Breast Cancer: 2040 నాటికి రొమ్ము క్యాన్సర్ వల్ల ఏటా పదిలక్షల మంది మహిళలు మరణించే అవకాశం-by 2040 ten million women are expected to die annually from breast cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breast Cancer: 2040 నాటికి రొమ్ము క్యాన్సర్ వల్ల ఏటా పదిలక్షల మంది మహిళలు మరణించే అవకాశం

Breast Cancer: 2040 నాటికి రొమ్ము క్యాన్సర్ వల్ల ఏటా పదిలక్షల మంది మహిళలు మరణించే అవకాశం

Haritha Chappa HT Telugu
Apr 17, 2024 08:47 AM IST

Breast cancer: రొమ్ము క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. 2020లో సుమారు 685,000 మంది మహిళలు ఈ వ్యాధితో మరణించారు. వచ్చే పదిహేనేళ్లలో ఈ సంఖ్య భారీగానే పెరిగిపోతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్
బ్రెస్ట్ క్యాన్సర్ (StockPic/HT_PRINT)

రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువమందికి సోకుతున్న అత్యంత సాధారణ కార్సినోజెనిక్ వ్యాధిగా మారింది రొమ్ము క్యాన్సర్. ఈ వ్యాధి 2040 నాటికి ఏటా పది లక్షల మంది ప్రాణాలు తీయడానికి కారణం అవుతుంది. కొత్తగా విడుదలైన లాన్సెట్ కమిషన్ ఈ విషయాన్ని బయటపెట్టింది. 2020 ఏడాది చివరిలో చెప్పిన గణాంకాల ప్రకారం ఐదేళ్లలో సుమారు 7.8 మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్టు గుర్తించారు. అలాగే అదే సంవత్సరం సుమారు 685,000 మంది మహిళలు ఈ వ్యాధితో మరణించారని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా, రొమ్ము క్యాన్సర్ కేసులు 2020 లో 2.3 మిలియన్లు ఉండగా… ఈ సంఖ్య 2040 నాటికి 3 మిలియన్లకు పైగా పెరుగుతాయని కమిషన్ అంచనా వేసింది. 2040 నాటికి ఈ వ్యాధి కారణంగా ఏటా పది లక్షల మరణాలు సంభవిస్తాయని తెలిపింది. ముఖ్యంగా కొన్ని ఆర్ధికంగా వెనుకబడిన దేశాల్లో ఈ క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం అధికంగా ఉన్నట్టు గుర్తించింది.

మన దేశంలో కూడా ఎంతో మంది మహిళలు ఏటా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. భారత్ లో తమిళనాడు, కర్ణాటక, దిల్లీ, తెలంగాణా రాష్ట్రాలో రొమ్ము క్యాన్సర్ కేసులు అధికంగా బయటపడుతున్నాయి. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి చేసిన అధ్యయనంలో బయటపడింది.

పట్టణాల్లో జీవించే మహిళలలో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకోవచ్చు, పిల్లలను లేటుగా కనడం, పిల్లలకు పాలివ్వకపోవడం వంటివి మహిళ్లలో రొమ్ము క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది.

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు

ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలి. దీని వల్ల ముందుగానే ఈ క్యాన్సర్ గుర్తించవచ్చు. అండర్ ఆర్మ్ ప్రాంతంలో లోపల ముద్దలా గడ్డ కట్టినట్టు చేతికి తగులుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్ కు సంకేతం. అలాగే రొమ్ము పరిమాణం మారినా, సున్నితంగా మారినా, ఆకారం మారినా వెంటనే వైద్యులను కలవాలి. చను మొనల నుంచి స్రావం కారుతున్నా, వాటి రంగు మారినా, వారి పరిమాణం పెరిగినా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చిందేమో అనుమానించాలి. రొమ్ముల్లో నొప్పి రావడం, గడ్డల్లాంటివి తగిలినా కూడా జాగ్రత్తగా ఉండాలి.

రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం యాభై ఏళ్ల వయసులో కంటే తక్కువ వయసున్న మహిళల్లోనే కనిపిస్తోంది. యువతో క్యాన్సర్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. దీనికి కారణం వారు తినే అనారోగ్యకర ఆహారం, చెడు జీవన శైలి, ధూమపానం, మద్యపానం వంటివి. ఊబకాయం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

క్యాన్సర్ తొలిదశలోనే గుర్తిస్తే ప్రాణాంతకం కాకుండా ముందే కాపాడుకోవచ్చు. ప్రస్తుతం క్యాన్సర్ ను నివారించే చికిత్సలు, సర్జరీలు అమల్లోకి వచ్చాయి. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే ప్రాణం పోకుండా రక్షించుకోవచ్చు.

Whats_app_banner