Tea Addiction | అతిగా చాయ్ తాగుతున్నారా? అయితే సమస్యలు తప్పవు!-drinking too much tea cause side effects reduce chai addiction ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Drinking Too Much Tea Cause Side Effects, Reduce Chai Addiction

Tea Addiction | అతిగా చాయ్ తాగుతున్నారా? అయితే సమస్యలు తప్పవు!

HT Telugu Desk HT Telugu
Apr 25, 2023 10:15 AM IST

Tea Addiction: టీ మితంగా తాగితేనే మంచిది, చాయ్ అతిగా తాగటం వలన వివిధ రకాల సైడ్ ఎఫెక్టులు ఉంటాయి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

Drinking too much tea
Drinking too much tea (istock)

Drinking Too Much Tea: చాలా మందికి చాయ్ అంటే ఒక టానిక్ లాంటిది. సీజన్ ఏదైనా, సమయం ఏదైనా కడుపులో ఒక గ్లాస్ వేడి టీ పడితే వారికి వచ్చే ఎనర్జే వేరు. ఇలా ప్రతీ బ్రేక్‌లో టీ తాగుతారు, టీ కోసమే బ్రేక్ తీసుకుంటారు, బ్రేక్ లేకుండా టీ తాగేస్తుంటారు. అయితే మీరూ ఈ జాబితాలో ఉంటే జర జాగ్రత్త. ఇలా ఎడాపెడా టీ తాగటం వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టీ అనేది ఒక వ్యసనం లాంటిది. ఆ వ్యసనానికి మీరు బానిసైతే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.

ఒత్తిడిని పెంచుతుంది

టీ ఆకులలో సహజంగా కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం ఒత్తిడి, ఆందోళనలతో పాటు అవిశ్రాంతికర భావాలకు దోహదం చేస్తుంది. ఇది తలనొప్పి, కండరాల ఒత్తిడి, అనవసరపు భయాలను కూడా ప్రేరేపిస్తుంది. ఈ రకంగా టీ అలవాటు మీ మానసిక శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రోజుకు 200 mg కంటే ఎక్కువ మోతాదులో కెఫీన్ తీసుకుంటే ఆందోళనకర ప్రభావాలు ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

నిద్ర రుగ్మతలు

మీకు తరచుగా నిద్ర చాలటం లేదు అనిపించటం లేదా నిద్రలేమితో బాధపడుతుంటే అందుకు కారణం మీరు తాగే టీ కావచ్చు. టీలో కెఫిన్ ఉండటం వల్ల మీ నిద్ర చక్రంపై ప్రభావం పడుతుంది. మెలటోనిన్ అనేది మీ మెదడుకు నిద్రపోయే సమయం అని సూచించే హార్మోన్. కొన్ని పరిశోధనలు కెఫీన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధించవచ్చని సూచిస్తున్నాయి, ఫలితంగా నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుంది.

తక్కువ పోషక శోషణ

టీ అతిగా తాగటం వలన అది మీ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది, ఆహారంలోని పోషకాలను శరీరం శోషించుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. టీలో టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆహారాలలోని ఇనుమును బంధించగలవు, ఫలితంగా మీ శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు నిరంతరం బలహీనంగా అనిపించడం, రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గటం, రక్తహీనత వంటి పరిస్థితులకు దారితీస్తుంది.

గర్భిణీ స్త్రీలకు హానికరం

గర్భిణీ స్త్రీలకు గ్రీన్ టీ, కాఫీ తాగటం సిఫారసు చేయరు, ఎందుకంటే అందులోని కెఫీన్ గర్భిణీ స్త్రీలలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. టీలో కూడా కొద్దిమొత్తంలో కెఫీన్ ఉంటుంది. కాబట్టి టీ ఎక్కువగా తీసుకోవడం తల్లికి, అలాగే పుట్టబోయే బిడ్డకు హానికరం. ఇది త్వరగా గర్భ సంకోచాలకు కూడా కారణం కావచ్చు.

ఎసిడిటీ

టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, అలాగే యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. మనలో చాలా మంది పాలు కలిపిన టీ తాగుతాము, తరచుగా ఉదయం పూట ఖాళీ కడుపుతో కూడా ఈ టీ తీసుకుంటాము. ఇది జీర్ణ కణజాలాన్ని చికాకుపెడుతుంది. ఉబ్బరం, అసౌకర్యం, కడుపు నొప్పికి కూడా దారితీయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం