Spot Jogging | వర్షం కారణంగా జాగింగ్ చేయలేకపోతే ఇంట్లో స్పాట్- జాగింగ్ చేయండిలా!
వర్షాకాలంలో అన్నిసార్లు బయటకు వెళ్లి జాగింగ్ చేయడం కుదరకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఉన్నచోటనే స్పాట్ జాగింగ్ చేయండి.
వర్షాకాలంలో ఉదయాన్నే బయటకు వెళ్లి వ్యాయామం చేద్దామంటే కొన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. జిమ్ చేసే వారైనా, ఆరుబయట జాగింగ్ చేసే వారైనా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనపుడు, భారీ వర్షం కురుస్తున్నప్పుడు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అలాంటపుడు మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య జాగింగ్ చేయవచ్చు. అదెలా అంటారా? దీనినే స్పాట్ జాగింగ్ అంటారు.
స్పాట్ జాగింగ్ అనేది అత్యంత అర్థవంతమైన, సమర్థవంతమైన వ్యాయామాలలో ఒకటి. ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం.. ఏదైనా వర్కవుట్ చేసేముందు కూడా స్పాట్ జాగింగ్ చేయవచ్చు. ఇది మీ కండరాలకు ఎటువంటి ముప్పు కలిగించకుండా మీ శరీరాన్ని వేడెక్కిస్తుంది.
స్పాట్ జాగింగ్ కూడా మనం ఎలా అయితే సాధారణ జాగింగ్ చేస్తామో అలాగే చేయాలి. కానీ ఎటూ కదలకుండా ఉన్న చోటునే జాగింగ్ చేయాలి. ఈ స్పాట్ జాగింగ్ చేస్తున్నప్పుడు కాళ్లను, చేతులను అన్నింటికీ పనిచెప్పాలి. అయితే ముందుకు కదలలేము. ఇది చూడటానికి ఎలా ఉంటుంది అంటే మీరు నడుస్తున్నట్లు, జాగింగ్ చేస్తున్నట్లు ఉంటుంది. కానీ మీరు అక్కడే ఉంటారు.
ఇంకోరకంగా చెప్పాలంటే మీరు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నట్లుగా ఉంటుంది. అయితే ఇక్కడ ట్రెడ్ మిల్ లేకపోయినా మీకు ఆ తరహా కార్డియో వ్యాయామం లభించినట్లవుతుంది.
ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
- ఇది ఏరోబిక్ వ్యాయామం కావడంతో స్థిరమైన కదలికలు, కండరాల సంకోచాన్ని కలిగి ఉంటుంది. ఇది కండరాల్లో వశ్యతను, బలాన్ని ఇంకా స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
- మోకాళ్ల నొప్పులను తగ్గించవచ్చు. మోకాళ్లు, కీళ్లలో బలం పెరుగుతుంది.
- మీ శరీరంలో సమతుల్యతను మెరుగుపరచడంతో పాటు చురుకుదనం పెరుగుతుంది.
- హృదయనాళానికి శక్తినిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెరిగుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
- హృదయ స్పందన రేటును పెంచుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది, కేలరీలను అధిక కొవ్వును కాల్చేస్తుంది.
- రోజులో 30 నిమిషాల పాటు స్పాట్ జాగింగ్ చేస్తే దాదాపు 215 కేలరీలు ఖర్చవుతాయి.
ప్రీ-రన్ మీల్ తీసుకోండి..
ప్రీ-రన్ మీల్ అనేది వ్యాయామం చేసేటపుడు అత్యంత కీలకం. ఖాళీ కడుపుతో మీ శరీరాన్ని కష్టపెడుతూ ఫలితాలను ఆశించలేరు. కాబట్టి జాగ్ చేయడానికి 30-60 నిమిషాల ముందు ఏదైనా తేలికైన ఆహారం తీసుకోవాలి. ప్రీరన్ మీల్ తేలికగా ఉండాలి. శక్తినిచ్చేదై ఉండాలి.
సంబంధిత కథనం