చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ అధిక రక్తస్రావం వల్ల శరీరంలో ఐరన్ లోపం మాత్రమే కాదు, బలహీనత, తల తిరగడంతో పాటూ కొందరిలో గర్భం ధరించడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది తరచూ మందులను వాడుతుంటారు. కానీ దీర్ఘకాలికంగా దీన్నుంచి ఉపశమనం దొరకాలంటే ఈ యోగాసనాలను మీ దినచర్యలో చేర్చుకోండి. మంచి ఫలితం ఉంటుంది.
పీరియడ్స్‌కు ముందు, తర్వాత ఈ యోగా చేయడం ద్వారా పీరియడ్స్ కు సంబంధించిన అనేక సమస్యలను అధిగమించవచ్చు. అయితే సాధారణంగా పీరియడ్స్ వచ్చిన మొదటి ఒకటి లేదా రెండు రోజులు ఏ రకమైన యోగా చేయకపోవడమే మంచిదని చెబుతారు. కానీ అధిక రక్తస్రావం, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మాత్రం పీరియడ్స్ సమయంలోనూ చేయగలిగే అనేక యోగాసనాలు ఉన్నాయి. వాటిలో ఈ రెండూ మంచి ప్రభావం చూపుతాయి.
సుఖాసనం అనేది యోగా భంగిమ. ఇది అత్యంత సులభమైన భంగిమ కూడా. సుఖం అంటే ఆనందం. సుఖాసనం చేయడం వల్ల మనిషికి ఆనందం కలుగుతుంది. ఈ భంగిమలో కూర్చొని ఆహారం తినాలని యోగా నిపుణులు తరచుగా చెబుతారు. సుఖాసనం చేయాలంటే ముందుగా యోగా చాపపై కాళ్లు చాచి కూర్చోవాలి. ఇలా చేసేటప్పుడు, మీ వీపును నిటారుగా ఉంచండి. రెండు కాళ్ళు మోకాళ్ళ నుండి లోపలకు ఒకదాని మీద ఒకటి పెట్టండి. మోకాళ్ళు నేలను తాకుతూ ఉండాలని గుర్తుంచుకోండి. ఈ ఆసనం చేసేటప్పుడు మీ నడుము, మెడ, తల, వెన్నెముక నిటారుగా ఉండేలా చూడండి. ఇప్పుడు కళ్లు మూసుకుని దీర్ఘ శ్వాస తీసుకుని మనసును ప్రశాంతంగా ఉంచి ఒక నిమిషం పాటు ఈ స్థితిలో ఉండండి. ఈ ఆసనాన్ని 3 సార్లు చేయాలి.
బాలాసనం లేదా చైల్డ్ పోజ్.. ఇది చేయాలంటే ముందుగా యోగా మ్యాట్ పై మోకాళ్లపై కూర్చోవాలి. దీని తరువాత రెండు కాళ్ల చీల మండలాలు ఒకదాంతో ఒకటి తాకేలా చూడాలి. ఇప్పుడు ముందుకు వంగి మీ నుదురును నేలకు ఆనించండి. రెండు చేతులను తల వైపుకు సాగదీయడానికి ప్రయత్నించండి. ఇలా చేసేటప్పుడు నాభి దగ్గర సాగిన అనుభూతి రావాలి. ఈ భంగిమలో, కటి భాగం సరైన స్థితిలో ఉంటుంది. ఈ ఆసనాన్ని 2 నుండి 3 నిమిషాలు చేస్తూ, పునరావృతం చేయండి. ఈ ఆసనంలో గర్భాశయ గోడల్లో సంకోచాలు ఏర్పడతాయి. దీనివల్ల పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.