Chettinad potato Fry: చెట్టినాడు స్టైల్‌లో బంగాళదుంప వేపుడు ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
Chettinad potato Fry: పిల్లలకు బంగాళదుంపలతో చేసే వంటలు నచ్చుతాయి. ముఖ్యంగా బంగాళదుంప వేపుడు అంటే ఇష్టపడతారు. ఈసారి కొత్తగా చెట్టినాడ్ స్టైల్ లో బంగాళదుంప ఫ్రై చేసి పెట్టండి.
Chettinad potato Fry: బంగాళదుంపలతో చేసే వంటకాలకు పిల్లలే అధికంగా అభిమానులుగా ఉంటారు. ఎప్పుడూ ఒకేలాగా వేపుడు, కూర వండితే ఎలా? ఓసారి చెట్టినాడ్ స్టైల్లో బంగాళదుంప ఫ్రై చేసి పెట్టండి. మీ పిల్లలకి ఇది కచ్చితంగా నచ్చుతుంది. దీని చేయడం కూడా చాలా సులువు. సాంబారు లేదా పప్పు వండుకున్నప్పుడు దానికి సైడ్ డిష్ గా ఈ బంగాళదుంప ఫ్రై అదిరిపోతుంది. మేమిక్కడ చెట్టినాడ్ స్టైల్ లో బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చెప్పాము. ఇలా ఫాలో అయితే మీకు టేస్టీ రెసిపీ సిద్ధమైపోతుంది.
చెట్టినాడ్ స్టైల్ బంగాళదుంప ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - 4
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
కరివేపాకు - గుప్పెడు
నూనె - నాలుగు స్పూన్లు
కారం - ఒక స్పూను
సోంపు పొడి - రెండు స్పూన్లు
పసుపు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
చెట్టినాడు స్టైల్ బంగాళదుంప ఫ్రై రెసిపీ
1. ఒక గిన్నెలో బంగాళదుంపలను వేసి ఉప్పు, నీళ్లు వేసి ఉడకబెట్టాలి. అవి ఉడికాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. మరీ మెత్తగా ఉడకబెట్టకూడదు. ఫ్రై చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంది. ముక్కల ముక్కలుగా రావాలంటే 80% బంగాళదుంపలను ఉడకబెట్టి వదిలేయాలి.
3. ఇప్పుడు బంగాళదుంపలను ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో వేయాలి.
4. ఆ గిన్నెలోనే కారం, పసుపు, సోంపు గింజల పొడి, ఉప్పు వేసి ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. ఆ నూనెలో వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేయించాలి.
8. అలాగే గుప్పెడు కరివేపాకులను వేసి వేయించాలి.
9. ఆ తర్వాత ఉల్లిపాయలను నిలువుగా తరిగి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
10. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలను వేసి చిన్న మంట మీద వేయించాలి.
11. మంట పెద్దగా పెడితే అవి మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్న మంట మీద వీటిని పది నిమిషాలు పాటు వేయించుకోవాలి.
12. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. అవి రంగు మారేవరకు వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
13. వీటిని సాంబారు లేదా పప్పుతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
14. పిల్లలు కచ్చితంగా ఈ బంగాళదుంప వేపుడును ఇష్టంగా తింటారు.
ఈ వేపుడు తినడం వల్ల కార్బోహైడ్రేట్లు ప్రోటీన్, సంతృప్త కొవ్వులు, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, విటమిన్ ఏ వంటివి శరీరానికి అందుతాయి. వీటిని బాగా ఉడికించాం కాబట్టి వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తగ్గుతుంది. అప్పుడప్పుడు డయాబెటిస్ పేషెంట్లు కొంచెంగా తినవచ్చు. బంగాళాదుంపలను ఉడికించి వండితేనే ఆరోగ్యం. ఉడికించకుండా ఉంటే అందులో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి.
టాపిక్