Bitter gourd omelette: కాకరకాయ ఆమ్లెట్ ఇలా చేశారంటే డయాబెటిస్ పేషెంట్లు ఇష్టంగా తింటారు, చేదు కూడా ఉండదు
Bitter gourd omelette: డయాబెటిస్ పేషెంట్లు కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. కాకరకాయ ఆమ్లెట్ ఎలా చేయాలో తెలుసుకుంటే అప్పుడప్పుడు దీన్ని చేసుకొని తినవచ్చు.
Bitter gourd omelette: డయాబెటిక్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. ముఖ్యంగా కాకరకాయను తినడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. కాకరకాయలోని చేదు వల్ల వారు ఏమీ తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకరకాయ ఆమ్లెట్ వేసుకుని చూడండి. ఎవరికైనా ఇది నచ్చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు దీన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి. కాకరకాయ పెద్దగా చేదు లేకుండా ఈ ఆమ్లెట్ ను చేసుకోవచ్చు. కాకరకాయ ఆమ్లెట్ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఈ రెసిపీ ఫాలో అయిపోండి.
కాకరకాయ ఆమ్లెట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
కాకరకాయ - ఒకటి
కోడిగుడ్లు - రెండు
నూనె - ఒక స్పూన్
గరం మసాలా - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కాకరకాయ ఆమ్లెట్ రెసిపీ
1. కాకరకాయలు శుభ్రంగా కడగాలి. పైన ఉన్న తొక్కను కత్తితో చెక్కేయాలి.
2. దాన్ని అడ్డంగా కోసి విత్తనాలను తీసి పడేయాలి. మిగతా కాకరకాయను సన్నగా తురమాలి.
3. స్టవ్ మీద నీళ్లు పెట్టి ఆ నెలలో కాస్త నూనె, చిటికెడు ఉప్పు వేసి బాగా మరిగించాలి.
4. మరుగుతున్న నీటిలో ఈ కాకరకాయ ముక్కలను వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.
5. నీటిని వడకట్టి కాకరకాయ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఆ కాకరకాయ ముక్కలను చేత్తో గట్టిగా పిండితే నీరు బయటకు పోతుంది. అవి పొడిగా అవుతాయి.
7. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్లను కొట్టి బాగా గిలక్కొట్టాలి. అందులోనే గరం మసాలా, కాస్త ఉప్పు వేసుకుని బాగా గిలక్కొట్టాలి.
8. ఉడికించుకున్న కాకరకాయ తురుమును వేసి బాగా కలుపుకోవాలి. ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. నూనె వేడెక్కాక ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకోవాలి.
10. దీన్ని రెండువైపులా కాల్చుకోవాలి. అంతే కాకరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. కావాలంటే దీంట్లో పసుపు వేసుకోవచ్చు.
11. కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కారానికి బదులు పచ్చిమిర్చిని తురిమి వేసుకున్నా మంచిదే.
కాకరకాయను కేవలం డయాబెటిక్ పేషెంట్లు మాత్రమే కాదు అందరూ తినవచ్చు. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అలాగే పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను త్వరగా కరిగిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. కాకరకాయతో చేసిన వంటకాలు తినడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి ఈ రాకుండా ఉంటాయి. అజీర్ణం, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా కాకరకాయ అడ్డుకుంటుంది.