Kerala beaches | అద్భుతమైన బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్-best beaches to visit in kerala state ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kerala Beaches | అద్భుతమైన బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్

Kerala beaches | అద్భుతమైన బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్

Praveen Kumar Lenkala HT Telugu
Feb 25, 2022 01:23 PM IST

బీచ్‌ చూడాలని ఎవరికి ఉండదు. కేరళలో అద్భుతమైన బీచ్‌లు చాలా ఉన్నాయి. సముద్ర తీరప్రాంతం వెంట ఉండే కేరళలో అనేక బీచ్‌లు ఉన్నాయి. వర్కల, కోవలం, చేరై, క్రిహున్నా, పూవర్ తదితర అనేక బీచ్‌లు ఇక్కడ పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి.

కోవలం బీచ్
కోవలం బీచ్

కేరళలో బీచ్‌లకు కొదవే లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి చేరుకోవడం కూడా సులువే. బీచ్‌లు అమితంగా ఇష్టపడేవారికి కోవలం, వర్కలా తదితర బీచ్‌లు తప్పనిసరిగా చూసి తీరాల్సినవి. 

కోవలం బీచ్: 

తిరువనంతపురం నుంచి 16 కి.మీ. దూరంలో ఉన్న కోవలం బీచ్ దేశవిదేశాల్లో ప్రసిద్ధి చెందింది. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్, త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఇక్కడికి సమీపంలోని ప్రధాన రవాణా కేంద్రాలు. కోవలం బీచ్ శతాబ్దకాలంగా విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మూన్ షేప్‌లో ఉండే మూడు బీచ్‌లు పక్కపక్కనే ఉండడం కోవలం ప్రత్యేకత. ఇక్కడి రాతి గుట్ట వద్ద విదేశీ పర్యాటకులు సన్ బాతింగ్‌లో సేద దీరుతారు. క్రూసింగ్, సన్ బాతింగ్, హెర్బల్ బాడీ టోనింగ్, మసాజ్ వంటివెన్నో ఇక్కడ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పర్యాటకులతో కోవలం బీచ్ సందడిగా ఉంటుంది.

కోవలం బీచ్‌లోనే తక్కువ ధరకు కాటేజీలు లభిస్తాయి. విభిన్న ధరల రేంజ్‌లో రూములు, రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయి. బీచ్‌తో పాటు తిరువనంతపురం నగరంలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. పద్మనాభ స్వామి దేవాలయం, నేపియర్ మ్యూజియం వంటివి చూడొచ్చు.

వర్కలా బీచ్:

తిరువనంతపురం నుంచి ఉత్తర దిశలో 51 కి.మీ. దూరంలో వర్కలా బీచ్ ఉంటుంది. ఈ అద్భుతమైన బీచ్ సమీపంలోనే 2 వేల ఏళ్ల నాటి విష్ణు దేవాలయం, కొద్ది దూరంలో ఉండే శివగిరి మఠం సందర్శనీయ స్థలాలు. ఔషధ లక్షణాలు కలిగి ఉన్న వర్కల బీచ్‌లో స్నానం చేయడం వల్ల మలినాలు తొలగిపోతాయని  స్థానికంగా విశ్వసిస్తారు. పాపాలు తొలగిపోతాయన్న విశ్వాసంతో దీనిని పాపనాశం బీచ్‌గా కూడా పిలుస్తారు. ఇక్కడి ఆయుర్వేదిక్ మసాజ్ కేంద్రాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. త్రివేండ్రం ఎయిర్ పోర్టు నుంచి 57 కి.మీ. దూరంలో ఉన్న ఈ బీచ్‌కు స్థానిక రవాణా సాధనాల ద్వారా చేరుకోవచ్చు.

ఇవి కాకుండా అలెప్పిలోని అలప్పురా బీచ్, మరారి బీచ్, తలస్సెరి సమీపంలోని ముజప్పిలంగద్ బీచ్, బెకాల్ బీచ్, కొచ్చిలోని చేరై బీచ్, కోజికోడ్‌లోని కప్పడ్ బీచ్, బేపోర్ బీచ్ పర్యాటకులను విశేషంగా అలరిస్తున్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్