Green Poha: పోహా తినడం బోర్ కొడితే, ఇలా గ్రీన్ పోహా చేయండి.. రుచి నచ్చేస్తుంది-how to make green poha for breakfast poha in different taste ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Poha: పోహా తినడం బోర్ కొడితే, ఇలా గ్రీన్ పోహా చేయండి.. రుచి నచ్చేస్తుంది

Green Poha: పోహా తినడం బోర్ కొడితే, ఇలా గ్రీన్ పోహా చేయండి.. రుచి నచ్చేస్తుంది

Koutik Pranaya Sree HT Telugu
Aug 31, 2024 06:30 AM IST

Green Poha: ఊరికే ఒకేరకం పోహా తినడమంటే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి చిన్న మార్పు చేసి చూడండి. గ్రీన్ చట్నీ తయారు చేసుకుని దాంతో పోహా చేసేయండి. ఈ గ్రీన్ పోహా తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేయండి.

గ్రీన్ పోహా రెసిపీ
గ్రీన్ పోహా రెసిపీ

పోహా అంటే టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంపలు వేసే ఎక్కువగా చేసుకుంటాం. కానీ ఒకసారి ఈ గ్రీన్ పోహా చేసి చూడండి. రుచిలో చాలా కొత్తగా అనిపిస్తుంది. కొత్త రకం పోహా ప్రయత్నించాలనుకుంటే ఒకసారి చేసి చూడండి. రెండు నిమిషాలు కేటాయించి సింపుల్ మసాలా ఒకటి మిక్సీ పట్టేసుకుంటే వెంటనే పోహా రెడీ అయిపోతుంది. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.

గ్రీన్ పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు:

కప్పున్నర మందం అటుకులు

సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు

సగం టీస్పూన్ ఆవాలు

సగం టీస్పూన్ జీలకర్ర

1 కరివేపాకు రెమ్మ

రెండు చెంచాల పల్లీలు

తగినంత ఉప్పు

సగం చెంచా పంచదార

పావు చెంచా పసుపు

2 చెంచాల నూనె

1 చెంచా నిమ్మరసం

మసాలా కోసం:

సగం కప్పు కొత్తిమీర తరుగు

పావు కప్పు పుదీనా ఆకులు

ఇంచు అల్లం ముక్క

2 వెల్లుల్లి రెబ్బలు

2 పచ్చిమిర్చి

సగం చెంచా నిమ్మరసం

గ్రీన్ పోహా తయారీ విధానం:

1. ముందుగా మిక్సీ జార్‌లో కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నిమ్మరసం, చెంచా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

2. ఇప్పుడు అటుకుల్ని రెండు సార్లు కడుక్కుని జాలీలో వేసుకుని నీళ్లన్నీ వడిచిపోయేలా చూసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి.

3. కడాయిలో రెండు చెంచాల నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడనివ్వాలి. కరివేపాకు కూడా వేసి వేయించాలి.

4. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కాస్త రంగు మారిపోయి మగ్గేదాకా వేగనివ్వాలి.

5. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్ద వేసుకొని కనీసం నాలుగైదు నిమిషాల పాటూ వేయించాలి. కాసేపటికి పచ్చివాసన పోయి మసాలా బాగా వేగిపోతుంది.

6. అందుబాటులో ఉంటే ఈ తాలింపులోనే కొన్ని పచ్చి బటానీ కూడా వేసుకోవచ్చు. లేదంటే అక్కర్లేదు.ఫ్రోజెన్ బటానీ కూడా వాడొచ్చు.

7. ఇప్పుడు నానబెట్టుకున్న పోహా ఈ మసాలాలో వేసుకోవాలి. పసుపు, ఉప్పు, పంచదార కూడా వేసుకుని అన్నా బాగా కలియబెట్టాలి.

8. మూత పెట్టి కనీసం రెండు నిమిషాలైనా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

9. చివరగా నిమ్మరసం చల్లుకోవాలి. ముందుగానే కొన్ని పల్లీల్ని నూనెలో వేయించుకుంటే అవి కూడా ఇప్పుడు కలిపేసుకోవచ్చు. చివరగా కొత్తిమీర చల్లుకుని దింపేసుకుంటే చాలు.