Poha for diabetes: అటుకులు తయారయ్యేది బియ్యం నుంచే.. మరి షుగర్ పేషెంట్లు పోహా తినొచ్చా? ఎలా తింటే షుగర్ పెరగదు?-can diabetic patients eat poha or atukulu know the answer and best ways to eat it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poha For Diabetes: అటుకులు తయారయ్యేది బియ్యం నుంచే.. మరి షుగర్ పేషెంట్లు పోహా తినొచ్చా? ఎలా తింటే షుగర్ పెరగదు?

Poha for diabetes: అటుకులు తయారయ్యేది బియ్యం నుంచే.. మరి షుగర్ పేషెంట్లు పోహా తినొచ్చా? ఎలా తింటే షుగర్ పెరగదు?

Koutik Pranaya Sree HT Telugu
Sep 13, 2024 12:30 PM IST

Poha for diabetes: డయాబెటిస్ పేషెంట్లు పోహా తినొచ్చా లేదా అనే సందేహం ఉందా? అయితే పోహా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంతో, దాన్ని ఆహారంలో ఎలా చేర్చుకుంటే షుగర్ అదుపులో ఉంటుందో వివరంగా తెల్సుకోండి.

డయాబెటిస్ ఉన్నవాళ్లు పోహా తినవచ్చా?
డయాబెటిస్ ఉన్నవాళ్లు పోహా తినవచ్చా? (freepik)

డయాబెటిస్ ఉన్నవాళ్లు తెల్లన్నం తినటం ఆరోగ్యంకరం కాదు. అది రక్తంలో చక్కెర స్థాయుల్ని అమాంతం పెంచేస్తుంది. పోహాను అదే బియ్యం నుంచి తయారు చేస్తారు. మరి బియ్యం నుంచే తయారు చేసిన పోహా తింటే మంచిదేనా అనే సందేహం ఉంటుంది. దీనికి వివరంగా సమాధానం తెల్సుకోండి.

మధుమేహం ఉంటే పోహా తినవచ్చా?

తెల్లటి బియ్యంతో పోలిస్తే పోహా చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం. దీంట్లో పోషకాలు ఎక్కువే. ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. కేలరీలు, కొలెస్ట్రాల్, కొవ్వు తక్కువ. ఈ లక్షణాల వల్ల వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరిగిపోవు. బియ్యాన్ని పారాబాయిల్ చేసి, రోల్ చేసి, ఆరబెడితే అటుకులు తయారవుతాయి. దీనికన్నా ఎక్కువ ప్రాసెసింగ్ బియ్యం తయారీలో జరుగుతుంది. కాబట్టి పోహాలో పోషకాలు తెలుపు అన్నం కన్నా ఎక్కువుంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు పోహా నిశ్చింతగా తీసుకోవచ్చు. 

పోహా ఎలా తినాలి?

పోహా తాలింపు చేసుకుని తినేటప్పుడు దాంట్లో ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. పోహాలో శనగలు, పల్లీలు, టోఫు లాంటి ప్రొటీన్ ఉన్న పదార్థాలు వాడాలి. బటానీ, క్యారట్, పాలకూర, టమాటా, క్యాప్సికం లాంటివి ఎక్కువగా వేసుకుని పోహా చేసుకోవాలి. తక్కువ నూనె వాడి పోహాతో వంటకాలు చేయాలి. వీటన్నింటి వల్ల చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి.

పోహా గ్లైసెమిక్ ఇండెక్స్:

షుగర్ ఉన్నవాళ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల్ని తినాలి. పోహా గ్లైసెమిక్ ఇండెక్స్ మధ్యస్థంగా ఉంటుంది. అన్నంతో పోలిస్తే ఇది తక్కువే. అలాగే దీనికోసం పోహా తయారీకి బియ్యం, తయారు చేసిన విధానం బట్టి దీనిలో మార్పు రావచ్చు. 

వైట్ పోహా గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) బ్రౌన్ రైస్ పోహా, రెడ్ రైస్ పోహా, మిక్స్డ్ గ్రెయిన్ పోహాతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. వైట్ పోహా జీఐ 65 నుంచి 75 మధ్య ఉంటుంది. బ్రౌన్ రైస్‌తో చేసిన పోహా జీఐ 50 నుంచి 65 మధ్యలో, రెడ్ రైస్ పోహా జీఐ 50 నుంచి 65 మధ్యలో, మిక్స్డ్ గ్రెయిన్ పోహా జీఐ 45 నుంచి 60 మధ్యలో ఉంటుంది. చివరి తరహా పోహా వాడటం మరింత మంచిది. మిక్స్డ్ గ్రెయిన్ పోహాను క్వినోవా, చిరుధాన్యాలు, తృణధాన్యాలు కలిపి తయారు చేస్తారు. కాబట్టి ఇది మరింత ఆరోగ్యకరం. 

ఎన్ని రకాలుగా వండుకోవచ్చు?

పోహాను ఉదయం అల్పాహారంలోకి, లంచ్ లోకి, డిన్నర్ లోకి ఎలాగైనా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది అన్నంతో పోలిస్తే సులభంగా జీర్ణం అవుతుంది కూడా. పోహాను తాలింపు వేసుకునే తినాల్సిన అవసరం లేదు.

  1. కప్పు పోహా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి అందులో కాస్త రవ్వ, పెరుగు, నీళ్లు, పచ్చిమిర్చి ముక్కలు కలిపి ముద్దలా చేసి దోక్లా చేసుకుని తినొచ్చు. 
  2. పోహాతో దోసె వేసుకోవచ్చు.
  3. సాయంత్రం పూట స్నాక్ లాగా తినాలనకుంటే పాలు లేదా పెరుగులో వేసుకుని నేరుగా తినేయొచ్చు. 
  4. ప్రొటీన్ కోసం ఉడికించిన గుడ్లతో పోహాను తీసుకోవచ్చు. 

 

 

 

Whats_app_banner