Peaceful Destinations | అంతర్జాలం లేని స్వేచ్ఛా ప్రపంచంలో విహరించండి, ఇవిగో అద్భుతమైన ప్రదేశాలు!
Peaceful Destinations in India: ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు లేని పచ్చని ప్రపంచానికి వెళ్లండి, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపండి. భారతదేశంలోనే అలాంటి కొన్ని ప్రదేశాలు ఇక్కడ తెలుసుకోండి.
ఈ డిజిటల్ ప్రపంచంలో మనం చాలా పనులను చకచకా చేసేసుకుంటున్నాం. ఇంటర్నెట్ సౌకర్యం మన జీవితాలను సులభతరం చేసింది. జేబులో కరెన్సీ నోట్లు పెట్టుకోకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఏమైనా కొనుగోలు చేయవచ్చు. కొత్తవారితో పరిచయం పెంచుకోవచ్చు, మనకు సుదూరంగా ఉన్న మన ప్రియమైన వారితో వీడియో కాల్‌లు చేసి సంభాషించవచ్చు. అంతేనా సోషల్ మీడియాలో, ఓటీటీలో స్క్రోల్ చేయడానికి అంతులేని కంటెంట్ ను ఆస్వాదించవచ్చు. ఇంటర్నెట్ ఉంటే ఎంత అద్భుతమో కదా?
ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం. ఒక్కసారి ఇంటర్నెట్ లేని ప్రపంచం ఊహించుకోండి. ఆందోళనకరమైన వార్తలు, డిబేట్లు ఉండవు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సోషల్ మీడియా ట్రోలింగ్ ఉండదు, కలచివేసే దృశ్యాలు ఉండవు, భావోద్వేగాలను రెచ్చగొట్టే భావజాలానికి దూరం అవుతాం. పచ్చని ప్రకృతికి దగ్గరవుతాం, ప్రశాంతమైన మరో ప్రపంచంలో ఊపిరి పీలుస్తాం.
Peaceful Destinations in India
మీరూ కొంతకాలం ఈ అంతర్జాలం నుంచి అదృశ్యమై, అందమైన ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా విహరించాలనుకుంటే ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాలను తెలియజేస్తున్నాం. ఇక్కడ మాయమై, అక్కడ తేలండి.
అగుంబే, కర్ణాటక
అగుంబే అనే ప్రాంతం దక్షిణ భారత చిరపుంజిగా ప్రసిద్ధి చెందింది, ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఒక అందమైన గ్రామం. అనేక జలపాతాలు, చిరుజల్లుల చిలకరింపులు, మనోహరమైన దృశ్యాలతో కూడిన ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
అండమాన్, నికోబార్ దీవులు
అండమాన్, నికోబార్ దీవులలో ఎక్కడో కొన్ని ప్రదేశాలలో మినహా, ఎక్కడా సరైన ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో లేవు. కాబట్టి ఫోన్ పక్కనపెట్టి లోతైన మహాసముద్రాలు, ఎగిసే నీలిరంగు అలల ఒంపుసొంపులు, ఆశ్చర్యపరిచే సూర్యాస్తమయాలు, వెచ్చని ఇసుక తిన్నెరలు ఇలా ఎన్నో అనుభూతి చెందవచ్చు. నిశ్శబ్ద సాగరతీరం వెంబడి మీరు ఒంటరిగా లేదా మీ ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడపవచ్చు.
స్వర్గరోహిణి, ఉత్తరాఖండ్
పేరులోనే స్వర్గం ఉంది, ఇక్కడి వెళ్తే నిజంగా స్వర్గంలో విహరిస్తున్నట్లే ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని ఇదొక సుందరమైన ప్రదేశం. ఇది ద్రౌపది, పాండవులు నడిచిన మార్గం అని నమ్ముతారు, ఈ ప్రదేశం స్వర్గానికి ట్రెక్ అని ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సందర్శించడానికి అనువైన సమయం మార్చి నుండి డిసెంబర్ మధ్య ఉంటుంది.
ఉత్తరాఖండ్‌లోనే ‘ఫ్లవర్ వ్యాలీ’ అనే మరో ప్రదేశం కూడా ఉంది. కనుచూపు మేరలో ఎటు చూసిన అందమైన పూల వనాలతో అద్భుత లోకంలా కనిపిస్తుంది.
ఐస్ కింగ్‌డమ్, జన్స్కార్, లద్దాఖ్
తెల్లటి, చల్లటి మంచు ఎడారిలో మధురానుభూతులు పొందాలంటే లద్దాఖ్ లోని ఐస్ కింగ్‌డమ్‌కు వెళ్లిపోండి. ఇక్కడ సెల్ ఫోన్ కవరేజీ లేదు, అయినప్పటికీ ఈ ఐస్ కింగ్‌డమ్‌కు మీరే రాజు, మీరే మంత్రి.. మీ ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేయవచ్చు.
నాథంగ్ వ్యాలీ, సిక్కిం
నాథంగ్ లోయ మరొక భూలోక స్వర్గం. సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ఎంతో అద్భుతం. ఈ ప్రదేశం జనవరి నుండి ఏప్రిల్ వరకు నాలుగు నెలల పాటు మంచుతో కప్పి ఉంటుంది.
సంబంధిత కథనం