Chanakya Niti | జీవితంలో ఈ నాలుగు విషయాలను రహస్యంగా ఉంచాలి!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఏ వ్యక్తి అయినా తన జీవితానికి సంబంధించి నాలుగు విషయాలను రహస్యంగా ఉంచాలని చెప్పారు. ఆ నాలుగు కీలక రహస్యాలు ఏమిటి? ఇక్కడ తెలుసుకోండి.
Chanakya Niti: భారతీయ తత్వవేత్త ఆచార్య చాణక్యడు తన విలువైన ఆలోచనలను భావితరాలకు అందించారు. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో అనుసరించాల్సిన నీతిని తన నీతిశాస్త్రంలో సవివరంగా పొందుపరిచారు, ఇదే చాణక్య నీతిగా నేటికి ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలపై, అన్ని కోణాలలో వివరణ ఉంది. మెరుగైన జీవితం కోసం ఈ విధానాలు నేటికీ ఆచరించదగినవి. చాణక్యుడి నీతిని పాటించడం వల్ల ఆ వ్యక్తుల జీవితం మెరుగుపడుతుంది. సంబంధాలు బాగుంటాయి, సమాజంలో గౌరవం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ప్రతి దశలో విజయాన్ని అందుకుంటాడు.
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఏ వ్యక్తి అయినా తన జీవితానికి సంబంధించి నాలుగు విషయాలను రహస్యంగా ఉంచాలని చెప్పారు. ఈ 4 విషయాలు బహిరంగంగా వెల్లడిస్తే ఆ వ్యక్తి తన గౌరవం కోల్పోవడమే కాకుండా జీవితంలో ప్రతి మలుపులోనూ ఇబ్బంది పడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మరి ఆ నాలుగు కీలక రహస్యాలు ఏమిటి? ఇక్కడ తెలుసుకోండి.
1. దానధర్మాలు
దానధర్మాలు అనేవి నిజాయితీ గల హృదయంతో చేయాలి, దానధర్మాలు చేసి వాటికి ప్రతిఫలం ఎప్పటికీ ఆశించకూడదు. అలాగే తాము చేసిన దానధర్మాల గురించి ఎవరికీ చెప్పుకోకూడదు. దానం చేశామని, ధర్మం చేశామని ఇతరులకు గొప్పగా చెప్పుకోవడం ద్వారా మీ విలువ తగ్గుతుంది కానీ పెరగదని చాణక్యుడు తెలిపారు. చాణక్యుడి ప్రకారం, దాతృత్వం అనేది ఒక గొప్ప కార్యం. అది ఇతరులకు వివరించడం ద్వారా, దాని ప్రభావం తగ్గుతుంది. తత్ఫలితంగా, వారికి ఎలాంటి అదృష్ట ఫలాలు లభించవు. గుప్తదానాలు బహుళ ఫలితాలను ఇస్తుందని చెప్పారు. అంటే మనం దానం చేసేటప్పుడు రహస్యంగా చేయాలి. ఇతరులకు తెలియజేయకూడదు.
2. ఇంటి సమస్యలు
ప్రతీ ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి, అయితే ఈ సమస్యలను గుట్టుగా ఉంచుకోవాలని చాణక్యుడు తెలిపారు. తమ ఇంటి సమస్యలను, కుటుంబ సభ్యుల లోపాలను ఇతరుల వద్ద ఎత్తి చూపకూడదు, కుటుంబానికి కళంకం తెస్తుంది, కాబట్టి ఎల్లప్పుడూ ఇంటి సమస్యలను తమలో తాము పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఏం జరిగిందో ఇతరులకు చెప్పకండి. మీ ఇంటి సమస్యలను ఇతరులకు చెప్పడం ద్వారా వారి మీకు శత్రువులు తయారై, మీ పరువు ప్రతిష్టలను దెబ్బతీయడానికి ఉపయోగించుకోవచ్చు.
3. శారీరక సంబంధాలు
మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని కొనసాగించాలనుకుంటే, మీ శారీరక సంబంధాన్ని ఎప్పుడూ బహిరంగపరచవద్దు. భార్యాభర్తల మధ్య బంధం గురించిన ఏ చర్చ కూడా తృతీయ పక్షం వద్దకు రాకూడదని చాణక్యుడు అన్నారు, లేకుంటే ఆ బంధం విచ్ఛిన్నమై, ఆ వ్యక్తి సమాజంలో చెడు గుర్తింపు పొందుతాడని చాణక్యుడు చెప్పాడు. అందుకే భార్యాభర్తల మధ్య నాలుగు గోడల మధ్య జరిగినవి ఇతరులతో పంచుకోకూడదు. అలాగే మీ శారీరక సంబంధాలు బయటకు చెబితే మీ గౌరవం పోతుందని చెప్పారు.
4. వైద్యం- ఔషధం
చాణక్యుడు ప్రకారం, వ్యక్తులు తమకు తెలిసిన వైద్యం గురించి గానీ, ఔషధాల గురించిన పూర్తి సమాచారాన్ని ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచాలి. ఇవి ఇతరుల అనారోగ్యానికి చికిత్స చేయడానికి సహాయపడుతున్నప్పటికీ, చాలా మంది దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. చెడ్డ అవసరాలకు వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి, వైద్య సమాచారం, ఔషధాల సమాచారం కొద్దిమందికే తెలిసి ఉండాలి. అది తెలిసిన వారు తమ జ్ఞానాన్ని రహస్యంగా ఉంచాలని ఆచార్య చాణక్య పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్