Kapotasana Benefits : వెన్నెముక సమస్యలను మాయం చేసే కపోతాసనం.. ఇలా చేయాలి
Kapotasana Benefits : ఆరోగ్యంగా ఉండాలంటే ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నడుము బలోపేతం చేసేందుకు కపోతాసనం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రెటీలు సైతం ఈ ఆసనాన్ని చేస్తుంటారు.
ప్రస్తుత కాలంలో గజిబిజి జీవనశైలితో ఆరోగ్య సమస్యలు అనేకం. శారీరక పని చేసే వారి కంటే కంప్యూటర్ ముందు కూర్చునే వారే ఎక్కువ. దీంతో లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. రోజంతా కూర్చుని పని చేయడం వల్ల వ్యాయామం చేయడం మర్చిపోతున్నాం. చిన్న చిన్న వ్యాయమాలు కూడా చేయడం లేదు. ఇది సోమరితనానికి దారితీయడమే కాకుండా, శారీరక స్థితి కూడా పాడవుతుంది.
మీరు రోజంతా మీ శరీరానికి పని చెప్పకపోతే సమస్యలు ఎక్కువ అవుతాయి. మీ తుంటికి సంబంధించిన వ్యాయమాలు చేయకపోతే.. లావుగా, ఉబ్బి బలహీనంగా మారుతుంది. కండరాలు దెబ్బతింటాయి. వ్యాయామాలు చేయకపోతే నడుము సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. కీళ్ల నొప్పులు, తుంటి నొప్పి, వెన్నెముక సమస్యలు ఒకదానికొకటి కలిసే ఉంటాయి. నడుములో కొవ్వు ఉండనివ్వకుండా ఫ్లెక్సిబుల్‌గా ఉండటం ముఖ్యం. నడుమును బలోపేతం చేసేందుకు ఆసనాలు వేయడం ఉత్తమం. ఇందుకోసం కపోతాసనం ప్రయత్నించండి. ఈ ఆసనం ఎలా వేయాలో చూద్దాం..
మెుదలు వజ్రాసనంలో కూర్చోవాలి. గాలి పీల్చుకుంటూ తలపైకి ఎత్తాలి. ఇలా చేస్తున్నప్పుడు ధ్యాస వెన్నెముక మీద కేంద్రీకరించాలి. ఇప్పుడు గాలి వదిలేస్తూ చేతులో బ్యాలెన్స్ చూసుకుంటూ మెల్లగా వెనక్కు వంగుతూ ఉండాలి. తలను భూమీ మీద ఆనించాలి. తర్వాత వెనక్కు వంగాక చేతులతో కాళ్లను పట్టుకోవాలి. కాళ్ల దగ్గరకు తలను తీసుకురోవాలి. కాసేపు ఇలాగే ఉండాలి.
ఇలా చేస్తే.. వీపునకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఉదర అవయవాలు బాగా పనిచేస్తాయి. నిస్పృహ, సోమరితనం తొలగిపోతాయి. నడుము భాగానికి మంచి వ్యాయామం అవుతుంది. కాలి కండరాలు శక్తివంత అవుతాయి. శ్వాస ప్రక్రియ మెరుగుపడుతంది. మూత్రపిండాలు కూడా చురుగ్గా పనిచేస్తాయి. వెన్నెముక ఫ్లెక్సిబిలిటీగా అవుతుంది.
కపోతాసనం కండరాలను బలంగా చేస్తుంది. బరువు, ఒత్తిడిని నిర్వహించడానికి, మానసిక శ్రేయస్సు, వెన్నునొప్పిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ ఆసనం పిల్లలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.