మంచుకురిసే దారుల్లో విహారం.. ఇండియాలో హిమపాతం ఆస్వాదించాలంటే ఈ ప్రదేశాలు ఉత్తమం-places to visit during winters to witness snowfall ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Places To Visit During Winters To Witness Snowfall

మంచుకురిసే దారుల్లో విహారం.. ఇండియాలో హిమపాతం ఆస్వాదించాలంటే ఈ ప్రదేశాలు ఉత్తమం

Manda Vikas HT Telugu
Dec 28, 2021 06:04 PM IST

శీతాకాలంలోమనభారతదేశంలోమంచుదుప్పటికప్పుకున్నఎన్నోప్రదేశాలుమిమ్మల్నిఆనందపరవశంలోముంచేయడానికిసిద్ధంగాఉన్నాయి.మంచులోఆడటం,స్నోమెన్‌లనురూపొందించడం,స్నోబాల్స్‌నుతయారుచేసివాటినిఒకరిపైఒకరువిసురుకోవడంచాలాసరదాగాఉంటుంది

ఇండియాలో హిమపాతం (Snowfall) చూడదగ్గ ప్రదేశాలు
ఇండియాలో హిమపాతం (Snowfall) చూడదగ్గ ప్రదేశాలు (Stockphoto)

శీతాకాలం నిజంగా మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక వరం.  మన కళ్ల ముందుకు ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది, ఎన్నో వెచ్చని అనుభూతులను శీతాకాలం మోసుకొస్తుంది. అయితే ఆ అందాలు, అనుభూతులను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలన్నా, ఈ సీజన్‌లో నిజమైన వేడుకలను చేసుకోవాలన్నా ఏదైనా మంచుకురిసే ప్రదేశానికి తప్పకుండా వెళ్లాలి. 

మల్లెల వానలా ప్రకృతి కురిపించే హిమపాతం, నేలపై కర్పూరం పరిచినట్లుగా ఎక్కడిక్కడ మీకు స్వాగతం పలికే మంచుతివాచీలు మిమ్మల్ని మరో మాయలోకంలో విహరింపజేస్తాయి. 

శీతాకాలంలో మన భారతదేశంలో మంచుదుప్పటి కప్పుకున్న ఎన్నో ప్రదేశాలు మిమ్మల్ని ఆనంద పరవశంలో ముంచేయడానికి సిద్ధంగా ఉన్నాయి.  మంచులో ఆడటం, స్నోమెన్‌లను రూపొందించడం,  స్నో బాల్స్‌ను తయారుచేసి వాటిని ఒకరిపై ఒకరు విసురుకోవడం చాలా సరదాగా ఉంటుంది.  అందుకు సమయం కూడా ఇప్పుడే. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉండే ఈ సీజన్ ఇప్పుడు మిస్ అయితే మళ్లీ సంవత్సరానికి గానీ రాదు. కాబట్టి మీ బ్యాగ్‌లను ప్యాక్ చేసి, వెంటనే ఈ ప్రదేశాలకు వెళ్లి చల్లబడండి. 

మనదేశంలో మంచు ప్రదేశాలు

మనాలి:

భారతదేశంలో హిమపాతం చూడాలనుకుంటే చెప్పుకునే అతి గొప్ప పర్యాటక ప్రాంతాలలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి  అన్నింటికంటే ముందుంటుంది. నవంబర్ ప్రారంభంలోనే మనాలిలో మంచు కురుస్తుందని అంచనా. 

పర్యాటకులు ఓల్డ్ మనాలిలో ఏదో ఒక హోటల్ లేదా హోమ్‌స్టేని బుక్ చేసుకుంటే, ఉదయాన్నే లేచి కిటికీ వద్ద, బాల్కనీలో కూర్చొని మంచుదుప్పటి కప్పుకున్న హిమాలయాలను చూస్తూ, చల్లని పిల్లగాలులు తాగుతుండగా వేడివేడి కాఫీ ఆస్వాదిస్తే అంతకంటే మరొక స్వర్గం మరొకటి ఉండదనిపిస్తుంది. అడ్వెంచర్స్ ఇష్టపడేవారి కోసం ఇక్కడికి దగ్గర్లోనే సోలాంగ్ వ్యాలీ ఉంది ఇక్కడ స్కీయింగ్ తదితర సాహసకృత్యాలు చేయవచ్చు. 

