Bread Poha Vada: అటుకులు బ్రెడ్‌తో ఇలా క్రంచీ గారెలు చేసేయండి, కొబ్బరి చట్నీతో అదిరిపోతాయి
Bread Poha Vada: బ్రేక్ ఫాస్ట్ లో గారెలు తింటే ఆ కిక్కే వేరు. వీటిని చేయడానికి టైం పడుతుందని చాలామంది వీటిని బ్రేక్ ఫాస్ట్ లో చేసుకోరు. నిజానికి బ్రెడ్ అటుకులతో అప్పటికప్పుడు గారెలను చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలోనే ఈ గారెలు రెడీ అయిపోతాయి. వీటి రెసిపీ ఎలాగో చూద్దాం.
Bread Poha Vada: గారెలు అనగానే మినప్పప్పు ముందే నానబెట్టుకొని, వాటిని రుబ్బుకొని చేయాలనుకుంటారు. అంత సమయం ఉండక ఎక్కువ మంది గారెలను వాయిదా వేస్తూ ఉంటారు. అల్పాహారంగా గారెలు కొనుక్కొని తినేవారే, కానీ ఇంట్లో చేసుకొని తినేవారి సంఖ్యా తక్కువే. కేవలం బ్రెడ్డు అటుకులతో పావుగంటలో ఈ గారెలను క్రిస్పీగా వండేసుకోవచ్చు. బ్రెడ్డు అటుకులతో గారెల రెసిపీ ఎలాగో చూడండి.
బ్రెడ్ అటుకుల గారెల రెసిపీకి కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు - నాలుగు
అటుకులు - అరకప్పు
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చిమిర్చి - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
కరివేపాకు - గుప్పెడు
నూనె - సరిపడినంత
బ్రెడ్డు అటుకుల గారెల రెసిపీ
1. ఒక గిన్నెలో అటుకులను వేసి రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.
2. తర్వాత నీటిని వంపేసి ఆ గిన్నెలో ఉంచాలి. బ్రెడ్ ముక్కలను ఆ గిన్నెలో వేయాలి.
3. బ్రెడ్డు ముక్కలను, అటుకులను చేతితోనే గట్టిగా మెదుపుకోవాలి.
4. అటుకులు కాస్త నానితే అవి త్వరగా ముద్దవుతాయి. అవసరమైతే నీళ్లు వేసుకోవాలి. అవసరం లేకపోతే అలా చేతితోనే మెదుపుకోవాలి.
5. గారెల పిండికి ఎంత మందంగా అవసరమో, అంత మందంగా కలుపుకోవాలి.
6. ఆ మిశ్రమంలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకుల తరుగు వేసి బాగా కలపాలి.
7. పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి.
9. ఆ మిశ్రమాన్ని గారెల్లా చేత్తోనే ఒత్తుకొని నూనెలో వేయాలి.
10. రెండు వైపులా గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. వాటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి.
11. అంతే గారెలు రెడీ అయినట్టే. దీన్ని టమోటో కెచప్ తో తిన్నా టేస్టీ గానే ఉంటాయి. కొబ్బరి చట్నీతో తింటే ఇంకా బాగుంటాయి. ఛాయిస్ మీదే.
గారెలు చేసుకోవడం కష్టం అనే వారికి పైన చెప్పిన రెసిపీ చాలా సులువు. బ్రెడ్డు, అటుకులతో కేవలం పావుగంటలో గారెల పిండి రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ అటుకులు బ్రెడ్ గారెల రెసిపీని ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.