Food Safety । ఆహారాలను తాజాగా ఉంచటానికి, వివిధ రకాల నిల్వ చేసే పద్ధతులను తెలుసుకోండి!
Food Safety: ఆహార పదార్థాలు చెడిపోవడానికి వాటిని నిల్వ చేసే లేదా భద్రపరిచే విధానంలో చేసే తప్పులు కూడా కారణం కావచ్చు. వివిధ ఆహారాలను నిల్వచేసే మార్గాలు చూడండి.
Food Safety: ఎల్లప్పుడూ తాజాగా వండిన ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. చెడిపోయిన ఆహారం లేదా చెడిపోయిన పదార్థాలతో చేసిన ఆహారం తింటే అనారోగ్య సమస్యలు తప్పవు, కొన్నిసార్లు ఆ ఆహారం విషతుల్యంగా మారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆహార పదార్థాలను కడగటం మొదలుకొని వాటిని నిల్వచేయడం వరకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలి.
కొన్నిసార్లు ఆహార పదార్థాలు చెడిపోవడానికి వాటిని నిల్వ చేసే లేదా భద్రపరిచే విధానంలో చేసే తప్పులు కూడా కారణం కావచ్చు. సాధారణంగా మనం ఆహార పదార్థాలను ఒకేసారి తెచ్చుకొని వాటిని రోజుల తరబడి ఉపయోగిస్తాం. కాబట్టి వాటిని సరైన రీతిలో నిల్వచేయడం ముఖ్యం. చాలావరకు మనం అనేక రకాల ఆహారాలను రీఫ్రిజరేటర్లలోనే నిల్వచేస్తాం. కానీ, కొన్నింటిని ఫ్రిజ్ లో నిల్వచేయడం వలన అవి చెడిపోవడం లేదా వాటి నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. నిజానికి ఆహారాన్ని నిల్వ చేయడం అనేది పాతకాలం నుంచే ఉంది, అనేక సాంప్రదాయ సంరక్షణ పద్ధతులు నేటికీ ఉపయోగిస్తున్నారు. అందులో కొన్ని చూడండి..
ఎండబెట్టడం
ఆహారాలను ఎండబెట్టి ఆపై వాటిని భద్రపరచటం అనేది చాలా రోజుల నుంచి కొనసాగుతున్న ఒక పద్ధతి. ఆహారాలపై బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి ఆహారం నుండి తేమను తొలగించడం కోసం ఎండబెడతారు. సాధారణంగా కొన్నిరకాల పండ్లు, కూరగాయలు, మాంసాన్ని నిల్వ చేయడానికి ఈ విధానం ఉపయోగిస్తారు. ఎండిన మామిడి, ఎండుద్రాక్ష, టమోటాలు మొదలైనవి ఈ జాబితాలో ఉంటాయి. స్థానిక భాషలో దీనిని అరుగుపెట్టడం అని కూడా అంటారు.
పులియబెట్టడం
కిణ్వ ప్రక్రియ ద్వారా కొన్ని రకాల ఆహార పదార్థాలను నిల్వ చేయవచ్చు. ఈ ప్రక్రియలో వాటి నిల్వచేయడం ద్వారా వాటి రుచి, నాణ్యత పెరుగుతుంది. అయితే ఇందుకు నిర్ధిష్ట కాలపరిమితి అనేది ఉంటుంది. కిణ్వ ప్రక్రియను సాధారణంగా పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులతో పాటు, పచ్చళ్లు, వైన్, వెల్లుల్లి వంటివి నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
స్మోకింగ్
పొగబెట్టడం అనేది మాంసాన్ని నిల్వచేసే సాంప్రదాయ పద్ధతి. ఇందులో మాంసాన్ని నిప్పు మీద వేలాడదీస్తారు, ఆపై దాని పొగను మాంసానికి తగిలేలా చేస్తారు. ఇది మాంసానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది, బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. కొంతకాలం పాటు మాంసాన్ని నిల్వ చేస్తుంది. కలప పొగలో పెద్ద సంఖ్యలో యాంటీ-మైక్రోబయల్ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి జంతువుల కొవ్వుల రాన్సిడిఫికేషన్‌ను నెమ్మదిస్తాయి.
క్యానింగ్
క్యానింగ్ అనేది సాపేక్షంగా ఆహార సంరక్షణకు సంబంధించిన ఆధునిక పద్ధతి, ఇందులో ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్‌లలో మూసివేసి, వాటిని వేడితో క్రిమిరహితం చేస్తారు. క్యానింగ్ సాధారణంగా పండ్లు, కూరగాయలు, అలాగే సాస్, జామ్‌లను సంరక్షించడానికి ఉపయోగిస్తారు.
ఫ్రీజింగ్
ఆహార పదార్థాలను కనిష్ట ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయడం ద్వారా వాటిని కొంతకాలం పాటు తాజాగా ఉంచవచ్చు. నేడు అందరి ఇళ్లల్లో రీఫ్రిజరేటర్లను ఉపయోగిస్తున్నారు. వండిన పదార్థాలు, వండని పదార్థాలను కూడా శీతలీకరణ ద్వారా నిర్ధిష్ట కాలపరితి వరకు నిల్వచేయవచ్చు.
ఇవే కాకుండా ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఇవి ఆహార పదార్థాలను కొంతకాలం పాటు నిల్వచేయటానికి ఉపయోగపడటమే వాటిని తినడం ద్వారా వివిధ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతీ ఏడాది జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా (World Food Safety Day) నిర్వహిస్తారు. సురక్షితమైన ఆహారాన్ని తినమని చెప్పడం, ఆహారం ద్వారా వ్యాధులు రాకుండా నివారించడంపై అవగాహన కలిగించడం ఈరోజుకు ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
సంబంధిత కథనం
టాపిక్