Diabetes- Breakfast । మధుమేహం ఉన్నవారు ఉదయం ఇలాంటి అల్పాహారం చేయాలి!
Diabetes-Friendly Breakfast Ideas: మధుమేహం ఉన్నవారికి ఉదయం వేళ ఎలాంటి అల్పాహారాలు సరైనవో ఇక్కడ తెలుసుకోండి.
Diabetes-Friendly Breakfast Ideas: మధుమేహం అనేది జీవక్రియను ప్రభావితం చేసే సమస్య అనేది మనందరికీ తెలుసు. ప్రత్యేకమైన భోజన ప్రణాళిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడగలదు. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో చురుకుగా ఉండటానికి, ఆరోగ్యంగా తినడానికి సరిగ్గా సమయం కూడా ఉండటం లేదు. డయాబెటిస్ నిర్వహణలో అల్పాహారం కీలక పాత్ర పోషిస్తుంది, ఇది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తారు. మధుమేహులు తీసుకునే అల్పాహారం సరైనది కాకుంటే, అదనపు చక్కెర రక్తప్రవాహంలో చేరి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే అల్పాహారం చక్కెర స్థాయిలను పెంచేలా ఉండకూడదు. సరైన అల్పాహారం తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండటమే కాకుండా, ఇది మీ మానసిక స్థితిని కూడా మెరుగ్గా ఉంచుతుంది.
హెచ్‌టి డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అవంతి దేశ్‌పాండే మధుమేహం ఉన్నవారికి ఉదయం వేళ ఎలాంటి అల్పాహారాలు సరైనవో వివరించారు, అవి ఇక్కడ తెలుసుకుందాం.
పనీర్ పరాటా, దాల్ అట్టు లేదా గుడ్లు
పోహా లేదా ఉప్మా వంటి కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్ అల్పాహారంతో రోజుని ప్రారంభించండి. పప్పుతో చేసి అట్లు, ఉడికించిన గుడ్లు, సాంబార్, చట్నీతో ఇడ్లీ, పనీర్, మెంతి, శనగపిండితో చేసిన పరాటాలు మంచి ఎంపిక. మధుమేహం నిర్వహణ కోసం ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి.
ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను ఎలా నివారిస్తుంది?
ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం కండరాల నిర్మాణానికి సరైనది. ఇది ఆకలి కోరికలను నివారించటంతో పాటు చక్కెరను నియంత్రణలో ఉంచడం వంటి అదనపు ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది.
ఫైబర్ చేర్చండి
అల్పాహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉంటాయి. మీకు మధుమేహం ఉన్నప్పుడు ప్రోటీన్-రిచ్ అల్పాహారంతో ఒక పండును తినడం ఉత్తమం. దోసకాయ సెలెరీ జ్యూస్, టొమాటో, పుదీనా రసం లేదా పాలకూరతో నారింజ క్యారెట్ వంటి మిక్స్డ్ ఫ్రూట్ వెజిటబుల్ జ్యూస్‌ని ఎక్కువగా తీసుకోవడం ఈ వేసవిలో మంచి అల్పాహారంగా ఉంటుంది. పండ్లు, కూరగాయల రసాలను వడకట్టవద్దు, లేదంటే పీచు బయటకు వెళ్లిపోతుంది.
మంచి కొవ్వు పదార్ధాలను చేర్చండి
మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీ అల్పాహారంలో మంచి కొవ్వులు ఉండేలా చూసుకోండి. మంచి కొవ్వులు అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు. బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, పుచ్చకాయ గింజలు, సబ్జా గింజలు మొదలైనవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లకు గొప్ప వనరులు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
పుష్కలంగా నీరు, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. అల్పాహారంతో పాటు బ్లాక్ లేదా పింక్ ఉప్పుతో ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోవచ్చు.
సంబంధిత కథనం