Raw Garlic: రోజుకు ఒక్క పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే ఈ అద్భుత మార్పులు మీలో కనిపించడం ఖాయం-if you eat one clove of raw garlic a day you will surely see these amazing changes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Raw Garlic: రోజుకు ఒక్క పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే ఈ అద్భుత మార్పులు మీలో కనిపించడం ఖాయం

Raw Garlic: రోజుకు ఒక్క పచ్చి వెల్లుల్లి రెబ్బ తింటే ఈ అద్భుత మార్పులు మీలో కనిపించడం ఖాయం

Haritha Chappa HT Telugu
Jun 06, 2024 09:00 AM IST

Raw Garlic: ప్రతి ఇంట్లోని వెల్లుల్లిపాయలు ఉండడం సహజం. ఇది ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. రోజుకు ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

వెల్లుల్లి ఉపయోగాలు
వెల్లుల్లి ఉపయోగాలు (Pixabay)

Raw Garlic: వంటల్లో వెల్లుల్లి వేసే వారి సంఖ్య ఎక్కువే. అల్లం వెల్లుల్లి పేస్టును వాడేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రతిరోజూ ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు ఒక్క రెబ్బను తిని చూడండి. నెల రోజుల్లో మీలో ఎన్నో మంచి మార్పులు కనిపిస్తాయి. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పచ్చి వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ b6, సెలీనియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. వెల్లుల్లి రెబ్బను ప్రతిరోజు తీసుకోవడం వల్ల జలుబు బారిన పడడం తగ్గుతుంది. ఒక అధ్యయనంలో ప్రతిరోజూ వెల్లుల్లి తినేవారు అతి తక్కువగా ఔషధాలు తీసుకుంటున్నట్టు తేలింది. వారికి 63% వరకు జలుబు, ఫ్లూ వంటి రోగాలు వచ్చే ఛాన్స్ తగ్గినట్టు గుర్తించారు.

అధికరక్తపోటు ఉంటే...

మనదేశంలో ఎంతోమంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాంటి వారికి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది. రోజుకు ఒక వెల్లుల్లి రెబ్బను తింటే చాలు... రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీన్ని పచ్చిగా తిన్నప్పుడు రక్తనాళాలలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు రాకుండా ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు బారిన పడకుండా ఉంటారు.

పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను ఇది తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన HDLను పెంచుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం ప్రతిరోజూ వెల్లుల్లి రెబ్బను తినడం అలవాటు చేసుకోవాలి. ఇది గుండెకు ఎంతో మంచిది. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు రాకుండా ఈ వెల్లుల్లి రెబ్బ అడ్డుకోగలదు.

వెల్లులిలో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఎక్కువ. అలాగే యాంటీ వైరల్ లక్షణాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయి. అంటువ్యాధులను నివారిస్తాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. సాల్మొనెల్లా, ఈ. కోలి వంటి వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయి.

ప్రతిరోజూ వెల్లుల్లి తినడం వల్ల శరీరం డిటాక్సిఫికేషన్ కు గురవుతుంది. సమ్మేళనాలు శరీరం నుండి విషాన్ని, లోహాలను, వ్యర్ధాలను తొలగిస్తాయి. రక్తంలో సీసం స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. తలనొప్పి, అధిక రక్తపోటు వంటి లక్షణాలు రాకుండా ఉంటాయి.

వెల్లుల్లి ఎలా తినాలి?

ప్రతిరోజూ వెల్లుల్లి తినాలనుకునేవారు... దాన్ని మెత్తగా పేస్టులా చేసుకుని ఒకేసారి తినేస్తే మంచిది. ఎందుకంటే దాని రుచి అంతగా బాగోదు. చిన్నగా కొరుక్కుని తింటే అర ముక్క తినేసరికే విరక్తి వస్తుంది. కాబట్టి మెత్తగా పేస్టులా చేసుకుని వెంటనే మింగేస్తే సులువుగా తినేయగలరు. లేదా అన్నంలో మిక్స్ చేసుకొని తినేసినా మంచిదే.

Whats_app_banner