Sorakaya Garelu: టేస్టీ సొరకాయ గారెలు, ఇలా చేస్తే రుచి అదరహో-sorakaya garelu recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sorakaya Garelu: టేస్టీ సొరకాయ గారెలు, ఇలా చేస్తే రుచి అదరహో

Sorakaya Garelu: టేస్టీ సొరకాయ గారెలు, ఇలా చేస్తే రుచి అదరహో

Haritha Chappa HT Telugu
Jan 07, 2024 06:00 AM IST

Sorakaya Garelu: ప్రతిరోజూ ఇడ్లీ, దోశె తిని బోర్ కొట్టిందా? సొరకాయ గారెలు చేసుకుని చూడండి.

సొరకాయ గారెలు రెసిపీ
సొరకాయ గారెలు రెసిపీ (Teluginti vanta/youtube)

Sorakaya Garelu: వాతావరణం చల్లబడితే వేడివేడిగా బ్రేక్ ఫాస్ట్ తినాలనిపిస్తుందా? ఒకసారి సొరకాయ గారెలు చేసుకుని తిని చూడండి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. వీటిని చేయడం కూడా చాలా సులువు. రుచి కూడా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సొరకాయ గారెలు ఎలా చేయాలో రెసిపీ తెలుసుకుందాం.

సొరకాయ గారెలు రెసిపీకి కావలసిన

సొరకాయ - అర ముక్క

బియ్యప్పిండి - ఒక కప్పు

జీలకర్ర - అర స్పూను

ఉల్లిపాయ - రెండు

శనగపిండి - అరకప్పు

అల్లం తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చిమిరపకాయ - రెండు

సొరకాయ గారెలు రెసిపీ

1. సొరకాయ పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి.

2. ఒక గిన్నెలో బియ్యప్పిండి, సెనగపిండి వేసి బాగా కలపాలి.

3. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.

4. ఆ మిశ్రమంలోనే సొరకాయ తురుమును కూడా వేసి కలుపుకోవాలి.

5. అవసరమైతే కాస్త నీరు వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

6. గారెలు వేయడానికి ఎంత జారుడుగా పిండి కావాలో అంత జారుడుగా ఈ పిండిని కలుపుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. నూనె వేడెక్కాక ఈ సొరకాయ మిశ్రమాన్ని గారెల్లాగా వేసుకోవాలి.

9. రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి.

10. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.

11. పిల్లలు టమాటో కెచప్ తో తినడానికి ఇష్టపడతారు.

12. శనగపిండి లేనివారు కార్న్ ఫ్లోర్ కలుపుకోవచ్చు

సొరకాయ మన ఆరోగ్యానికి మేలు చేసేది. దీనిలో 98% మీరే ఉంటుంది. అలాగే మన శరీరానికి కావాల్సిన ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సొరకాయ తినడం వల్ల మన శరీరంలో చేరిన విషాలను తొలగిస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు సొరకాయని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు సొరకాయను ప్రతిరోజూ తినాలి. లేదా సొరకాయ రసాన్ని తాగాలి. యూరినరీ ఇన్ఫెక్షన్, మూత్ర సంబంధ వ్యాధులు ఉన్నవారికి సొరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. సొరకాయలో విటమిన్ సి, విటమిన్ బి, జింక్, థయామిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. దీనిలో కొవ్వు ఉండదు. కాబట్టి సొరకాయతో ఎన్ని రకాల ఆహార పదార్థాలు చేసుకున్నా శరీరంలో కొవ్వు చేరదు. బరువు తగ్గాలనుకునేవారు సొరకాయను తమ మెనూలో చేర్చుకోవాలి. సొరకాయ జ్యూస్ తాగడం, సొరకాయతో వండిన కూరలు తినడం ద్వారా నెల రోజుల్లోనే బరువును తగ్గించుకోవచ్చు.

Whats_app_banner