Winter Yoga । చలికాలంలో ఈ యోగా ఆసనాలు అత్యుత్తమం, తప్పకుండా ఆచరించండి!
Winter Yoga: చలికాలంలో వ్యాధులతో పోరాడేలా, సీజనల్ వ్యాధులను నివారించేలా అద్భుతమైన యోగా ఆసనాలు ఉన్నాయి. చలికాలంలో ఉత్తమమైన యోగా ఆసనాలు ఏవో ఇక్కడ చూడండి.
Winter Yoga: యోగా అనేది శరీరం, మనస్సు నియంత్రణలో ఉంచే ఒక అద్భుతమైన సాధనం. లోపలి నుంచి శక్తి నింపి శరీరంలోని ప్రతి అవయవాన్ని కదిలించి, పనితీరును మెరుగుపరిచే ఒక దివ్యాస్త్రం.
ఈ చలికాలంలో మనకు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ మొదలుకొని అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోయి రోగాలబారిన పడతారు. శ్వాస సంబంధ సమస్యలు, గుండె జబ్బులు తీవ్రమవుతాయి. వీటన్నింటికీ యోగాసనాలతో పరిష్కారం చూపవచ్చు. ఎలాంటి ఔషధం వాడకుండా, ఏ వైద్యుడి సహాయం లేకుండా చలికాలం సమస్యలన్నింటిని పరిష్కరించే యోగాసనాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని ఇక్కడ చూడండి.
కాలానుగుణ వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి కింద జాబితా చేసిన కొన్ని యోగా ఆసనాలను సాధన చేయండి
భస్త్రిక
భస్త్రిక అనేది ప్రాణాయామంలో ఒక భాగం. కుడి ముక్కు నుంచి ఒకసారి, ఎడమ ముక్కు నుంచి ఒకసారి గట్టిగా ఊపిరితిత్తులనిండా గాలిని పీల్చి , బంధించి నెమ్మదిగా వదలటం. ఈ ఆసనం సాధన చేస్తే ముక్కు దిబ్బడ, జలుబు, తుమ్ములు, ఎలర్జీ, సైనోసెటీస్ లాంటి వ్యాధులను నివారించవచ్చు.
సూర్య నమస్కారాలు
యోగా, ధ్యానం, ప్రాణాయామం, మంత్రము అన్నీ కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారణ సక్రమంగా జరుగుతుంది.
సేతు బంధాసనము
ఈ ఆసనం మీ భావోద్వేగాలను శాంతపరచడానికి, మీకు ఊరట కలిగించడానికి ఉపయోగపడే ఆసనం. అలాగే ఈ ఆసనం మీ పొట్ట కొవ్వును కరిగించడానికి మంచిది.
పశ్చిమోత్తనాసనం
వెన్నెముకను పైకి వంచి చేసే ఆసనం కాబట్టి దీనికి పశ్చిమోత్తానాసనం (Seated Forward Bend) అని పేరు వచ్చింది. ఈ ఆసనం పొట్ట కండరాలకు, లోపలి అవయవాలకు, వెన్నెముకకు చాలా ఉపయోగపడుతుంది. శ్వాస బాగా పీల్చుకుంటారు. దీనిని అభ్యాసం చేసేవారు దీర్ఘాయుష్మంతులవుతారు
ఉష్ట్రాసనం
ఉష్ట్రం అనే పదానికి సంస్కృతంలో ఒంటె అని అర్థం వస్తుంది. ఒంటెలాంటి భంగిమతో కూడిన వ్యాయామరీతి. దీనిని Camel Pose అని పిలుస్తున్నారు. ఈ యోగా భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి, శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. వెన్నెముక దృఢత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
నౌలి క్రియ
ఈ ఆసనం చేయడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది, జీవక్రియ పెరుగుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది మధుమేహాన్ని దూరం చేస్తుంది.
కపాలభాతి
శీతాలంలో శ్లేష్మం, చెడు గాలిని క్లియర్ చేయడానికి ఈ ఆసనం గొప్పది.
యోగా ఆసనాలు పురాతన కాలం నుంచే భారతీయులు పొందినటువంటి వరం. ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ ఉంది. కాబట్టి యోగాను మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి, ఆరోగ్యంగా జీవించండి.