Makeup tips: దసరా రోజు మెరిసిపోవాలా? ఈ టిప్స్‌తో సింపుల్ మేకప్ ట్రై చేయండి
Makeup tips: పండగ రోజు వేసుకునే మేకప్ మీ వయసు తగ్గించాలి కానీ పెంచేయకూడదు. మీకు తెలీకుండా చేసే కొన్ని మేకప్ తప్పులు ఆ పని చేస్తాయి. అవేంటో తెల్సుకుని జాగ్రత్తగా మేకప్ వేసుకోండి. పండగ రోజు మెరిసిపోండి.
పండగ రోజు మేకప్ ఎందుకు వేసుకుంటాం? అందంగా కనిపించాలనే కదా.! కానీ మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే మాత్రం మనం యవ్వనంగా, అందంగా కనిపించడానికి బదులు వయసు ఎక్కువగా కనిపించేస్తాం. పైగా ముడతలు, మచ్చలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. అలా అవ్వకూడదంటే ఎలాంటి తప్పులు చేయకూడదో చూడండి.
ప్రైమర్ వేసుకోకపోవడం:
చర్మం మీదున్న రంధ్రాలు కనిపించకుండా మృదువుగా మారుస్తుంది ప్రైమర్. ప్రైమర్ వేసుకోకుండా ఫౌండేషన్, ఇతర మేకప్ వేసుకోవడం వల్ల ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే ప్రైమర్ రాసుకోవడం మర్చిపోవద్దు. చర్మం రకానికి తగ్గట్లుగా మ్యాటె, ఆయిల్ బేస్డ్ ప్రైమర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని ఎంచుకోండి.
అప్లికేషన్:
చేతివేళ్లతో ఫౌండేషన్ ,బ్లష్ రాసుకోవడం చాలా సులభంగా అనిపిస్తుంది. తొందరగానూ అయిపోతుంది. కానీ ఇది సరైన పద్ధతి కాదు. దానివల్ల ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే చేతికున్న బ్యాక్టీరియా కూడా చర్మం మీదికి చేరిపోతుంది. బదులుగా ఫౌండేషన్, కన్సీలర్ కోసం మేకప్ స్పాంజి వాడాలి. బ్లష్ కోసం బ్రష్ వాడాలి.
పౌడర్ ఎక్కువగా రాసుకోవడం:
ఎన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడ్డాకూడా చివరికి పౌడర్ రాసుకుంటే ఎబ్బెట్టుగా కనిపించడం ఖాయం. మీ శ్రమంతా వృధా అయినట్లే. ముఖ్యంగా కాస్త వయస్సు ఎక్కువున్న వాళ్లు ఈ తప్పు చేస్తే ముడతలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే చర్మం కొడి పొడిబారినట్లు, నిర్జీవంగా కనిపిస్తుంది. తక్కువ పౌడర్ రాసుకోవడం మేలు. అలాగే పౌడర్ తో వచ్చే ఫ్లాట్ స్పాంజి కాకుండా పౌడర్ బ్రష్ వాడాలి.
గ్లిటర్ హైలైటర్ వాడటం:
హైలైటర్ వాడటం వల్ల మేకప్ అందంగా కనిపిస్తుంది. కానీ మెరిసే గ్లిటర్ హైలైటర్ వాడటం వల్ల లుక్ పాడవుతుంది. అలాగే చర్మం మీదున్న గీతలు, ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. బదులుగా కాస్త ప్రకాశవంతంగా కనిపించే హైలైటర్ వాడటం మంచిది. రోజ్ గోల్డ్ షేడ్ లేదా బంగారు రంగులో వచ్చే హైలైటర్ ఒకసారి ప్రయత్నించి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.
ఐ మేకప్‌లో ఈ తప్పులు చేయొద్దు:
ఐ లైనర్ లావుగా పెట్టుకోవడం, మస్కారా అసలే పెట్టుకోకపోవడం, కన్ను కిందా మీద లైనర్ వాడటం.. ఈ తప్పులన్నీ మేకప్ లుక్ పాడుచేస్తాయి. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ కళ్ల కింద చర్మం మీదే ముడతలు రావడం మొదలవుతాయి. అందుకే అక్కడ లైనర్ పెట్టడం వల్ల అక్కడే దృష్టి పడుతుంది. అలాగే కంటి పైన నలుపు రంగు లైనర్ బదులుగా బ్రౌన్, చాకోలేట్ బ్రౌన్, గ్రే షేడ్ వాడి చూడచ్చు.
మస్కారా పెట్టుకోవడం వల్ల కళ్లు పెద్దగా, రెప్పలు అదంగా కనిపిస్తాయి. ఇది మేకప్ లుక్ పూర్తిగా మార్చేస్తుంది. అందుకే తప్పకుండా మస్కారా రాసుకోండి. అలాగే మస్కారా రెండు కోటింగ్‌లు వేసుకోవాలి. తప్పకుండా చివరగా మస్కారా బ్రష్ వాడి రెప్పలను విడదీయడం మర్చిపోవద్దు. లేదంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.