Morning Walk in Winter| చలికాలంలో నడకకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Morning Walk in Winter - Precautions: రోజురోజుకి చలితీవ్రత పెరుగుతుంది, ఈ చలిని తట్టుకోలేని వారు అనారోగ్యం పాలవుతున్నారు. మీకు నడక అలవాటు ఉంటే ఈ చలికాలంలో ఉదయం లేదా సాయంత్రం ఆరుబయట నడకకు వెళ్తుంటే, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి.
శారీరకంగా ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం చేయడం నిస్సందేహంగా మంచిదే. మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా, మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి మీరు ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా యోగా సాధన చేయడం లేదా జాగింగ్‌కు వెళ్లడం చేయాలి. అయితే శీతాకాలంలో బయటకు వాకింగ్ లేదా జాగింగ్ కోసం వెళ్లడం ఎల్లప్పుడూ మంచిది కాదు. ఈ సీజన్‌లో వీచే చల్లటి గాలుల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా గాలిలో పొగమంచు ఉంటే అది ఏదైనా మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. కొన్నిసార్లు ఈ పొగమంచు చాలా ప్రమాదకరం కూడా కావచ్చు.
చలికాలంలో వాతావరణంలోని విష వాయువులు, చల్లని గాలి ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులను పెంచుతాయి. ఉబ్బసం ఉన్నవారికి లేదా తరచుగా జలుబు బారిన పడే అవకాశం ఉన్నవారికి ఈ సీజన్ ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి సమస్యలను కలిగి ఉన్న వ్యక్తులు ఉదయం పూట, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండటం ఉత్తమం. వ్యాయామం కోసం ఇండోర్ లోని వర్కౌట్ సెషన్‌లను ఎంచుకోవాలి.
చల్లటి చలిలో బయటకు వెళ్లాలని ఆసక్తిగా ఉన్నట్లయితే, ఈ వాతావరణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలి.
Morning Walk in Winter - Precautions- నడకకు వెళ్లివారికి చలికాలం జాగ్రత్తలు
- బయటకు వెళ్లే ముందు స్వెటర్లు, చేతికి గ్లౌజులు, తలకు ఉన్ని టోపీలు, పాదాలకు సాక్స్ ధరించండి.
- నడక కోసం బయటకు వెళ్లేటప్పుడు సాక్స్‌లతో బూట్లు ధరించండి.
- తెల్లవారుజామున వాకింగ్ చేసేవారు పార్క్ లేదా మైదానాన్ని ఎంచుకోండి. రోడ్డుపై నడవడం మానుకోండి. పొగమంచు కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
- నడక పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, చల్లని నీరు త్రాగటం మానుకోండి. మీ శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోటానికి, నడక తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి.
- నెమ్మదిగా మీ నడకను ప్రారంభించండి, నెమ్మదిగానే ముగించండి. ఎక్కువ ఆయాసపడకండి.
- మీరు మొదటి సారి నడక కోసం బయటికి వచ్చినట్లయితే, 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం నడవకండి.
- నడక తర్వాత సమతుల్య ఆహారం తీసుకుంటే మంచిది. చల్లని ఆహారాన్ని తినకూడదు.
- వేకువఝామున బయటకు వెళ్లడం మానుకోండి. ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే నడకకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యకాంతిలో నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల చల్లని గాలి నుండి మిమ్మల్ని రక్షించుకోవడంతోపాటు తాజా అనుభూతిని పొందవచ్చు.
- వయసు ఎక్కువ ఉన్న పెద్దవారు ఎండగా ఉన్నప్పుడు చలికాలంలో ఉదయం 11 తర్వాత నడకకు వెళ్లడం మంచిది. ఆస్తమా ఉన్నవారు ఉదయం పూట అసలు బయటకు వెళ్లకపోవడమే మంచిది.
సంబంధిత కథనం