Deepika Padukone: గర్భవతి దీపికా పదుకొణె వేసిన విపరీత కరణి యోగా భంగిమ, ఇది కాబోయే తల్లులకు చేసే మేలు ఎంతో-pregnant deepika padukones viparita karani yoga pose is great for expectant mothers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Deepika Padukone: గర్భవతి దీపికా పదుకొణె వేసిన విపరీత కరణి యోగా భంగిమ, ఇది కాబోయే తల్లులకు చేసే మేలు ఎంతో

Deepika Padukone: గర్భవతి దీపికా పదుకొణె వేసిన విపరీత కరణి యోగా భంగిమ, ఇది కాబోయే తల్లులకు చేసే మేలు ఎంతో

Haritha Chappa HT Telugu
Jul 04, 2024 04:30 PM IST

Deepika Padukone: కాబోయే తల్లి దీపికా పదుకొణెకు యోగాసనాలు వేస్తూ కనిపించింది. ఆమె బేబీ బంప్‌తో విపరీత కరణి యోగాసనం వేసింది. ఇది కాబోయే తల్లులకు ఎంతో మేలు చేస్తుంది.

దీపికా పడుకుణే యోగాసనం
దీపికా పడుకుణే యోగాసనం

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రస్తుతం గర్భవతి. ఆమె బేబీ బంప్‌తో కనిపిస్తోంది. తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో యోగాసనం వేసిన ఫోటోలను షేర్ చేసుకుంది. దీపికా ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేస్తుంది. ఆమె తన వ్యాయామాలను ఇన్‌స్టాగ్రామ్‌లో క్రమం తప్పకుండా పంచుకుంటుంది. అలాగే యోగా అందంగా కనిపించడానికి కాదు, ఫిట్ గా ఉండటానికి వర్కవుట్ చేస్తాను అని ఆమె పేర్కొంది. 38 ఏళ్ల దీపికా పడుకొణే త్వరలో తల్లి కాబోతోంది. ఆమె విపరీత కరణి యోగాసనం వేసింది. ఇది కాబోయే తల్లులకు ఎంతో ఉపయోగకరం.

ఐదు నిమిషాలపాటూ విపరీత కరణి యోగాసనం వేస్తే ఎంతో మంచిది. సంస్కృతంలో దీన్ని తలకిందులుగా వేసే యోగాసనంగా చెప్పుకుంటారు. ఈ యోగా భంగిమలో మీ కాళ్ళను పైకెత్తి గోడకు ఆనించి పడుకోవడం జరుగుతుంది. ఈ పునరుజ్జీవన యోగసనం నాడీ వ్యవస్థను శాంతపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

దీపికా పడుకుణే లాంటి కాబోయే తల్లులు ఈ యోగాను చేస్తే కుషన్ లేదా దిండు వంటివి వేసుకుని చేయడం మంచిది. ఈ వ్యాయామం కండరాలు, కీళ్ళలో నొప్పిని తగ్గిస్తుంది. గర్భం ధరించిన వారిలో కండరాలు, కీళ్ల నొప్పులు కనిపిస్తూ ఉంటాయి. వీపు కింద తలగడ పెట్టుకోవడంవల్ల తక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ వ్యాయామం కాబోయే తల్లులకు సురక్షితంగా ఉంటుంది. ఈ వ్యాయామం కోసం కాళ్ళను ఎత్తినప్పుడు, ఇది వారి చీలమండలో వాపును తగ్గిస్తుంది. అయినప్పటికీ గ్లాకోమా, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారు ఈ యోగా భంగిమను ప్రయత్నించకూడదు.

విపరీత కరణి యోగాసనం ప్రయోజనాలు

ఈ ఆసనం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గర్భం ధరించిన వారే కాదు, సాధారణ వ్యక్తులు కూడా ఈ యోగా చేయడం ఎంతో మంచిది.

మేల్కొన్న వెంటనే

విపరీత కరణి వ్యాయామంతో మీ రోజును ప్రారంభిస్తే ఎంతో మంచిది. ఇది శోషరస, గ్లింఫాటిక్ వ్యవస్థలను ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది మీ ఎగువ అవయవాల వైపు ఆక్సిజన్ రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలో డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను, విషాలను బయటకు పంపిస్తుంది. ఈ వ్యాయామం తుంటి, తొడ కండరాలను సాగదీయడానికి సహాయపడుతుంది.

నిద్రపోయే ముందు

ఈ యోగాను నిద్రపోయే ముందు చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ వ్యాయామం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని శాంతపరుస్తుంది. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. విపరీత కరణి యోగాసనం చేయడం వల్ల కాళ్లలోని బిగువును తగ్గించడానికి సహాయపడుతుంది.

విపరీతా కరణి యోగాను లెగ్-అప్-ది-వాల్ భంగిమ అని కూడా అంటారు. ఇది ఒక ఆల్ రౌండర్ యోగాసనం. ఇది మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని శాంతపరిచే యోగాసనం. మెరుగైన నిద్ర నాణ్యత, మంచి పొట్ట ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచడం, ఒత్తిడి తగ్గించడం వంటి లాభాలు దక్కుతాయి.

Whats_app_banner