ముస్సోరి: 

ఉత్తరాఖండ్‌లో హిమపాతాన్ని చూడటానికి మరొక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ముస్సోరి. డిసెంబర్ మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ఇక్కడ మంచి హిమపాతం కురుస్తుంది. మంచు కురుస్తున్నప్పుడు మాల్ రోడ్‌లో షికారు చేస్తే లభించే అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇదే కాకుండా ముస్సోరీలో అనేక పర్యాటక ఆకర్షణలు శీతాకాలంలో ప్రజల కోసం వేచి ఉంటాయి.

సిమ్లా: 

శీతాకాలపు విహారాల కోసం ప్రజలు ఎక్కువగా ఇష్టమైన ప్రదేశం సిమ్లా. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో సిమ్లా నగరం పూర్తిగా పర్యాటకులతో నిండిపోయి ఉంటుంది. సిమ్లాలో హిమపాతాన్ని ఆస్వాదించాలనుకుంటే చాలా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి. సిమ్లాలోని పర్యాటక ఆకర్షణలు మిమ్మల్ని ఏమాత్రం నిరాశపరచవు. శీతాకాలంలో ఈ ప్రదేశంలో కొన్నిరోజులు గడపితే అది మీకు మరచిపోలేని అనుభూతులను అందిస్తుంది. 

గుల్‌మార్గ్: 

జమ్మూకాశ్మీర్‌లోని పీర్ పంజల్‌ శ్రేణుల మధ్య నెలకొని ఉన్న గుల్‌మార్గ్‌ పట్టణం శీతాకాలంలో అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్‌లో ఇక్కడి ఉష్ణోగ్రతలు  -8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. అంతేకాకుండా భారతదేశంలో అత్యంత ఎత్తైన , పొడవైన కేబుల్ కార్ ప్రాజెక్ట్ ఇక్కడే ఉంది. స్నోబోర్డ్, స్కీయింగ్‌ తదితర వింటర్ క్రీడలు, ఉత్సవాలలో పాల్గొనవచ్చు.

లేహ్-లద్దాఖ్: 

సాహసోపేతమైన బైక్ రైడ్స్, లాంగ్ డ్రైవ్స్ లను ఇష్టపడే వారికి లేహ్-లద్దాఖ్ ప్రాంతంలో పర్యటించడం చిరకాల స్వప్వమనే చెప్పాలి. శీతల మంచు ఎడారిలో, ఎత్తైన కొండలలో మెలితిరుగుతూ ఉండే దార్లలో రైడింగ్ అనుభూతి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.  ఎప్పుడైనా సాహసోపేతమైన బైక్ రైడ్‌కి వెళ్లాలనుకుంటే అందులో లేహ్-లద్దాఖ్ అత్యుత్తమ ఎంపిక.  లేహ్ చల్లని, శుష్క ఎడారి ప్రకృతి ప్రదేశం.  భారతదేశంలో ఎక్కువ మొత్తంలో హిమపాతాన్ని ఆస్వాదించాలనుకునే వారికి లేహ్ లోని నుబ్రా వ్యాలీ,  పాంగ్యాంగ్ సరస్సు సహా ఎన్నో ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. 

తవాంగ్: 

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గల తవాంగ్ పట్టణం, ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ ఆరామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 

చలికాలంలో నిండుగా మంచుతో కప్పి ఉండే ఇక్కడి ప్రకృతి సౌందర్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తవాంగ్‌లో హిమపాతం సాధారణంగా నవంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది, ఉష్ణోగ్రతలు జీరో కంటే తక్కువ స్థాయిలో నమోదవుతాయి. 

తవాంగ్‌లోని ఆహ్లాదకరమైన నురానాంగ్ జలపాతం, సెలా పాస్, మాధురి సరస్సులు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. 

ఇవే కాకుండా, కొద్దిగా ఏకాంతంగా గడపాలనుకునే వారి కోసం వీటి చుట్టుపక్కల కూడా అనేక మంచుకురిసే ప్రదేశాలు ఉన్నాయి. 

కాబట్టి మీరు మీ శీతాకాలాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు, ఎలాంటి అడ్వెంచర్స్ కోరుకుంటున్నారో? ఒక జాబితా సిద్ధం చేసుకొని అందుకు తగినట్లుగా మీ టూర్ ప్లాన్ చేసుకోండి. వెచ్చని దుస్తులు, మెడిసిన్ సహా అవసరమయ్యే ఇతర సామాగ్రితో పాటు తగినంత క్యాష్ మీ వెంట ఉంచుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం