిన్న చిన్న పనులను సైతం చేసుకోలేనట్లుగా తయారవుతారు. మెదడు కణాలు మరణించడం వల్ల ఇది వస్తుంది. అయితే ఇది రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల మెదడు కణాలు నశించే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.
ఆకుకూరలు:
ముదురు ఆకు పచ్చగా ఉండే ఆకు కూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. పాల కూర, కాలే లాంటి వాటిలో విటమిన్ కే, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్ అనేది హోమోసిస్టీన్ని నియంత్రించడంలో సహకరిస్తుంది. ఇది ఎక్కువైతే అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిల్లో దొరికే విటమిన్ కే మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ కవచం ఏర్పడటంలో సహకరిస్తుంది.
ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండే ఆహారాలు :
మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండి అల్జీమర్స్ రాకుండా ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం కోడి, మేక మాంసాలు, బీఫ్, పోర్క్ లాంటి వాటిలో ఉండే ప్రొటీన్లు ఇందుకు సహకరిస్తాయి. అలాగే గుడ్లు, గింజలు, డ్రై ఫ్రూట్స్ లాంటి వాటిలోనూ ప్రొటీన్ల అధికంగా ఉంటాయి. రోజుకు కనీసం 120 గ్రాముల వరకు ప్రొటీన్లు ఆహారంలో తీసుకునేలా చూసుకోవాలి.
బెర్రీలు:
బ్లూబెర్రీలు, స్ట్రాబెరీలు, రాస్‌బెర్రీల్లాంటి వాటిల్లో యాంటీ ఫ్లేవనాయిడ్లు, ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహకరిస్తాయి. అలాగే ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి వాపుల్ని తగ్గిస్తాయి. అందువల్ల అల్జీమర్స్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
నట్స్:
వాల్‌నట్స్, బాదాం, హేజల్ నట్స్ లాంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి మెదడు ఆరోగ్యంగా పని చేయడంలో సహకరిస్తాయి. అందుకనే రోజూ ఓ గుప్పెడు నట్స్‌ని తినేందుకు ప్రయత్నించాలి.
పసుపు:
భారతీయ వంటిళ్లలో పసుపును ఎక్కువగానే వాడుతూ ఉంటారు. ఇది అల్జీమర్స్ ప్రమాదాన్ని చెప్పుకోదగ్గ రీతిలో తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే కుర్య్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల మెదడు పనితీరు మెరుగుగా ఉంటున్నట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యింది.