Joint Pains tips: కీళ్ల నొప్పులు తరచూ వేధిస్తున్నాయా? ఆ నొప్పుల బారిన పడకుండా ఇలా జాగ్రత్తపడండి-do joint pains bother you often take care not to suffer from those pains ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Pains Tips: కీళ్ల నొప్పులు తరచూ వేధిస్తున్నాయా? ఆ నొప్పుల బారిన పడకుండా ఇలా జాగ్రత్తపడండి

Joint Pains tips: కీళ్ల నొప్పులు తరచూ వేధిస్తున్నాయా? ఆ నొప్పుల బారిన పడకుండా ఇలా జాగ్రత్తపడండి

Haritha Chappa HT Telugu

Joint Pains tips: కీళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నొప్పుల వల్ల కూర్చోవడం, నిల్చోవడం వంటి పనులు కూడా చేయలేరు. కీళ్ల నొప్పులను ప్రాథమిక దశలోనే చిన్న చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

కీళ్లనొప్పులు ఎందుకు వస్తాయి? (Pixabay)

Joint Pains tips: ఆర్థరైటిస్... దీన్నే సింపుల్‌గా కీళ్ల నొప్పులు అని చెప్పుకుంటారు. ఆర్థరైటిస్ వల్ల కీళ్లల్లో దృఢత్వం, నొప్పి, వాపు వంటివి వస్తాయి. చురుకుగా కదల్లేదు. సాధారణ జీవనశైలికి కూడా ఇది ఇబ్బంది పెడుతుంది. అందుకే కీళ్లనొప్పులతో బాధపడేవారు కూర్చోలేక, నిల్చోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చేతులు, మోకాలు, తుంటి వెన్నెముకపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. మోకాళ్ళ నొప్పి అధికంగా వస్తుంది. మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల నడవలేక, కింద కూర్చోలేక, కూర్చున్న తర్వాత తిరిగి లేవలేక ఇబ్బందిగా అనిపిస్తుంది.

కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి?

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెబుతున్న ప్రకారం కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే కీళ్లకు అతిగా పని చెప్పడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. అలాగే వయస్సు రీత్యా కూడా ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడే అవకాశం ఎక్కువ. యాభై ఏళ్లు దాటిన వారిలో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కనబడుతుంది. అది కూడా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అధిక బరువుతో బాధపడే వారిలో కూడా ఆ బరువు కీళ్లపై, తుంటి, మోకాళ్ళపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణం అవుతుంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే అది మీకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆర్థరైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. అంటే మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. మీ బరువు పెరిగితే ఆ ఒత్తిడి కీళ్లపైనే పడుతుంది. వ్యాయామం చేయడం ద్వారా మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉంటే వ్యాయామం చేయలేమని చాలామంది అనుకుంటారు. కీళ్లపై తక్కువ ప్రభావం పడే వ్యాయామాన్ని చేయడం ఉత్తమం. ఈత, సైక్లింగ్, నడక వంటివి చేస్తే మీ మోకాలి కండరాలు బలోపేతం అవుతాయి. నొప్పి కూడా తగ్గుతుంది.

ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఫుడ్స్‌ను తీసుకోవాలి. ఇది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయి. ఆకుపచ్చని కూరగాయలు, నట్స్, సీడ్స్ వంటివి తినడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ప్రోబయోటిక్స్, ఖనిజాలు వంటివి ఉండే ఆహారంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

వయసు పెరిగిన వ్యక్తులకు

వయసు పెరిగాక ఆర్థరైటిస్ వస్తే మాత్రం మందులు వాడక తప్పదు. మన శరీరంలో సైనోబియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది కీళ్ళను కదిపేందుకు అవసరమైన పోషకం. మృదులాస్తి కీళ్ల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఇది కుషన్‌లాగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్యం వల్ల ఈ సైనోబియల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే కీళ్ల మధ్య ఉన్న ఈ సైనోబియల్ ఫ్లూయిడ్ తగ్గుతుందో కీళ్ళు ఒకదానికొకటి రాసుకుని తీవ్ర ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారికోసం కొన్ని రకాల సప్లిమెంట్లను వైద్యులు సూచిస్తారు. వాటిని వాడితే ఉత్తమం.

వృద్ధాప్యం కారణంగా వచ్చే ఆర్థరైటిస్‌ను అడ్డుకోవడం కష్టమే, కానీ వయసులో ఉన్నప్పుడే కీళ్ల నొప్పులు బారిన పడకుండా ఉండాలంటే బరువును తగ్గించుకోవాలి. పోషకాహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఈ మూడు మిమ్మల్ని త్వరగా ఆర్థరైటిస్ బారిన పడకుండా అడ్డుకుంటుంది.