Pickle Preservation | వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా ఈ పద్ధతులు పాటించండి!-know how to store mango pickles fresh during monsoon without adding preservatives ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pickle Preservation | వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా ఈ పద్ధతులు పాటించండి!

Pickle Preservation | వర్షాకాలంలో ఊరగాయ చెడిపోకుండా ఈ పద్ధతులు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Jul 18, 2022 12:16 PM IST

ఎండాకాలంలో ఎంతో ఇష్టపడి చేసుకున్న ఊరగాయ పాడవుతుందా? ఈ వర్షాకాలంలో ఊరగాయలు నిల్వ చేసేందుకు ఇక్కడ టిప్స్ ఇచ్చాం. ఇవి పాటిస్తే ఊరగాయలు వచ్చే సీజన్ వరకు తాజాగా ఉంటాయి.

Pickle Storage
Pickle Storage (Pexels)

వర్షాకాలంలో ఆహార పదార్థాల నిల్వ కూడా ఒక సమస్యగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ సీజన్ లో ఫుడ్ పాయినింగ్ జరిగే అవకాశం ఎక్కువ. వాతావరణంలో అధిక తేమ, తడి పరిస్థితుల కారణంగా ఆహార పదార్థాలు చెడిపోతాయి. పదార్థాలపై బూజు, ఫంగస్, ఇతర బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా మనం ఎండాకాలం సమయంలో ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసుకున్న ఊరగాయలపై కొన్నిసార్లు బూజుపట్టడం మనం చూస్తుంటాం. దీంతో మన శ్రమ వృధా అవడమే కాకుండా ఇష్టపడి చేసుకున్న వంటలు తినలేకుండా పాడేయాల్సి వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఊరగాయలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఆ చిట్కాలను ఇక్కడ చూడండి.

గాజు పాత్రలను ఉపయోగించడం

ప్లాస్టిక్ కంటైనర్లలో ఉంచిన ఊరగాయలు సులభంగా పాడవుతాయి. ఊరగాయలను స్టీల్ బాక్సుల్లో నిల్వచేయలేము. కాబట్టి గాజు పాత్రల్లో ఉంచడం ద్వారా ఊరగాయలను ఎక్కువ కాలంపాటు నిల్వ చేయవచ్చు. గాజు పాత్రలలో నిల్వ చేసినప్పుడు గాలిలోని తేమ ఊరగాయపై ప్రభావం చూపదు. గాజు కంటైనర్ బయటి పొర సూర్యకాంతిలో వెచ్చగా ఉంటుంది. ఇది తేమ లోపల పేరుకుపోవడానికి అనుమతించదు. కాబట్టి ఊరగాయలను సంరక్షించడానికి గాజు పాత్రలు ఉత్తమ ఛాయిస్ అని చెప్పవచ్చు.

నూనె, ఉప్పు కలయిక

ఊరగాయల్లో ఉప్పు, నూనెల కలయిక దాని నిల్వపై ఆధారపడి ఉంటుంది. ఉప్పు, నూనె ఊరగాయలలో ప్రిజర్వేటివ్‌లుగా పనిచేస్తాయి. ఊరగాయ పైన తేలియాడే నూనె పొర తేమను అడ్డుకుంటుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు ఊరగాయలు పెట్టేటపుడు అన్ని వస్తువులను సరైన పరిమాణంలో కలపడం ద్వారా ఊరగాయలు చాలా కాలంపాటు నిల్వ ఉండేవి. కానీ ఇప్పుడు ఫిట్‌నెస్ కోసం అని, ఆరోగ్యం అని ఊరగాయల్లో పదార్థాల నిష్పత్తిని తారుమారు చేస్తున్నారు. కాబట్టి నిల్వ ఉండటం లేదు. కాబట్టి ఊరగాయలు చెడిపోకుండా ఇప్పుడు కూడా కొంత ఉప్పు, లేదా నూనెను కలుపుకోవచ్చు.

తడి ప్రదేశాలకు దూరంగా ఉంచండి

ప్యాకింగ్ ఎంత ముఖ్యమో, పరిసరాలు కూడా ఊరగాయ నిల్వకు అంతే ముఖ్యం. ఊరగాయలు ఎప్పుడు పొడి ప్రదేశాల్లో ఉంచాలి. తడి లేని చోట, తేమకు ఆస్కారం లేనిచోట నిల్వచేయాలి. అలాగే ఊరగాయ జాడీలో సర్వింగ్ చెంచాను అలాగే ఉంచేయకూడదు. తడిచేతులతో ఊరగాయను తాకరాదు.

చిన్న జాడీల్లోకి మార్చడం

ఊరగాయతో జాడిలో నింపినప్పుడు తక్కువ మొత్తంలో గాలి/తేమ ఉంటుంది. మనం ఊరగాయను ఉపయోగించినకొద్దీ జాడిలో గాలి పరిమాణం పెరుగుతుంది, అలాగే తేమ శాతం పెరుగుతుంది. దీంతో ఊరగాయ తాజాదనాన్ని కోల్పోతుంది, క్రమంగా బూజుపడుతుంది.

కాబట్టి ఈ వర్షాకాలంలో ఊరగాయను చిన్న జాడీల్లో నింపి, దానిని రీఫ్రజరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్